ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన

భూమ్‌భూమ్‌, ఆంధ్రాగోల్డ్‌ వంటి పేర్లతో ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని రంగు నీళ్లతో కల్తీ చేసి విక్రయిస్తున్నాడో వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ ఘటన వెలుగు చూసింది.

Updated : 01 Dec 2023 08:12 IST

సేల్స్‌మన్‌తో కుమ్మక్కై ఓ వ్యక్తి నిర్వాకం

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: భూమ్‌భూమ్‌, ఆంధ్రాగోల్డ్‌ వంటి పేర్లతో ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని రంగు నీళ్లతో కల్తీ చేసి విక్రయిస్తున్నాడో వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించి ఇద్దరిని జిల్లా ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎక్సైజ్‌ అధికారి(డీపీఈవో) వై.శ్రీలత గురువారం తెలిపిన ప్రకారం.. ధవళేశ్వరానికి చెందిన దొడ్డి జోగేశ్వరరావు అనే వ్యక్తి.. 180 ఎంఎల్‌ ఆంధ్రాగోల్డ్‌ మద్యం సీసాలను వివిధ ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద కొనుగోలు చేసేవాడు. వాటిలో సగం మద్యాన్ని తీసివేసి రంగు నీళ్లతో నింపేవాడు. అనంతరం నకిలీ లేెబుల్‌, స్టిక్కర్లను అతికించి వాటిని నగరంలోని ఆల్కట్‌తోట సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇవ్వగా అక్కడ వాటిని విక్రయించేవారు. ఆ దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న కడియం వీరవెంకట సత్యనారాయణ నిందితుడితో కుమ్మక్కై ఈ మోసానికి సహకరించాడు. వీరిద్దరూ కలిపి రెండు నెలలుగా ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. రూ.130 విలువ గల 180 ఎంఎల్‌ సీసాను జోగేశ్వరరావు రూ.110కి సత్యనారాయణకు ఇవ్వగా అతడు రూ.140కి దుకాణంలో విక్రయించేవాడు. వీరిద్దరూ నేరం ఒప్పుకోవడంతో అరెస్టు చేసినట్లు డీపీఈఓ తెలిపారు. ప్రభుత్వ దుకాణంలో ఉన్న 39 నకిలీ మద్యం సీసాలతో పాటు జోగేశ్వరరావు వద్ద లభించిన 200 సీసాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.31 వేలు ఉంటుందన్నారు. మద్యంలో కలిపింది రంగునీళ్లా లేదంటే ఏమైనా రసాయనాలా అన్నది తెలుసుకునేందుకు నమూనాలను ల్యాబ్‌కు పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని