Hyderabad: కుమార్తెకు సొంత వైద్యం.. ప్రాణం మీదకు తెచ్చిన తండ్రి

ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. చాలామంది సొంతంగా మందులు కొని వేసుకుంటారు. కొందరైతే గూగుల్‌లో వెతికి ఆ మందులు వాడేస్తుంటారు.

Updated : 02 Dec 2023 07:43 IST

అతిగా యాంటీబయాటిక్స్‌ ఇవ్వడంతో మూత్రపిండాల్లో రాళ్లు, ఇన్‌ఫెక్షన్‌

శస్త్రచికిత్స చేసిన వైద్యులు

ఈనాడు, హైదరాబాద్‌: ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. చాలామంది సొంతంగా మందులు కొని వేసుకుంటారు. కొందరైతే గూగుల్‌లో వెతికి ఆ మందులు వాడేస్తుంటారు. ఈ రెండూ ప్రమాదమే. ఇలాంటి ఘటనే నగరంలో జరిగింది. కుమార్తె అనారోగ్యం గురించి ఆన్‌లైన్‌లో వెతికి.. అందులో సూచించిన మందులు తరచూ కొనిచ్చేవాడు ఓ తండ్రి. చివరికి ఆమె ఆరోగ్యం విషమించి.. ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యులు అత్యవసర చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. ఈ వివరాలను ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (ఏఐఎన్‌యూ)లోని కన్సల్టెంట్‌ యూరాలజిస్టు డాక్టర్‌ రాఘవేంద్ర కులకర్ణి శుక్రవారం మీడియాకు తెలిపారు.

ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువతి ఆర్కిటెక్టుగా పనిచేస్తున్నారు. ఆమెకు పదేపదే జ్వరం, మూత్రంలో మంట రావడంతో ఇటీవల ఏఐఎన్‌యూలో చేర్చారు. సీటీ స్కాన్‌ చేసిన వైద్యులు ఆమె మూత్రపిండాల్లో 10-13 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న కొన్ని రాళ్లను గుర్తించారు. యువతిని, ఆమె తండ్రిని ప్రశ్నించినప్పుడు అసలు విషయం తెలిసింది. ఆమెకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు తండ్రి గూగుల్‌లో వెతికి యాంటీ బయాటిక్స్‌ తెచ్చి ఇచ్చేవారని, అవి కూడా సగం కోర్సు వాడేసి వదిలేసేవారని డాక్టర్‌ రాఘవేంద్ర చెప్పారు. అనారోగ్యం వచ్చినప్పుడల్లా ఇలా చేయడం వల్ల శరీరంలో యాంటీ బయాటిక్స్‌ నిరోధకత పెరిగి.. మందులకు లొంగని బ్యాక్టీరియా ఏర్పడిందని తెలిపారు.

అతిగా యాంటీ బయాటిక్స్‌ వాడడం వల్ల ప్రొటీన్లు గట్టిపడి అవి మూత్రపిండాల్లో రాళ్లుగా మారాయని.. అది యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసిందన్నారు. ఆమెకు శస్త్రచికిత్స ద్వారా రాళ్లను తొలగించి.. కోలుకున్నాక డిశ్ఛార్జి చేశామన్నారు. వైద్యుల సూచనలు లేకుండా ప్రతి చిన్న అనారోగ్యానికి యాంటీ బయాటిక్స్‌ మందులు వినియోగించడం ప్రమాదకరమని డాక్టర్‌ రాఘవేంద్ర సూచించారు. అవి కూడా సగం వాడేసి వదిలేస్తే మరింత ముప్పు అని.. మందులకు లొంగని బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని