YS Jagan: ఇప్పుడే ఎందుకీ దండయాత్ర?

ఉలుకూ, పలుకూ లేకుండా.. ముందస్తుగా ఎలాంటి చర్చలు లేకుండా జగన్‌ ప్రభుత్వం నాగార్జునసాగర్‌పైకి దండయాత్రకు వెళ్లింది.

Updated : 01 Dec 2023 10:38 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసమేనా?
సాగర్‌ 13 గేట్ల స్వాధీనానికి పోలీసుల యత్నం
తెలంగాణ ఎన్నికల వేళ దూకుడు

ఈనాడు, అమరావతి: ఉలుకూ, పలుకూ లేకుండా.. ముందస్తుగా ఎలాంటి చర్చలు లేకుండా జగన్‌(YS Jagan) ప్రభుత్వం నాగార్జునసాగర్‌పైకి దండయాత్రకు వెళ్లింది. తెలంగాణలో పోలింగుకు కొద్ది గంటల ముందు వైకాపా ప్రభుత్వానికి హఠాత్తుగా రాష్ట్ర హక్కులు గుర్తొచ్చాయి. కీలక ఎన్నికల వేళ రాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించేందుకు వ్యూహం రూపొందించారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు సాధించేందుకా? పక్క రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసమా అన్న చర్చకు దారితీసింది. తాగునీటి కోసం కుడి కాలువకు నీళ్లు విడుదల చేయాలని నవంబరులో ఏపీ అధికారులు అడిగిందీ లేదు. తెలంగాణ కాదన్నదీ లేదు. నాలుగున్నరేళ్లుగా ఏనాడూ రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కీలక రాజకీయ తరుణంలో ఇంత హడావుడిగా నాగార్జునసాగర్‌ 13 గేట్లు స్వాధీనం చేసుకుంది. తాగునీటి అవసరాలకు అంటూ 2,000 క్యూసెక్కుల నీటిని కుడి కాలువ నుంచి విడుదల చేసింది.

ఏమిటీ వివాదం?

రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలనే నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయం సరిగా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్‌ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉంటాయి. కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉండేవి. తాజాగా ఇలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. ఈ నెలలో సాగర్‌ కుడికాలువ నుంచి నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ఇండెంటు పంపిన దాఖలాలూ లేవు. నీటి విడుదలకు ఈ రెండు నెలల్లో ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్‌ డిమాండు చేస్తోంది. కానీ దీనిపై సీఎం ఇంతవరకూ గట్టిగా మాట్లాడిందీ లేదు. అలాంటిది ఇప్పుడు పోలీసులు దండయాత్ర చేయడంలోని నిగూఢ అర్థం చర్చనీయాంశమవుతోంది.

ముందస్తు ప్రయత్నాలు చేయలేదేం?

ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణాలో కరవు వచ్చింది. త్రిసభ్య కమిటీ అక్టోబరు 6న సమావేశమయింది. ఉమ్మడి జలాశయాల్లో నీళ్లు లేనందున సాగుకు నీటిసరఫరా కష్టమని తేల్చారు. సాగర్‌, శ్రీశైలంలో ఉన్న 80 టీఎంసీల నీళ్లను 2024 జూన్‌ వరకు తాగునీటికే రెండు రాష్ట్రాలూ వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సాగర్‌ కుడి కాలువకు 15 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అక్టోబరు 24న తాగునీటి కోసం 5 టీఎంసీల నీళ్లు కుడి కాలువకు విడుదల చేశారు. మూడు నెలలకోసారి 5 టీఎంసీలు తీసుకుని చెరువులు నింపాలనేది ప్రణాళిక. కుడి కాలువకు నీళ్లు విడుదల చేయాలని అధికారులు ఇండెంట్‌ పెట్టిన దాఖలాలు లేవు. ఎప్పుడో ఏళ్ల కిందట సాగర్‌ గేట్లు తమ భూభాగంలో ఉన్నందున తాము నిర్వహించుకుంటామని లేఖ రాయడం తప్ప ఇటీవల దీనిపై ఎలాంటి వివాదమూ రేగలేదు. ఇప్పుడు హఠాత్తుగా పోలీసులతో గేట్ల స్వాధీనానికి ప్రయత్నించడమే అనుమానాలకు తావిచ్చింది. ‘తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నందున అక్కడి పోలీసుల నుంచి ప్రతిఘటన ఉండదని, ఇప్పుడు ఈ పని చేశాం’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు అన్నారు. తర్వాత మళ్లీ తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోరన్న నమ్మకం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని