IT Jobs in AP: కంపెనీలు రావడం లేదేంటి బ్రో!

 రాష్ట్రంలో ప్రభుత్వం నైపుణ్య శిక్షణల్ని నిలిపేసిన ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాంగణ నియామకాలు భారీగా పడిపోయాయి.

Updated : 01 Dec 2023 10:33 IST

ప్రాంగణ నియామకాల్ని మొదలుపెట్టని ఐటీ దిగ్గజ సంస్థలు
గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన ఉద్యోగాలు
హై ఎండ్‌ నైపుణ్య వర్సిటీ, శిక్షణల్ని అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం

 రాష్ట్రంలో ప్రభుత్వం నైపుణ్య శిక్షణల్ని నిలిపేసిన ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాంగణ నియామకాలు భారీగా పడిపోయాయి. నియామకాలకు వస్తున్న కొద్దోగొప్పో కంపెనీలు... అభ్యర్థుల నైపుణ్యాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ విద్యార్థుల శిక్షణ కోసం హై ఎండ్‌ నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్‌ దాన్ని అటకెక్కించారు. నైపుణ్య కళాశాలల్లో అభ్యర్థులకు అవసరమయ్యే శిక్షణ ఇవ్వడం లేదు. సాధారణ పరిస్థితుల్లో నైపుణ్యాలు కొంచెం తక్కువున్నా కంపెనీలు అభ్యర్థుల్ని తీసుకుంటాయి. తక్కువ సంఖ్యలో ఉద్యోగాలిస్తున్నప్పుడు మెరికలనే ఎంచుకుంటాయి. నైపుణ్యాల్ని అందించకుండా విద్యార్థులకు ప్రభుత్వం ద్రోహం చేసింది.

టీ రంగంలో 25 ఏళ్ల తర్వాత తొలిసారి భారీ సంఖ్యలో ప్రాంగణ నియామకాలు తగ్గాయి. విద్యా సంవత్సరం ముగింపునకు వస్తున్నా ఐటీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో నియామకాల్ని చేపడుతున్న దాఖలాల్లేవు. ఎక్సెంచర్‌, వర్చుసా, ఐబీఎం, కొన్ని స్టార్టప్‌ సంస్థలు.. అరకొరగా చేపట్టాయి. ఎల్‌అండ్‌టీ మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్‌, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్‌ సంస్థలు నియామకాలపై ఇంతవరకు ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, విప్రో సంస్థలు కొన్ని కళాశాలల నుంచి డేటా తీసుకున్నా నియామకాలకు వచ్చేదీ లేనిదీ చెప్పలేదు. టీసీఎస్‌ జనవరిలో కళాశాలలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఆఫర్‌ లెటర్లు పొందిన వారికి ఉద్యోగాల్ని ఇవ్వడంపైనే ఇన్ఫోసిస్‌ దృష్టి సారించింది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో జులై నుంచి ప్లేస్‌మెంట్ల ప్రక్రియ మొదలై అక్టోబరుతో దాదాపుగా ముగుస్తుంది. ఏవో కొన్ని కంపెనీలు మాత్రం జనవరి దాకా నియామకాల్ని చేపడుతుంటాయి. 

సగానికి పైగానే..

విశాఖపట్నంలోని ఓ కళాశాల ఏటా 2 వేలకు పైగా ఉద్యోగాలకు ఆఫర్‌ లెటర్లు పొందుతోంది. ఈ ఏడాది 250 మాత్రమే వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విజయవాడలోని ఓ కళాశాలకు గతేడాది 1,100 ఆఫర్‌ లెటర్లు రాగా.. ఈసారి ఆ సంఖ్య 500 దాటలేదు. గుంటూరులోని ఓ ముఖ్య కళాశాలలో గతేడాది 1,200 మంది ఆఫర్‌ లెటర్లు పొందారు. ఈసారి 200 మందికే కొలువులు దక్కాయి. రాయలసీమలోని ఓ ప్రముఖ కళాశాలలో గతేడాది 90 శాతం ప్రాంగణ నియామకాలు ఉండగా.. ఈసారి 25 శాతమే లభించాయి.


ఫ్రెషర్స్‌లో ఆందోళన

టీ కంపెనీలు విధిస్తున్న కోతల ప్రభావం ఫ్రెషర్స్‌పై పడింది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్థిక పరిస్థితి మందగమనం, కొవిడ్‌ సమయంలో చేపట్టిన అధిక నియామకాల కారణంగా సంస్థలు ఇప్పుడు కొత్త ఉద్యోగాలపై వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. కొన్ని స్టార్టప్‌ కంపెనీలు తక్కువ మందిని తీసుకుంటుండగా.. సర్టిఫికేషన్‌ ఉన్న వారికి ప్రాధాన్యమిస్తున్నాయని ఓ అధికారి పేర్కొన్నారు. కృత్రిమ మేధ, చాట్‌ జీపీటీలాంటి సాంకేతికత కూడా కొత్త నియామకాలపై ప్రభావం చూపే అవకాశముందని అధ్యాపకులు చెబుతున్నారు. మరోపక్క టీఎసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లాంటి దిగ్గజ కంపెనీల్లో రెండో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 16,612 మేర తగ్గింది. ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ, తగ్గడం అనేది అరుదు. ఈ పరిణామం ఉద్యోగార్థుల్ని కలవరపెడుతోంది. కరోనా తర్వాత ఐటీ నియామకాలు పెరగడంతో చాలా కళాశాలలు కోర్‌ ఇంజినీరింగ్‌ సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ లాంటి బ్రాంచ్‌లను తగ్గించుకొని కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, ఐటీ కోర్సుల్ని పెంచేశాయి. వీటిలో విద్యార్థులు భారీగా చేరారు. ప్రాంగణ నియామకాలు లేకపోవడంతో ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు. 2024 ఏప్రిల్‌ తర్వాతే కంపెనీలు నియామకాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అప్పటిదాకా విద్యార్థులు నైపుణ్యాల్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. 


నైపుణ్య దారుల్ని మూసేసి..

విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు ఉంటేనే సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఉద్యోగాలిస్తాయి. తెదేపా హయాంలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్ని విరివిగా నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక వాటిని ఆపేసింది. కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిలైన సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ విద్యార్థులకు ఉపయోగపడే సీమెన్స్‌ ప్రాజెక్టును ప్రభుత్వం మూలకు నెట్టింది. నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో యంత్రాలు తుప్పు పట్టిపోతున్నాయి. రాష్ట్రంలో శిక్షణ ఇవ్వకపోతుండటంతో విద్యార్థులు చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్తున్నారు. శిక్షణకే రూ.లక్ష దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది పేదవారికి పెనుభారంగా పరిణమించింది. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు విశాఖపట్నంలో ప్రత్యేక నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం జగన్‌ ఇప్పటికీ హామీని నిలబెట్టుకోలేదు. నైపుణ్య కళాశాలల్లోనూ విద్యార్థులకు ఉపయోగపడే శిక్షణ ఇవ్వడం లేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని