సభలకు వస్తారా.. చస్తారా!

డ్వాక్రా సంఘాల మహిళలను అధికార వైకాపా రాజకీయ సభలకు తరలివచ్చే ముడిసరకుగా మార్చేశారు. ఊరూ, మండలం, జిల్లా, రాష్ట్రం... ఏ స్థాయిలో సభలూ సమావేశాలు నిర్వహించినా వాటికి భారీగా చేపట్టే జన సమీకరణంతా ఈ డ్వాక్రా మహిళలే!

Updated : 02 Dec 2023 07:05 IST

భయపడిపోతున్న మహిళలు
వైకాపా, సర్కారు సమావేశాలకు బలవంతంగా తరలింపు
రాకుంటే పింఛన్లు, రుణాలు బంద్‌ అంటూ బెదిరింపులు

అదేంటన్నవారిని అరెస్టులు చేస్తూ...
నిరసన తెలిపిన వారిని నిర్బంధిస్తూ...
ప్రశ్నించిన వారిపై విషం చిమ్ముతూ...

...అడుగడుగునా నియంతను తలపిస్తున్న జగనన్న పాలనలో అపురూపమైన ఆడబిడ్డల్ని అరువు వస్తువులుగా పరిగణిస్తున్నారు. రాష్ట్రంలో జగనన్న సభలు, వైకాపా సర్కారు సమావేశాలు... మహిళల పాలిట శాపాలుగా మారాయి. ముఖ్యంగా డ్వాక్రా మహిళలనూ, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్ని ఒత్తిడి చేసి మరీ సభలకు తీసుకువస్తున్నారు. ‘పింఛన్లు తీసుకోవట్లేదా...  సభలకెందుకు రార’ంటూ ఒంటరి మహిళలపై సైతం విరుచుకుపడుతున్నారు. ‘సభలకు వస్తారా... చస్తారా’ అన్నట్లు బెదిరిస్తూ... భయపెడుతున్నారు.

డ్వాక్రా సంఘాల మహిళలను అధికార వైకాపా రాజకీయ సభలకు తరలివచ్చే ముడిసరకుగా మార్చేశారు. ఊరూ, మండలం, జిల్లా, రాష్ట్రం... ఏ స్థాయిలో సభలూ సమావేశాలు నిర్వహించినా వాటికి భారీగా చేపట్టే జన సమీకరణంతా ఈ డ్వాక్రా మహిళలే! ఎక్కడ సభలున్నా ఆటోలలో, వ్యాన్లలో, బస్సుల్లో మహిళలను కుక్కేసి తరలిస్తున్నారు. వారి పరిస్థితి ఎలా ఉన్నా ఈ సభలకు వచ్చి తీరాల్సిందే! రాకపోతే అదిరిస్తారు.. సంక్షేమ పథకాలు ఇవ్వబోమని బెదిరిస్తారు.. ఫైన్‌లంటూ బ్లాక్‌మెయిల్‌కూ దిగుతారు. వీరి పైత్యం ఎంత వరకూ వెళ్లిందంటే.. ఆ మహిళలు పార్టీ సభలకు వచ్చినప్పుడు సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను సంఘం వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేయాలి. అలా చేస్తేనే వారు సభలకు వచ్చినట్లుగా ఆర్పీలు, వాలంటీర్లు రికార్డు చేస్తారు. గతంలోనూ సభలకు డ్వాక్రా సంఘాల మహిళలను తీసుకువచ్చినప్పటికీ... ఇప్పుడు బహుశా ప్రపంచంలో ఎక్కడా లేనంతగా దాదాపు నిర్భందంగా తరలించిన చరిత్రయితే లేదు. ఇది కాదా డ్వాక్రా మహిళల పట్ల ముఖ్యమంత్రి జగనన్న పాపం.

గడప గడపకు... నుంచి సీఎం సభల వరకూ..

సామాజిక న్యాయభేరి, జగనన్న ఆరోగ్య సురక్ష, ఏపీకి జగనే ఎందుకు కావాలి, సామాజిక సాధికార యాత్ర, మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన గర్జన సభలు... ఇలా ఎన్నో రాజకీయ ప్రచార కార్యక్రమాలను అధికార వైకాపా తన రాజకీయ లబ్ధి కోసం చేపడుతోంది. వీటన్నింటికీ జన సమీకరణలో భాగంగా మొదట డ్వాక్రా మహిళలనే తరలిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం... పేరుతో ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరుగుతున్నపుడు వారి వెనుకా డ్వాక్రా సంఘాల మహిళలు ఉండాల్సిందే. అసలు, వీటికీ డ్వాక్రా సంఘాల మహిళలకూ సంబంధం ఏంటి? ఆ మహిళల స్వాభిమానంపై దెబ్బకొడుతూ ఇలా రాజకీయ కార్యక్రమాలకోసం రోడ్లపైకి తీసుకువస్తున్నారు.

బంధించి.. వేధించి!

ముఖ్యమంత్రి సభలకైతే అందరికంటే ముందే, పొద్దుపొద్దున్నే సభాస్థలికి ఈ మహిళలను, పింఛన్‌ లబ్ధిదారులను భారీగా తరలిస్తున్నారు. సభ పూర్తయ్యేవరకూ వెళ్లకుండా కట్టడి చేసేందుకు మూడంచెల బారికేడ్లు పెట్టి, పోలీసులనూ ప్రయోగిస్తున్నారు. సాయంత్రం పూట సభ జరిగినా రోజంతా మండుటెండల్లో మగ్గిపోవాల్సిందే. సీఎం సభల్లో ఇలాంటి ఇబ్బంది తట్టుకోలేక మహిళలు ఆ అడ్డంకులను ఛేదించుకుని బయటకు వెళ్లిన సందర్భాలు అనేకమున్నాయి. వారిని అంతలా హింసించి ఇబ్బందులకు గురి చేసి మరీ సభలకు తరలించాల్సిన అవసరమేంటో ఏలినవారే సెలవివ్వాలి..


రాకపోతే అంతే..

రుణమాఫీకి సంబంధించి డబ్బు ఇవ్వబోం, కొత్త రుణాలూ రాకుండా చేస్తాం, పావలా వడ్డీ ఆపేస్తాం, రాకపోతే ఒక్కొక్కరికీ రూ.200ఫైన్‌ వేస్తాం.... అంటూ ఆయా సంఘాల మహిళలను బెదిరిస్తున్నారు, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. గతేడాది ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చినపుడు ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా పెద్ద ఎత్తున జనసమీకరణకు దిగింది. ఆ సమయంలో సభకు రాకపోతే ఇళ్లకు నీటి సరఫరానీ నిలిపివేస్తామంటూ బెదిరించడంతోపాటు.. అన్నంతపనీ చేసి మరీ భీమిలి మండల పరిధిలోని మహిళలను సభకు తరలించారు. డ్వాక్రా సంఘాల మహిళలనే కాదు, ‘పింఛన్‌ తింటున్నారు కదా? సమావేశాలకు ఎందుకు రారు?’ అంటూ వితంతు, వృద్ధాప్య పింఛన్‌ లబ్ధిదారుల్ని కూడా వాలంటీర్లు, వైకాపా క్షేత్రస్థాయి నేతలు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. అధికారులు, వాలంటీర్లు, వార్డు కార్యదర్శులు, యూసీడీ సిబ్బంది, ఆర్పీలు, వీఏఏలు... ఇలా ఎవరి స్థాయిలో వారు బెదిరిస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి ఎంతమంది మహిళలను తరలించాలనేదానిపై వీఓఏలు, ఆర్పీలకు లక్ష్యాలనూ నిర్దేశిస్తున్నారు. ‘ఎన్ని పనులున్నా మానుకుని సభలూ, సమావేశాలకు వెళ్లాల్సి వస్తోంది. వెళ్లకపోతే ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తారో? ఏ సాయం అందకుండా ఆపేస్తారోనన్న భయం’ అంటూ డ్వాక్రా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణాలతోనే చాలా మంది సభలకు వస్తున్నారు. వస్తూనే సభాస్థలి వద్ద సెల్ఫీ తీసుకుని ఫోటోను వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసి సమావేశం ప్రారంభమయ్యేలోపు లేదా ప్రారంభమవగానే వెనుదిరుగుతున్నారు. వైకాపా చేస్తున్న సామాజిక సాధికార యాత్రల్లో సభల్లో కుర్చీలన్నీ ఖాళీగానే  కనిపిస్తుండడానికి ఇదే ప్రధానం కారణం.


బస్సు యాత్రల్లోనూ..

సామాజిక సాధికార యాత్ర పేరుతో ఇప్పుడు వైకాపా చేపడుతున్న బస్సు యాత్రల సందర్భంగా నిర్వహిస్తున్న సభలకూ డ్వాక్రా సంఘాల మహిళలనే పెద్ద ఎత్తున తీసుకువస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, మహిళ సాధికారత సాధించేశామంటూ యాత్ర చేస్తున్నారు. అదే నిజమైతే ఆ వర్గాలన్నీ స్వచ్ఛందంగా ఈ సభలకు రావాలి కదా మరి? ఆయా వర్గాల నుంచి స్పందన లేదంటే దానర్థం ఏంటి? చేయాల్సింది చేయకపోగా.. చేశామని జనాలను భ్రమింపజేసేందుకు ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సభలూ, యాత్రలూ చేపడుతూ వాటికి డ్వాక్రా సంఘాల మహిళలను రప్పించడాన్ని ఎలా చూడాలి?


ఇదేనా మహిళా సాధికారత!

మహిళల స్వాభిమానంపై దెబ్బకొడుతూ... ఇలా అధికార వైకాపా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలకు వారిని భారీగా తరలించడమేనా మహిళా సాధికారత. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నేతలు చెబుతున్న సాధికారతతో మహిళలకు దక్కిన గౌరవమేంటి..? వారు చెబుతున్నట్లు మహిళా సాధికారత సాధిస్తే మహిళలే స్వచ్ఛందంగా సమావేశాలకు తరలివచ్చి ఈ నాలుగేళ్లలో మాకు దక్కిన గౌరవమిదీ అని చెప్పాలి కదా? అలా కాకుండా బెదిరించి మహిళలకు సభలకు తరలించడం ద్వారా మహిళా సాధికార సాధించేశామంటే అయిపోతుందా?


చేయూతకు ‘చేయి’చ్చి!

45-60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున చేయూత కింద సాయం అందిస్తామని చెప్పి.. దానికి పలు నిబంధనలు పెట్టి 10 దశల తనిఖీ నిర్వహించి లబ్ధిదారుల సంఖ్యని ఏటికేడూ తగ్గిస్తున్నారు. గత ప్రభుత్వంలో పశుమిత్రలుగా పనిచేసిన దాదాపు 3వేల మంది డ్వాక్రా మహిళలను ఇప్పుడు తొలగించారు. 2వేల మంది బీమా మిత్రల నోట్లోనూ మట్టికొట్టారు. ఈ నాలుగేళ్లలో ఇలాంటివి ఎన్నో! అటు ప్రపంచస్థాయిలో ఖ్యాతిగాంచిన డ్వాక్రా సంఘాల్లో స్వయం ఉపాధి పొందుతూ గౌరవంగా జీవిస్తున్న మహిళలను రోడ్లపైకి తేవడం.. ఇటు జనానికి సేవలు చేస్తూ గౌరవ వేతనంతో ఇంటిని నడుపుకొంటున్న గృహలక్ష్మిలకీ ఉపాధి లేకుండా రోడ్డున పడేయడం.. జగనన్న పాపం కాదా!

నేను సీఎంగా కొనసాగినంత కాలం కల్యాణమిత్రలుగా మీరే ఉంటారు. ప్రోత్సాహకాన్నీ పెంచుతా’ అని ముఖ్యమంత్రి జగన్‌ సుమారు 2,500 మంది కల్యాణమిత్రలను నమ్మించారు.
తర్వాత వారిని తొలగించినట్లుగా ఆదేశాలు కూడా లేకుండానే పక్కనపెట్టేశారు.


ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని