Visakhapatnam: ‘రౌడీ’ రాజు

ఆయన అధికార పార్టీలో కీలక నేత. నామినేటెడ్‌ పదవిలో ఉన్నారు. విశాఖపట్నంలో రౌడీ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, దాన్ని ‘రాజు’లా నడిపిస్తున్నారు.

Updated : 01 Dec 2023 12:37 IST

అరాచకశక్తులు, మాఫియా ముఠాలతో సామ్రాజ్యం
కిరాయి మూకలతో భూదందాలు.. బెదిరింపులు
విశాఖపట్నంలో పేట్రేగిపోతున్న అధికార పార్టీ నేత
ఈనాడు- విశాఖపట్నం, అమరావతి

యన అధికార పార్టీలో కీలక నేత. నామినేటెడ్‌ పదవిలో ఉన్నారు. విశాఖపట్నంలో(Visakhapatnam) రౌడీ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, దాన్ని ‘రాజు’లా నడిపిస్తున్నారు. అరాచక శక్తులు, మాఫియా ముఠాలు, అల్లరిమూకలు, గంజాయి బ్యాచ్‌లు, కిరాయి నేరగాళ్లను పెంచి పోషిస్తూ దందాలు చేయిస్తున్నారు. నగరంలో అత్యంత ఖరీదైన, వివాదాల్లో ఉన్న స్థలాలను సెటిల్‌మెంట్లతో చేజిక్కించుకోవడం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ముసుగులో దౌర్జన్యాలకు తెగబడటం... ఇలా ఒకటేమిటి, ఈ రౌడీ రాజు అరాచకాలకు హద్దే లేదు. ప్రతిపక్షాల్లోని ముఖ్యనేతల పర్యటనలకు రౌడీషీటర్లను పంపించి గొడవలు సృష్టించడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇంతకు మించిన అర్హతలు ఏం కావాలని అనుకుందేమో.. ఆ అరాచకశక్తికి వైకాపా అపరిమిత అధికారాలిచ్చింది. ఓ నామినేటెడ్‌ పదవి కట్టబెట్టింది. పార్టీ తరఫున ఇన్‌ఛార్జి బాధ్యతలూ ఇచ్చింది. పోలీసు మొదలు అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లోనూ ఆయన చెప్పినట్టే పోస్టింగులు. ఆయనకు నచ్చని, మాట వినని అధికారుల బదిలీలు. ఇంకేముంది... అధికారం అండతో వ్యవస్థలన్నింటినీ దాసోహం చేసుకుని ఈ రౌడీ రాజు విశాఖలో చెలరేగిపోతున్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన స్వార్థ ప్రయోజనాల కోసం రౌడీషీటర్లను పెంచి పోషించగా.. చివరికి వారే ఆయన కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన నుంచైనా ఈ నాయకుడు పాఠాలు నేర్వలేదు.

రౌడీషీటర్లతో బెదిరింపులు.. బాధితులపైనే కేసులు

ఒకప్పుడు ఎస్టీడీ బూత్‌ నడుపుతూ జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత రౌడీలను అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారంలో పాగా వేశారు. కొన్నాళ్లకు రాజకీయాల్లోకి వచ్చారు. నంద్యాలకు చెందిన వైకాపా నాయకుడొకరు ఈయనకు పెట్టుబడులు పెడతారు. భూకబ్జాదారులను ఈయన తన వెంటే ఉంచుకుంటారు. అధిక వడ్డీలకు రుణాలిచ్చేవారిని తనతో తిప్పుకొంటారు. వారి నుంచి అప్పులు తీసుకున్నవారు వడ్డీలు కట్టలేకపోతే.. వారి స్థలాల్ని బలవంతంగా రాయించుకోవడానికి సెటిల్‌మెంట్ల సమయంలో ఆయన రంగప్రవేశం చేస్తారు. బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తే, తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయిస్తారు. చివరికి విలువైన భూముల్ని బలవంతంగా దక్కించుకుంటారు. కైలాసపురం, తాడిచెట్లపాలెం, కప్పరాడ, ఇందిరానగర్‌, కంచరపాలెం తదితర ప్రాంతాలకు చెందిన అరాచకమూకల్ని ఈయన పెంచి పోషిస్తున్నారు.

అధికారం అండతో కబ్జా దందాలు

ప్రభుత్వ నిర్ణయాల్ని ముందే తెలుసుకుని, ఆయా ప్రాంతాల్లోని భూములను తక్కువ ధరకు కొనేసి.. భారీగా లబ్ధి పొందడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎర్రమట్టి దిబ్బల వద్ద నేరెళ్లవలస సమీపంలో రైతులను భయపెట్టి సుమారు 50 ఎకరాల డీకేటీ పట్టా భూముల్ని తీసుకున్నారు. వాటిని భూ సమీకరణ కింద వీఎంఆర్డీయేకి అప్పగించి భారీగా ప్రయోజనం పొందారు. ఆనందపురం-పెందుర్తి టోల్‌గేట్‌ సమీపంలో రైతుల నుంచి కొంత భూమి కొనుగోలు చేసి, పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కలిపి అందులో వెంచర్‌ వేస్తున్నారు. భీమునిపట్నం సమీపంలో ఈయన భాగస్వామిగా ఉన్న ఓ వెంచర్‌కు రోడ్డు అడ్డంగా వస్తోందని ఏకంగా వీఎంఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌నే మార్పించేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పార్కులు, గ్రీన్‌బెల్ట్‌ స్థలాలు కబ్జా చేశారు. తాజాగా నగరంలోని ఓ కాలనీని మురికివాడగా గుర్తించి, టీడీఆర్‌ ఇవ్వాలంటూ అధికారపార్టీకి చెందిన మరో నాయకుడు పావులు కదపగా తనకు టీడీఆర్‌లో వాటా ఇస్తేనే ఫైల్‌ ముందుకు కదులుతుందని అడ్డంకులు సృష్టించి వాటా దక్కించుకున్నారు.


ఏం నిర్మించాలన్నా కప్పం కట్టాల్సిందే

విశాఖపట్నంలోని ఓ నియోజకవర్గంలో ఏ చిన్న నిర్మాణం జరగాలన్నా తొలుత ఈ నాయకుడికి కప్పం కట్టాల్సిందే. లేదంటే అక్కడ ఆయన రౌడీలు వాలిపోతారు. బెదిరించి వాటా వసూలు చేస్తారు. విశాఖపట్నం కేంద్రంగా అధికార పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఓ అగ్రనాయకుడికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. జీవీఎంసీలో కీలక పదవిలో ఉన్న ఓ కార్పొరేటర్‌... అక్కడ పైరవీలు చేసి, కమీషన్ల ద్వారా వచ్చిన డబ్బులో కొంత ఈ నాయకుడి కార్యాలయ నిర్వహణకు వెచ్చిస్తారు.


ప్రతిపక్షాలపై దాడులు

తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర కోసం విశాఖపట్నం రాగా.. విమానాశ్రయం వద్ద రౌడీమూకల్ని మోహరించి ఆయనకు ఆటంకాలు కల్పించారు. జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమానికి రౌడీమూకల్ని పంపించి అల్లరి సృష్టించారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై కోడికత్తితో జరిగిన దాడిని నిరసిస్తూ విశాఖ విమానాశ్రయంలో పోలీసు స్ట్రైకింగ్‌ ఫోర్సు జీపు అద్దం పగలగొట్టి దాడిచేశారు. క్రికెటర్ల బస్సును అడ్డుకున్నారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇంకా అభియోగపత్రమే దాఖలు కాలేదు. అసలు పాస్‌ లేకుండా విమానాశ్రయంలోకి చొరబడ్డారనేది ఆయనపై ఉన్న అభియోగం. నగరంలోని ఓ డివిజన్‌కు ఉప ఎన్నికలు జరిగినప్పుడు దొంగ ఓట్లు వేస్తున్నవారిని అడ్డుకున్న జనసేన నాయకురాలిపై రౌడీమూక దాడులు చేసింది. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. నగరంలోని ఓ డివిజన్‌లో ఓ శంకుస్థాపన వివాదంలో తెదేపా వారిపై రౌడీలతో దాడి చేయించారు. చివరికి తమ సొంతపార్టీ బహిరంగ సభలు, నియోజకవర్గ సమావేశాలు, యాత్రల్లోనూ ఈ నాయకుడి రౌడీగ్యాంగ్‌ హడావుడే. అక్కడ ఆయన పట్ల ఎవరైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తే వెంటనే ఈ గ్యాంగ్‌ తమదైన పద్ధతిలో వారి నోరు మూయిస్తుంది.


నేరచరితులకే పని ఇస్తారు..

హత్య కేసులు, ఇతర నేరాల్లో నిందితులు, నేరచరిత్ర కలిగిన వారినే కారు డ్రైవర్లుగా, బౌన్సర్లుగా, ఇతరత్రా విధుల్లో తనవద్ద పెట్టుకున్నారు. ఇలాంటి రౌడీలు ఆయన వద్ద దాదాపు వందమందికి పైగా ఉన్నారు. వారిలో ఒక్కొక్కరి కింద కనీసం 10-15 మంది ఉంటారు. ఎక్కడ ఎవరిపై దాడి చేయాలన్నా, అల్లర్లు సృష్టించాలన్నా వీరిని రంగంలోకి దింపుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని