Cyclone Michaung: తుపాను గమనంపై వాతావరణ మార్పు ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారొచ్చని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. అది తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావడం లేదు.

Updated : 01 Dec 2023 09:36 IST

‘మిచౌంగ్‌’ ఎక్కడ తీరం దాటేనో..!

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారొచ్చని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. అది తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావడం లేదు. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఏర్పడే తుపాన్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలలో తీరం దాటుతాయి. వాతావరణ మార్పు కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు తుపాన్లు ఉత్తరదిశగా వెళ్లిపోయాయి.తమిళనాడు నుంచి ఏపీ వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం దీనికి ఒక కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఈ ఏడాది రెండు తుపాన్లు దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం నెలకొంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఆశించినంతగా వర్షాలు కురవలేదు. పసిఫిక్‌ సముద్రం మీదుగా వచ్చే తూర్పుగాలుల ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మంచి వర్షపాతం నమోదవుతోంది. గతంలో తూర్పుగాలుల ప్రభావం రాష్ట్రం వరకూ ఉండి.. మంచి వర్షాలు పడేవి. ప్రస్తుతం ఆ గాలులు తమిళనాడు వరకే పరిమితమయ్యాయి. ‘ఇటీవల కాలంలో తుపాన్ల గమనాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది. ఉష్ణోగ్రతలో 1.5 డిగ్రీల పెరుగుదల, కాలుష్యం అధికమవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. ‘మిచౌంగ్‌’ తుపాను దిశ మార్చుకుంటే ఇప్పట్లో రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అవకాశాల్లేవు. అది ఉత్తరకోస్తా ప్రాంతంలో తీరం దాటితే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది’ అని ఏయూ వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు భానుకుమార్‌ తెలిపారు.

ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం శుక్రవారానికి వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు గురువారం తెలిపారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారానికి తుపానుగా మారుతుందన్నారు. తర్వాత వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారానికి ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా మధ్యలో తీరానికి చేరువగా వచ్చే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తుపాను తీరం దాటే విషయమై శుక్రవారానికి స్పష్టత వచ్చే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్‌’ అంచనా ప్రకారం తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా కదులుతోంది. అది తుపానుగా మారేందుకు సముద్రం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని