Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టుల భద్రతపై అధ్యయనం చేయాలి.

Updated : 30 Nov 2023 07:18 IST

అంతన్నారు.. ఇంతన్నారే ఆరోజు

ప్రాజెక్టులను గాలికొదిలేశారే ఈరోజు

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టుల భద్రతపై అధ్యయనం చేయాలి. ప్రాజెక్టుల నిర్వహణకు తగినంతగా సిబ్బంది ఉన్నారో లేదో పరిశీలించి నియామకాలు చేపట్టాలి.

అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల   మట్టి డ్యాంలు కొట్టుకుపోయాక 2021 డిసెంబరు 9న ప్రాజెక్టుల నిర్వహణపై   ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలివి.


సీఎస్‌ అధ్యక్షతన జలవనరులశాఖ  ప్రత్యేక ప్రధానకార్యదర్శి, రెవెన్యూ విపత్తు నిర్వహణశాఖ ముఖ్య కార్యదర్శి, జలవనరులశాఖ ఈఎన్‌సీలతో కమిటీ ఏర్పాటు. ఇది కాకుండా జలవనరులశాఖ ఈఎన్‌సీ అధ్యక్షతన జేఎన్‌టీయూ, ఐఐటీ నిపుణులతో మరో కమిటీ. ప్రాజెక్టులపై తీసుకోవాల్సిన చర్యలను ఈ నిపుణుల కమిటీ అత్యున్నత కమిటీకి తెలియజేస్తుంది. ఆటోమేషన్‌ రియల్‌ టైం డేటాను కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానించే వ్యవస్థపైనా  అత్యున్నత కమిటీ దృష్టి సారిస్తుంది.

2021 డిసెంబరు 9న సీఎం నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.


ఉమ్మడి కడప జిల్లాలోని అన్నమయ్య డ్యాం భారీ వరద ప్రవాహాలకు 2021 నవంబరు 19న కొట్టుకుపోయి 39 మంది మరణించారు. ఎన్నో కుటుంబాల జీవనం దుర్భరమైంది. తర్వాత ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులనూ అత్యవసరంగా ఉద్ధరించాలని దిశానిర్దేశం చేశారు. రెండు కమిటీలు ఏర్పాటు చేస్తామని, అన్ని కోణాల్లో అధ్యయనం చేసేసి ప్రాజెక్టుల నిర్వహణను అద్భుతంగా తీర్చిదిద్దేస్తామని ఆ సమావేశంలో నిర్ణయాలు తీసేసుకున్నారు. తర్వాత 2022 ఆగస్టు 31న ఉమ్మడి ప్రకాశం జిల్లా గుండ్లకమ్మలో ఉన్న ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. మరి ఆ రెండు కమిటీలు ఏం చేసినట్లు? ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ ప్రాజెక్టులో 10 గేట్లు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు అత్యవసరంగా రూ.3 కోట్లు కావాలని ఇంజినీర్లు ప్రతిపాదించినా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆ గేటు కొట్టుకుపోయింది. కాకమ్మ కబుర్లు చెప్పడం తప్ప కార్యాచరణ లేని జగన్‌ ప్రభుత్వ పనితీరుకు ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమైనా కావాలా?


ఇప్పటికీ ఇంతే సంగతులు!

  • అన్నమయ్య డ్యాం ప్రమాదం తర్వాత ప్రాజెక్టుల నిర్వహణను ఏమైనా చక్కదిద్దారా అంటే అదీ లేదు. ఇప్పటికీ గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు చాలినన్ని నిధులు ఇవ్వలేదు. 2022 ఆగస్టు 31న కొట్టుకుపోయిన గేటు ఇప్పటికీ అలాగే ఉంది.
  • 2021 ఆగస్టులో పులిచింతల గేటు కొట్టుకుపోతే నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఇప్పటికీ పూర్తిస్థాయి పనులు చేయలేదు. గేటు ఏర్పాటుచేసినా ఇతర సిఫార్సులు అమలుచేయాలి.
  • జంగారెడ్డిగూడెం మండలం ఎర్రకాలువ జలాశయంలో   నిర్వహణ పనులకు పాలనామోదం ఇచ్చినా ఇప్పటికీ పనులు పూర్తికాలేదు.
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజిలో మొత్తం 175 గేట్లకు 53 గేట్లు మినహా మిగిలినవాటికి మరమ్మతులు చేయాలి. నిధులివ్వక.. పనులు జరగట్లేదు.
  • ఉభయ తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు   నిర్వహణ పనులకూ నిధులు ఇవ్వట్లేదు. పెండింగు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో గుత్తేదారులు సగం పనులు చేసి వెళ్లిపోతున్నారు.
  • జగన్‌ ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్న నమ్మకం లేకపోవడంతో ప్రాజెక్టుల్లో చిన్న చిన్న పనులకూ గుత్తేదారులు ముందుకు రావట్లేదు.
  • ప్రాజెక్టుల్లో కనీసం గ్రీజు పెట్టేందుకు, ఇతర చిన్న పనులకూ ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఇంజినీర్లు చెబుతున్నారు. కొన్ని ఎత్తిపోతల పథకాల్లో పాత సంవత్సరాల నిర్వహణ పనులకు ఇటీవల పాలనామోదం ఇస్తుండటం గమనార్హం.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు