YS Jagan: మాటలు స్వీటు.. చేతలు చేటు

ఎస్సీ, ఎస్టీ నిరుపేదల్ని సొంతకాళ్లపై నిలబడకుండా చేసి... తమపై ఆధారపడి ఉండే కట్టుబానిసలుగా మార్చే ప్రక్రియ జగన్‌ ప్రభుత్వంలో చకచకా సాగుతోంది.

Updated : 01 Dec 2023 08:33 IST

ఎస్సీ, ఎస్టీల ఎదుగుదలకు మోకాలడ్డు
పథకాలన్నింటికీ జగన్‌ సర్కారు గండి
ఉపాధికి దూరం చేసి కట్టు బానిసలుగా మార్చే కుట్ర
జగన్‌ జవాబు చెప్పగలరా?
ఈనాడు - అమరావతి

బాగున్న కాళ్లను నరికేసి...
ఉదారంగా కృత్రిమ కాళ్లు అమర్చి...
చూశావా నేనిచ్చిన కొత్త కాళ్లెంత బాగున్నాయో
అంటే ఎలా ఉంటుంది?


ఉన్నకాలు పోయిందని బాధపడతామా?
కొత్తకాలు వచ్చిందని సంబరపడిపోదామా?
అలా ఇచ్చిన వారు దానకర్ణులా... దానవులా?


అచ్చంగా కాకున్నా రాష్ట్రంలో ఎస్సీ-ఎస్టీలు నేడు ఎదుర్కొంటున్న ప్రశ్న ఇదే!


ఏ సభలో చూసినా మాటలు కోటలు దాటతాయి..
ఆ ఆప్యాయత వెనక అపాయముందని తెలియదు..
చేతులు తలను తడుముతాయి..
ఆ ఆశీర్వాదం వెనక భస్మాసురహస్తముందని తెలియదు...


స్సీ, ఎస్టీ నిరుపేదల్ని సొంతకాళ్లపై నిలబడకుండా చేసి... తమపై ఆధారపడి ఉండే కట్టుబానిసలుగా మార్చే ప్రక్రియ జగన్‌(YS Jagan) ప్రభుత్వంలో చకచకా సాగుతోంది. అట్టడుగు వర్గాలు స్వయంగా ఎదగకుండా... తన దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి బతికేలా దురాలోచనను అమలు చేస్తున్నారు. ఉపాధిని దెబ్బతీయడం ఒక్కటే కాదు... ఎస్సీ, ఎస్టీలకు అందుతున్న నాణ్యమైన విద్య, ఏళ్లుగా అమలవుతున్న ప్రత్యేక పథకాలు, ప్రత్యేక చట్టాల ద్వారా అందుతున్న సాయం... ఇలా అన్నింటికీ జగన్‌ ప్రభుత్వం పాతరేసింది. సొంతంగా ఎదిగే అవకాశాల్లేకుండా జీవితాలను ఛిద్రం చేసింది! అందుకు తిరుగులేని సాక్ష్యాలెన్నో!


సాక్ష్యం: 1

కుల కార్పొరేషన్ల నిర్వీర్యం

కటిక పేదరికాన్ని జయించడానికి పేదలకు కల్పతరువులాంటివి కుల కార్పొరేషన్లు! వీటి ద్వారా స్వయం ఉపాధి రాయితీ రుణాలు పొంది ఎన్నో వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు పేదరికాన్ని జయించాయి కూడా. కానీ పేదల పక్షపాతిగా పైకి చెప్పుకొనే జగన్‌ అధికారంలోకి రాగానే ఒక్క కలంపోటుతో కుల కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ను మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లుగా విభజించి వారికి మేలు చేస్తున్నట్లు చిత్రీకరించారు. వీటిలో డైరెక్టర్లుగా, ఛైర్మన్లుగా పార్టీ నేతలకు ఇబ్బడిముబ్బడిగా రాజకీయ పదవులు కట్టబెట్టి ఆ కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. పోనీ వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఏమైనా లాభం చేకూర్చారా అంటే అదీ లేదు. ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల మంజూరే లేకుండా చేశారు. నవరత్న పథకాల నిధులనే బదిలీ చేస్తూ అంకెల గారడీతో జగన్‌ నిలువునా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలను వంచిస్తున్నారు.

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాది ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా దాదాపు రూ.1000 కోట్లు రాయితీ రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కరికీ ఒక్క రూపాయి రాయితీ రుణం ఇవ్వకుండా ఈ పథకాన్నే నిలిపేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఇచ్చిన రాయితీ డబ్బు రూ.750 కోట్లు బ్యాంకుల్లో ఉంటే... పథకాన్ని కొనసాగించకుండా దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఎస్సీలకు సంబంధించిన నిధులే రూ.200 కోట్లున్నాయి.


సాక్ష్యం: 2

భూమి కొనుగోలు పథకం ఎత్తివేత

పెట్టనమ్మ ఎలాగూ పెట్టదు... పెట్టే కేంద్ర ప్రభుత్వాన్నీ అడ్డుకోవటం జగన్‌ సర్కారు ప్రత్యేకత! దశాబ్దాలుగా కేంద్ర సహకారంతో సబ్సిడీ రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలకు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేశాయి. ఒక్కో ఎస్సీ కుటుంబానికి సుమారు ఎకరం పొలాన్ని కొనుగోలు చేసి సాగు చేసేందుకు ఇచ్చాయి. మూడు దశాబ్దాలుగా వేల మంది ఎస్సీ మహిళలకు అండగా ఉన్న ఈ పథకాన్ని వైకాపా అధికారం చేపట్టాక నిలిపేసింది. ఇదేకాదు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ), జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ)లు ఎస్సీ, ఎస్టీలకు అందించే రుణాలకూ జగన్‌ ప్రభుత్వం మోకాలడ్డింది. కేంద్రం ఇచ్చే నిధులకు తన వంతు వాటా కలిపి రుణాలివ్వకుండా...దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలకు మంగళంపాడింది. 2015-19 వరకూ రాష్ట్రంలో దాదాపు 23 వేల ఎస్సీ, ఎస్టీలకు రూ.515 కోట్లకుపైనే సాయం అందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ టర్ము రుణాల కింద రాష్ట్రానికి రూ.6.54 కోట్లు కేటాయించినా రాష్ట్రప్రభుత్వం రాయితీ ఇవ్వలేదు. చివరకు ఆ ప్రక్రియనే అధికారులు నిలిపేశారు. ఎస్సీ, ఎస్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో... ఎన్నికలు దగ్గర పడుతున్నాయని జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థికాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ) ద్వారా కేంద్రమిచ్చిన రూ.38 కోట్ల నిధులతో తాజాగా 100 మంది లబ్ధిదారులకు మురుగు శుద్ధి వాహనాలను పంపిణీ చేశారు. ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక్క రూపాయి కూడా లేదు.


సాక్ష్యం: 3

నాణ్యమైన విద్యకు తిలోదకాలు

బడుగుల తలరాత మార్చటంలో విద్య అత్యంత కీలకం. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ పిల్లల కోసం 25 ఏళ్లుగా రాష్ట్రంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం అమలవుతోంది. గత తెదేపా ప్రభుత్వం ఈ పథకానికి ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేసి... దాదాపుగా లక్ష మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించింది. కానీ వారు చదువుకొని అభివృద్ధి చెందితే ఇక తమ మాయ మాటలు నమ్మరనుకుంటున్నారో ఏమోగాని... అట్టడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే ఈ పథకాన్ని జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అక్కడితోనే ఆగలేదు... ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటునూ రద్దు చేసింది. ఎంబీబీఎస్‌ సీట్లను అమ్మకానికి పెట్టి... నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీల పిల్లలకు వైద్యవిద్యను దూరం చేస్తున్నారు. విదేశీ విద్యా దీవెన పథకాన్ని సైతం పేద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందకుండా ఎక్కడ లేని నిబంధనలు వెతికి తెచ్చి వారు అర్హతకే నోచుకోకుండా చేశారు. ఇది పైకి కనిపించకుండా ఆర్థిక సాయం పెంచి అమలు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇదే పథకం కింద తెదేపా ప్రభుత్వం 491 మంది ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక సాయమందిస్తే.....జగన్‌ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన ఎస్సీ, ఎస్టీల విద్యార్థుల సంఖ్య 40 కూడా మించలేదు.


సాక్ష్యం: 4

విద్యోన్నతి నిలిపివేత

ఎస్సీ, ఎస్టీలు అత్యున్నత కొలువులు సాధించేందుకు దేశంలోనే పేరెన్నికగన్న కోచింగ్‌ సెంటర్లలో సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఉద్దేశించిన విద్యోన్నతి పథకాన్ని జగన్‌ నిలిపేశారు. గత ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు పెట్టి శిక్షణ ఇప్పించింది. దాదాపుగా 2,500 మందికి ఆర్థిక సాయం అందించింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే ఆలోచనతో జగన్‌ కొత్త ఎత్తుగడ వేశారు. సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వకుండా...ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి ఆర్థికసాయం అందిస్తామనేలా ప్రోత్సాహక పథకాన్ని తెచ్చారు. ఎన్నికల నాటికి దీని ద్వారా అందే సాయమూ పరిమితం కానుంది. ఇదేకాకుండా వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా ఉద్యోగ శిక్షణ ఇచ్చే స్టడీ సర్కిళ్లనూ రాష్ట్రంలో నామమాత్రం చేశారు.


సాక్ష్యం: 5

సంక్షోభ వసతి కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో బడుగుబలహీన వర్గాల సం‘క్షోభం’ ఎలా ఉందో తెలుసుకోవాలంటే సంక్షేమ వసతి గృహాలను చూస్తే చాలు. వసతి గృహాలు, గురుకులాల్లో అధ్వాన పరిస్థితులున్నాయని ప్రభుత్వమే సర్వే చేయించి తేల్చింది. నాడు-నేడు కింద రూ.3,300 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ఏడాది కిందట ప్రకటించినా ఇప్పటివరకు ఆ పనులకు అతీగతీ లేదు. 400 మంది పిల్లలున్న డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా గోడి గురుకుల పాఠశాలలో రెండంటే రెండే టాయిలెట్లు ఉన్నాయి. కనీసం కప్పుకోడానికి దుప్పట్లు కూడా సరిపడా ఇవ్వలేదు. రాష్ట్రమంతా దాదాపు ఇదే పరిస్థితి. ఆఖరికి వంట చేసుకోడానికి గ్యాస్‌ కూడా సరిపడా ప్రభుత్వం అందించడం లేదు. పిల్లలే బయటికి వెళ్లి వంటచెరుకు తెచ్చుకోవాల్సిన దుస్థితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని