మేం నిరాధార ఆరోపణలు చేయలేదు!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్‌ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది.

Updated : 01 Dec 2023 05:53 IST

వాస్తవాలను పరిగణనలోకి తీసుకునే కుంగుబాటుకు కారణాలు చెప్పాం
మేడిగడ్డ బ్యారేజీలో పలు లోపాలున్నాయి...
తెలంగాణ ఆరోపణలపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ లేఖ

ఈనాడు హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్‌ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. తాము నిరాధార ఆరోపణలు చేశామనడం సరైంది కాదని పేర్కొంది. ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్‌,.క్వాలిటీ కంట్రోల్‌, నిర్వహణలో లోపాలున్నాయని తేల్చిచెప్పింది. తాము లెవనెత్తిన అంశాలకు కట్టుబడి ఉన్నామని.. నివేదికలో తాము పేర్కొన్న అంశాలకు రాష్ట్రం సమాధానం ఇవ్వలేదని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ సంజయ్‌కుమార్‌ సిబల్‌ తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ సూచనమేరకు మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో కుంగిన వంతెనను, దెబ్బతిన్న పియర్స్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ ప్రణాళిక, డిజైన్‌తో సహా పలు లోపాలను పేర్కొంది. దీనిపై తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వివరణ ఇస్తూ ఆరోపణలు చేశారు. అంశాలవారీగా సమాధానమిచ్చారు.ఈ విషయంపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ తిరిగి సమగ్ర సమాధానమిచ్చింది. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి... ‘‘మేడిగడ్డ బ్యారేజీ పియర్స్‌ కుంగడంపై మేం పేర్కొన్న అంశాలకు తెలంగాణ సమాధానం ఇవ్వలేదు.

వైఫల్యాలకు గల కారణాలపై సమగ్రంగా పరిశీలన చేపట్టాలని సూచించాం. ప్లానింగ్‌, డిజైన్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ లోపాలను చెప్పాం. ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ ఎగువన కదిలాయి. వీటికి పగుళ్లు ఏర్పడడంతో పాటు పక్కన దెబ్బతిన్నాయి. బ్యారేజీ రాప్ట్‌ కదలడం వల్ల ఇది జరిగింది. వైఫల్యానికి గల కారణాలను చెప్పి సాంకేతిక కారణాలను తెలుసుకొనేందుకు సమగ్ర పరిశీలన చేయమన్నాం. దీనివల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మేం నిజాలను పరిగణనలోకి తీసుకొని చెప్పాం తప్ప, నిరాధార ఆరోపణలు చేయలేదు. ముఖ్యమైన సమాచారం కోరితే ఇప్పటికీ ఇవ్వలేదు. పియర్స్‌ పునరుద్ధరణ పనులు చేపట్టే ముందు కారణాలు స్పష్టంగా తెలుసుకోవాలి. బ్యారేజిని ఫ్లోటింగ్‌ స్ట్రక్చర్‌గా డిజైన్‌ చేశారు. కానీ నిర్మాణం మాత్రం దీని ప్రకారం జరగలేదు. ఎగువన, దిగువన కట్‌ ఆఫ్‌ వాల్‌ సీకెంట్‌ పైల్స్‌ కింద రాయి వరకు తీసుకెళ్లారు. దీనివల్ల బ్యారేజీపై ఒత్తిడిలో మార్పు వచ్చింది. సీకెంట్‌ పైల్స్‌కు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌ డేటా లేదు. సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాక్స్‌, లాంచింగ్‌ ఆఫ్రాన్స్‌ తనిఖీ చేయడం కానీ, నిర్వహణ చేయడం కానీ జరగలేదు. ఇది ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో లోపం. ప్రాజెక్టు డీపీఆర్‌ పరిశీలన సమయంలో డిజైన్‌ను కేంద్రజలసంఘం అప్రయిజల్‌ చేయలేదు. రాష్ట్రంలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) ఇచ్చిన సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకొన్నా’’మని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ తాజా లేఖలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని