CM Jagan: జగనేందిరో... రోడ్డు వేసుడేందిరో

వారంతా కనీస సౌకర్యాల్లేని అభాగ్యులు... కొండకోనల్ని నమ్ముకున్న గిరిజనులు.. పెద్దగా డిమాండ్లు లేని అల్ప సంతోషులు... భారీగా ఏమీ అడగరు... ఇవ్వలేదని ఆందోళనా చేయరు... కానీ... వారంతా ముక్తకంఠంతో కోరుకునేది ఒక్కటే... చిన్న బాట! పండించిన తమ పంటలు, అటవీ ఉత్పత్తులను అమ్ముకోవటానికి... అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లటానికి... దారి కావాలని కోరుకున్నారు!

Updated : 02 Dec 2023 07:39 IST

విసిగి వేసారి సొంతగా నడుం బిగించిన గిరిజనం
కూలి డబ్బులతో శ్రమదానం... రోడ్ల నిర్మాణం
రూ.29 లక్షలూ కేటాయించని ప్రభుత్వం
‘మనకెందుకు జగన్‌?’ అంటున్న ఆదివాసీలు
ఈనాడు, అమరావతి-న్యూస్‌టుడే, యంత్రాంగం

వారంతా కనీస సౌకర్యాల్లేని అభాగ్యులు...
కొండకోనల్ని నమ్ముకున్న గిరిజనులు..
పెద్దగా డిమాండ్లు లేని అల్ప సంతోషులు...
భారీగా ఏమీ అడగరు... ఇవ్వలేదని ఆందోళనా చేయరు...
కానీ... వారంతా ముక్తకంఠంతో కోరుకునేది ఒక్కటే... చిన్న బాట!
పండించిన తమ పంటలు, అటవీ ఉత్పత్తులను అమ్ముకోవటానికి... అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లటానికి... దారి కావాలని కోరుకున్నారు!
అలాగని అద్దాల్లాంటి రహదారులను కాదు... రాళ్లు రప్పలు లేని బాటలైతే చాలనుకున్నారు!
తమకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ప్రతినిధులకు విన్నవించుకున్నారు. కానీ...

మీట నొక్కే కార్యక్రమాల పేరిట కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు చేస్తున్న జగనన్న(CM Jagan) సర్కారుకు... గిరిపుత్రుల అల్ప సంతోషాన్ని కూడా తీర్చే ఆసక్తి లేకపోయింది. అడిగిఅడిగి... విసిగి వేసారిన ఆదివాసీ జనం... ఆగ్రహంతో ‘మనకెందుకు జగన్‌...’ అంటూ తామే నడుం బిగించారు. కూలీనాలీ చేసిన డబ్బును చందాలు వేసుకున్నారు. వివిధ నియోజకవర్గాల్లో రూ.29 లక్షలు జమచేసుకొని 11 రహదారులు వేసుకున్నారు. గిరిజనుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామంటున్న జగన్‌ సర్కారు నాలుగేళ్లలో బాటల కోసం రూ.29 లక్షలు కూడా కేటాయించకపోవటం వారిపట్ల నిర్లక్ష్యానికి నిలువుటద్దం! ఆదివాసీలంటే జగనన్న సర్కారుకున్న అనాసక్తికి... గిరిపుత్రులు చమటోడ్చి వేసుకున్న ఈ దారులే ప్రత్యక్ష నిదర్శనం! జవాబుందా జగనన్నా!


ఆశా కార్యకర్తకు ఉన్న స్పృహ.. సర్కారుకు లేదా?

నిర్మాణం : 3 కి.మీ.
ఎప్పుడు : 2023 జూన్‌-జులైలో..
చందాలు : రూ. 2.5 లక్షలు
నియోజకవర్గం : అరకు (అల్లూరి సీతారామరాజు జిల్లా)
ఎమ్మెల్యే : చెట్టి పాల్గుణ (వైకాపా)

రాళ్లూ రప్పలు, ముళ్ల కంపలతో నిండిన సన్నటి దారిలో.. కటిక చీకటి, జోరు వర్షంలో డోలీల్లో గర్భిణుల కష్టాలను ఆ గిరిజన మహిళ కళ్లారా చూశారు. రోగుల ఆర్తనాదాలను చెవులారా విన్నారు. ఆ అవస్థలు పడలేక కుటుంబాలకు కుటుంబాలు ఊరు వదలి వలస వెళ్లిపోవడం ఆమెను కలచివేసింది. రోడ్డు వేయాలని అధికారులకు విన్నవించినా.. లెక్కలు సరిచూసుకుని గిట్టుబాటు కాదని వారు పట్టించుకోలేదు. అయినా ఆమె పట్టు వదల్లేదు. ఆశా కార్యకర్తగా తనకొచ్చే అయిదారు వేల జీతం నుంచి పొదుపు చేసిన రూ.2.5 లక్షలు ఖర్చు పెట్టి... జేసీబీతో రహదారి కలను సాకారం చేసింది. కాలినడకకూ కష్టంగా ఉండే మార్గంలో... ఇప్పుడు వాహనాలు తిరుగుతున్న ఆ గిరిజన గ్రామం.. అల్లూరి సీతారామరాజు జిల్లా జోలాపుట్‌ పంచాయతీలోని తోటగొడిపుట్‌. ఆ ఆశా కార్యకర్త పేరు దొర జమ్మె. ఆమె ప్రయత్నాన్ని మెచ్చి విజయనగరం జిల్లాకు చెందిన ఓ కళాశాల విశ్రాంత ఉద్యోగులు రూ.1.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అయినా, ప్రభుత్వం మాత్రం ఆమె కృషిని గుర్తించకపోవడం శోచనీయం.


గత ఎన్నికల్లో వైకాపాను నమ్మి గిరిజన ప్రాంతాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులనే వారు గెలిపించారు. అది ఎంత పెద్ద పొరపాటో తెలుసుకునేందుకు వారికి ఎంతో సమయం పట్టలేదు. ‘రోడ్లు వేయండి మహాప్రభో..’ అని నెత్తీనోరూ బాదుకున్నా.. అడవి బిడ్డల ఆక్రందనలను ప్రభుత్వ పెద్దలు   పట్టించుకున్న పాపాన పోలేదు. గిరిజన నేతలకు  ఉప ముఖ్యమంత్రిలాంటి కీలక పదవులు కట్టబెట్టామంటూ ప్రకటించుకునే ముఖ్యమంత్రికి గిరిజనుల పట్ల కనీస కనికరం లేదు. సర్కారుపై ఆశలు లేక, నిరుపేద గిరిజనులే సొంతంగా వేసుకున్న 11 రహదారుల్లో ఆరు.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పీడిక   రాజన్నదొర, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి నియోజకవర్గాలైన సాలూరు, కురుపాం పరిధిలోనే ఉండటం గమనార్హం. మిగతావీ వైకాపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనివే.

ఉపాధి హామీ డబ్బుతో...

రహదారి-1

 • నిర్మాణం: 2 కి.మీ.
 • ఎప్పుడు: 2023 అక్టోబరులో..
 • చందాలు: రూ.50 వేలు
 • నియోజకవర్గం: పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)
 • ఎమ్మెల్యే: భాగ్యలక్ష్మి (వైకాపా)

ఈ చిత్రంలో పలుగూ పారలతో మట్టి పనులు చేస్తున్నవారు... ఉపాధి కూలీలు కాదు. కల్లాలబయలుకు చెందిన ఆదిమ తెగ(పీవీటీజీ) గిరిజనులు. వీరు 7 కిలోమీటర్ల దూరంలోని పాడేరు పట్టణానికి వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల మేర కొండలు, గుట్టలపై నడవాల్సిందే. ప్రభుత్వానికి నాలుగున్నరేళ్లుగా మొర పెట్టుకుంటుంటే.. మూడేళ్ల క్రితం అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్‌ రహదారి ఏర్పాటుకు హామీ ఇచ్చారు. పాడేరు నుంచి ప్రకృతి రమణీయ ప్రదేశమైన మేఘాలకొండకు కల్లాలబయలు మీదుగానే వెళ్లాలి. ఇక్కడికి పర్యాటకులూ పెద్దఎత్తున వస్తుంటారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 5 కి.మీ. మేర రోడ్డు వేయగా.. మరో రెండు కి.మీ. మిగిలింది. రూ.4 కోట్లు వెచ్చిస్తే బీటీ వేయొచ్చు. కానీ ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో కల్లాలబయలు గ్రామస్థులు ఉపాధి పనులకు వెళ్లి సంపాదించిన కూలీ సొమ్ము రూ.50 వేలతో రోడ్డేసుకున్నారు. ఒకప్పుడు కాలినడకకే కష్టంగా ఉన్న దారిలో.. ఇప్పుడు నాలుగు చక్రాల వాహనాలు ప్రయాణిస్తున్నాయి.


125 కుటుంబాలు కలిసి..

రహదారి-2

 • నిర్మాణం: 5 కి.మీ.
 • ఎప్పుడు: 2020 ఆగస్టులో..
 • చందాలు: రూ.5 లక్షలు
 • నియోజకవర్గం: సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా)
 • ఎమ్మెల్యే: పీడిక రాజన్నదొర (ఉప ముఖ్యమంత్రి-గిరిజన సంక్షేమ శాఖ)

సాలూరు మండలం కొదమ పంచాయతీ కేంద్రం నుంచి ఒడిశా సరిహద్దు గ్రామం బారి వరకు అసలు రహదారే లేదు. ఏ అవసరం తీరాలన్నా స్థానికులు కాలినడకన కొండలు, గుట్టల మీదుగా నడిచి వెళ్లాల్సిందే. వైద్యం కోసం డోలీ మోతలు తప్పవు. రహదారి కోసం అధికారులకు మొరపెట్టుకున్నా లాభం లేకపోయింది. చేసేదిలేక గిరిజనులు తమ కష్టాన్నే నమ్ముకున్నారు. కొదమలోని 125 కుటుంబాలు కలిసికట్టుగా తలాకొంత జమ చేసుకున్నారు. ఆ మొత్తంతో నెల రోజులు కష్టపడి రోడ్డు నిర్మించుకున్నారు.


ఊరు మొత్తం కదిలి..

రహదారి-3

 • నిర్మాణం: 6 కి.మీ.
 • ఎప్పుడు: 2020 ఆగస్టులో..
 • చందాలు: రూ.7 లక్షలు
 • నియోజకవర్గం: సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా)
 • ఎమ్మెల్యే: పీడిక రాజన్నదొర (ఉప ముఖ్యమంత్రి-గిరిజన సంక్షేమ శాఖ)

చింతామలలో 110 కుటుంబాలు ఉన్నాయి. స్థానికులు సేకరించిన అటవీ ఉత్పత్తులను అమ్ముకోవాలంటే ఒడిశాలోని సంతలకు వెళ్లాల్సిందే. చింతామల నుంచి సబకుమరికి దాకా 6 కిలోమీటర్లు వెళ్తే తప్ప రోడ్డు కనిపించదు. ఈ రెండు గ్రామాల మధ్యనున్న ప్రదేశం గుట్టలు, పెద్ద పెద్ద రాళ్లతో నిండి ఉంటుంది. నేతలను చాలాసార్లు వేడుకున్నా.. లాభం లేకపోవడంతో ఊరు మొత్తం కదిలింది. స్వచ్ఛందంగా రూ.7 లక్షలను సమీకరించుకున్నారు. నెలరోజులు శ్రమించి మట్టి రోడ్డు వేసుకున్నారు.


ఆరున్నర లక్షలతో..

రహదారి-4

 • మరమ్మతులు: 4 కి.మీ.
 • ఎప్పుడు: 2023 జులైలో..
 • చందాలు: రూ.6.5 లక్షలు
 • నియోజకవర్గం: సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా)
 • ఎమ్మెల్యే: పీడిక రాజన్నదొర (ఉప ముఖ్యమంత్రి-సాంఘిక సంక్షేమ శాఖ)

వర్షాలకు దెబ్బతిన్న సిరివర నుంచి బందమెండంగి మధ్య నాలుగు కిలోమీటర్ల దారిని స్థానికులే బాగు చేసుకున్నారు. ఇందుకోసం సిరివర, పొయిమల గ్రామాలకు చెందిన 36 కుటుంబాలు రూ.6.5 లక్షలు పోగు చేశాయి.  అయిదు రోజులు శ్రమదానం చేసి రోడ్డుకు మరమ్మతులు చేసుకున్నారు.


పలుగూ పార చేతబట్టి...

రహదారి-5

 • మరమ్మతులు: 2 కి.మీ.
 • ఎప్పుడు: 2023 అక్టోబరులో..
 • నియోజకవర్గం: పాలకొండ (పార్వతీపురం మన్యం జిల్లా)
 • ఎమ్మెల్యే: కళావతి (వైకాపా)

ఎగువ ద్వారబందం నుంచి దిగువ ద్వారబందం గ్రామాల నడుమ 2 కి.మీ. మేర తెదేపా ప్రభుత్వ హయాంలో వేసిన ఫార్మేషన్‌ రోడ్డు వర్షాలకు రూపం కోల్పోయింది. గిరిపుత్రుల కష్టాలను చూసి వైకాపా ప్రభుత్వం చలించలేదు. దారిని బాగు చేసుకునేందుకు స్థానికులే నడుం బిగించారు. ఎగువ ద్వారబందం, నడిపి ద్వారబందం గ్రామాలకు చెందిన 60 కుటుంబాల వారు పలుగూ పార చేతబట్టి, శ్రమించి రోడ్డును బాగు చేసుకున్నారు. నడకకు, ద్విచక్ర వాహనాలు తిరిగేందుకు అనువుగా మార్చుకున్నారు.


రహదారి వేసుకున్నాక...

రహదారి-6

 • నిర్మాణం: 4 కి.మీ.
 • ఎప్పుడు: 2023 సెప్టెంబరులో..
 • చందాలు: రూ.3 లక్షలు
 • నియోజకవర్గం: కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా)
 • ఎమ్మెల్యే: పుష్పశ్రీవాణి (మాజీ ఉప ముఖ్యమంత్రి)

ఎగువ తాడికొండ నుంచి దేరుగండ వరకు రోడ్డే లేదు. గిరిజనులంతా కలిసి రూ.3 లక్షలు పోగు చేసుకున్నారు. పది రోజుల పాటు శ్రమించి, జేసీబీ సాయంతో 4 కి.మీ. రోడ్డు వేసుకున్నారు. ఓట్ల కాలం దగ్గర పడింది కదా.. ఇన్నాళ్లూ గిరిజనులు ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూసిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి... రూ.40 లక్షలు మంజూరయ్యాయంటూ ఇటీవల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.


అందరూ కలిశారు...

రహదారి-7

 • మరమ్మతులు: 2.5 కి.మీ.
 • ఎప్పుడు: 2022 సెప్టెంబరులో..
 • చందాలు: రూ.1.12 లక్షలు
 • నియోజకవర్గం: కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా)
 • ఎమ్మెల్యే: పుష్పశ్రీవాణి (మాజీ ఉప ముఖ్యమంత్రి)

గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి నుంచి కొండపైనున్న బయ్యాడ దాకా 2.5 కి.మీ. మేర తెదేపా ప్రభుత్వ హయాంలో మట్టి రోడ్డు వేశారు. ఆ తర్వాత వర్షాలకు అది కొట్టుకుపోయింది. నడిచేందుకు కూడా వీలు లేకపోవడంతో బాగు చేయాలని సర్కారుకు విన్నవించారు. ఫలితం లేకపోవడంతో బయ్యాడకు చెందిన 75 కుటుంబాల వారు... చందాలు వేసుకుని రూ.1.12 లక్షలు పోగు చేశారు. జేసీబీ సాయంతో కొండ అంచుల వెంబడి తొలచి రాకపోకలకు అనువుగా మార్చుకున్నారు.


మూడు గ్రామాలు కలిసికట్టుగా..

రహదారి-8

 • మరమ్మతులు: 4 కి.మీ.
 • ఎప్పుడు: 2023 అక్టోబరులో
 • నియోజకవర్గం: పాలకొండ (పార్వతీపురం మన్యం)
 • ఎమ్మెల్యే: కళావతి (వైకాపా)

పాత పెద్దగూడ, రంగం వలస, ఉసిరికిపాడు ప్రజలకు ఏ అవసరమున్నా.. 4 కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్దగూడ, మర్రిపాడుకు వెళ్లాల్సిందే. ఈ మూడు గ్రామాలను అనుసంధానిస్తూ తెదేపా హయాంలో వేసిన ఫార్మేషన్‌ రోడ్డు వర్షాలకు దెబ్బతింది. ఉపాధి హామీ పథకం కింద బాగు చేయాల్సి ఉన్నా.. జగన్‌ ప్రభుత్వానికి అది పట్టలేదు. దీంతో వారే సొంతంగా రహదారిని బాగు చేసుకున్నారు.


మట్టి రోడ్డూ వేయలేకపోయారు

రహదారి-9

 • నిర్మాణం: 5 కి.మీ.
 • ఎప్పుడు: 2023 జులైలో..
 • చందాలు: రూ.2 లక్షలు
 • నియోజకవర్గం: కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా)
 • ఎమ్మెల్యే: పుష్పశ్రీవాణి (మాజీ ఉప ముఖ్యమంత్రి)

గుమ్మలక్ష్మీపురం మండలంలోని జోగిపురం గ్రామానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే కంబగూడకు దారే లేదు. అక్కడ నివసించే 60 కుటుంబాల ప్రజల కోసం తెదేపా ప్రభుత్వం కొండ, గుట్టల్ని తొలిచి మట్టి రోడ్డు వేసింది. ఆ తర్వాత వర్షాలకు అది దెబ్బతింది. గిరిపుత్రులే రూ.2 లక్షలు సమీకరించుకుని వారంపాటు కష్టించి బాగు చేసుకున్నారు.


నెలన్నరపాటు శ్రమదానం

రహదారి-10

 • నిర్మాణం: 4 కి.మీ.
 • ఎప్పుడు: 2022 మేలో..
 • చందాలు: రూ.లక్ష
 • నియోజకవర్గం: పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)
 • ఎమ్మెల్యే: భాగ్యలక్ష్మి (వైకాపా)

జి.మాడుగుల మండలం లక్కపాడుకు రహదారి సదుపాయం కల్పించాలని ‘స్పందన’లో గిరిజనులకు విన్నవించుకున్నా పట్టించుకున్న వారే లేరు. దాంతో లక్కపాడుతోపాటు పూజబంద, రాసరబంద, పెదవలస గ్రామాల గిరిజనులు సుమారు రూ.లక్ష సమీకరించుకున్నారు. నెలన్నరపాటు శ్రమదానం చేసి 4 కి.మీ. మేర మట్టి రోడ్డును నిర్మించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని