కేంద్ర బలగాల అధీనంలోకి సాగర్‌

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్రం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి.

Updated : 02 Dec 2023 07:11 IST

అంగీకారం తెలిపిన ఏపీ, తెలంగాణ
గత నెల 28కి ముందున్న స్థితిని కొనసాగించాలని ఏపీకి కేంద్రం సూచన
నాగార్జునసాగర్‌ జల సంఘర్షణ నేపథ్యంలో రంగంలోకి కేంద్ర హోంశాఖ
నీటి విడుదల ఆపాలని ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్రం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. సాగర్‌ నుంచి ఏపీ నీటి విడుదల, ఆ రాష్ట్ర పోలీసు బలగాల మోహరింపు నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, నీటిపారుదల శాఖ అధికారులతో ఆన్‌లైన్‌ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు. గత నెల 29న ఏపీ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి సాగర్‌ కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో తలెత్తిన వివాదంపై భల్లా సమీక్షించారు. గత నెల 28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని ఆయన ఏపీని కోరారు. డ్యాం నిర్వహణ తాత్కాలికంగా సీఆర్‌పీఎఫ్‌ పర్యవేక్షణలో ఉంటుందని సూచించారు. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని వివరించారు. శుక్రవారం రాత్రికే కేంద్ర బలగాలు నాగార్జునసాగర్‌కు చేరుకున్నాయి.

రెండోసారి అతిక్రమణ: తెలంగాణ ఫిర్యాదు

కేంద్రం నిర్వహించిన సమీక్షలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌, సాధారణ పరిపాలన కార్యదర్శి శేషాద్రి, ఈఎన్సీ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు. సీఎస్‌ మాట్లాడుతూ.. ‘‘ఏపీకి చెందిన 500 మంది సాయుధ పోలీసులు గత నెల 29వ తేదీ రాత్రి సాగర్‌ డ్యాంపైకి వచ్చారు. సీసీ కెమెరాలను ధ్వసం చేయడంతోపాటు 5, 7 గేట్ల వద్ద ఉన్న హెడ్‌ రెగ్యులేటర్లను తెరిచి దాదాపు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. యంత్రాంగం అంతా రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం చేసిన ఈ చర్య తెలంగాణలో శాంతి భద్రతల సమస్యను సృష్టించింది. ఏపీ ఈ విధమైన అతిక్రమణలకు పాల్పడటం ఇది రెండోసారి. ఈ చర్యల వల్ల హైదరాబాద్‌ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోని రెండు కోట్ల ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. 2014 నుంచి కొనసాగుతున్న మాదిరిగానే సాగర్‌ వద్ద యథాతథ స్థితిని కొనసాగించండి’’ అని కేంద్రాన్ని కోరారు.

ఏపీది సరైన చర్య కాదు: కృష్ణా బోర్డు

సాగర్‌ నుంచి నీటి విడుదలకు ఎటువంటి ఇండెంట్‌ పెట్టకుండానే ఏపీ బలవంతంగా ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటి విడుదల చేయడం సరైన చర్య కాదని కృష్ణా బోర్డు పేర్కొంది. ఈ మేరకు బోర్డు సభ్యుడు అజయ్‌కుమార్‌ శుక్రవారం ఏపీ జల వనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశారు. ‘‘ఈ ఏడాది అక్టోబరు 9న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నీటి విడుదలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. సాగర్‌ నుంచి ఏపీకి 15 టీఎంసీల కేటాయింపు ఉంది. ఆ కోటాను అక్టోబరు 10-20, వచ్చే ఏడాది జనవరి 8-18, ఏప్రిల్‌ 8-18 తేదీల మధ్య అయిదేసి టీఎంసీల చొప్పున తీసుకోడానికి ఏపీ అంగీకారం తెలిపింది. ఆ మేరకు అక్టోబరులో అయిదు టీఎంసీల విడుదల పూర్తయింది. ఆ తరువాత నవంబరు 30వ తేదీ వరకు నీళ్లు కావాలని ఏపీ నుంచి ఎటువంటి ఇండెంట్‌ రాలేదు. ఏపీ బలవంతంగా నీటిని విడుదల చేసుకుంటోంది. వెంటనే విడుదల ఆపాలి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లుగా శ్రీశైలం జలాశయాన్ని ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో సాగర్‌ ప్రాజెక్టును పోలీసు బలగాలతో అధీనంలోకి తీసుకుని ఫెన్సింగ్‌ వేయడం సరైంది కాదు. దీనిపై తెలంగాణ.. బోర్డుకు ఫిర్యాదు చేసింది’’ అని తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కూడా బోర్డు లేఖ రాసింది.

హేయమైన చర్య: తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం

ఏపీ జల వనరుల శాఖ ఇంజినీర్లు, పోలీసు బలగాలు సాగర్‌ ప్రాజెక్టును ఆక్రమించి నీటిని విడుదల చేసుకోవడం హేయమైన చర్య అని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం పేర్కొంది. కృష్ణా బోర్డు ఇచ్చిన అనుమతుల ప్రకారం మంచినీటికి సంబంధించి అవసరాలను తెలియజేస్తే సులువుగా నీటి విడుదల ఉండేదని సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాం ప్రసాద్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.


కృష్ణా జలాల వివాదంపై నేడు సమావేశం

ఈనాడు, దిల్లీ: కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈమేరకు కేంద్రం తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌లు, సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఛైర్మన్లకు లేఖ పంపింది.  నాగార్జునసాగర్‌, శ్రీశైలం డ్యాం, రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలు, వాటి పరిధిలో ఉన్న ఇతర నిర్మాణాలన్నింటినీ కృష్ణా బోర్డుకు బదిలీచేసే అంశాలపైనా ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని