Chandrababu: తిరుపతిలో బాబుకు జన నీరాజనం

తెదేపా అధినేత చంద్రబాబుకు తిరుపతిలో ప్రజలు నీరాజనాలు పలికారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది.

Updated : 01 Dec 2023 09:30 IST

రేణిగుంట నుంచి అలిపిరి చేరుకోడానికి 2.30 గంటల సమయం
నేడు శ్రీవారిని దర్శించుకోనున్న తెదేపా అధినేత

ఈనాడు, చిత్తూరు: తెదేపా అధినేత చంద్రబాబుకు(Chandrababu) తిరుపతిలో ప్రజలు నీరాజనాలు పలికారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. జోరువానలోనూ నగరవాసులు రోడ్ల పక్కన నిరీక్షించారు. రాయలసీమతోపాటు నెల్లూరు నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఉదయం నుంచే రేణిగుంట విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ప్లకార్డులు పట్టుకుని ‘మేమంతా మీ వెంటే’ అంటూ సంఘీభావం తెలిపారు. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి రేణిగుంట చేరుకున్నారు. అభిమానులకు అభివాదం చేసి ఆప్యాయంగా పలకరించారు.

విమానాశ్రయం నుంచి అలిపిరి చేరుకునేందుకు సాధారణంగా 35 నిమిషాలు పడుతుంది. చంద్రబాబు కాన్వాయ్‌ ర్యాలీగా వచ్చేందుకు రెండున్నర గంటల సమయం పట్టింది. కిక్కిరిసిన అభిమానుల మధ్య విమానాశ్రయం వద్దే దాదాపు 30 నిమిషాలపాటు నిలిచిపోవాల్సి వచ్చింది. గాజులమండ్యం కూడలిలో శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు గజమాలతో సత్కరించారు. మహిళలు హారతులు పట్టారు. తిరుపతి శివారు దామినీడు వద్ద బాణసంచా కాల్చి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కాన్వాయ్‌ నగరంలోకి ప్రవేశించింది. భారీ వర్షం పడినా ఎక్కడా ప్రజలు, తెదేపా, జనసేన శ్రేణులు వెనక్కు తగ్గలేదు. చంద్రబాబు వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.

రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకున్న ఆయనకు గాయత్రి సదన్‌ వద్ద డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు దంపతులు వరాహ స్వామిని దర్శించుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్‌ కొండపైకి చేరుకోకముందు తెలుగుదేశం నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం తలెత్తింది. ఎక్కువమంది నాయకులు రావడంపై వారు అభ్యంతరం తెలిపారు. జాబితాలో ఉన్నవారినే అనుమతి ఇస్తామని చెప్పడంతో వివాదం నెలకొంది. మాజీమంత్రి అమరనాథరెడ్డి జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. శుక్రవారం ఉదయం చంద్రబాబు, భువనేశ్వరి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అమరావతికి వెళ్లనున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని