ఆర్‌అండ్‌బీని భయపెడుతున్న తుపాను

రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపాను.. రహదారులు భవనాలశాఖ ఇంజినీర్లను కూడా భయపెడుతోంది. తుపాను తీవ్రతతో రహదారులు దెబ్బతింటే చేతులెత్తేయాల్సిన దుస్థితిలో ఇంజినీర్లు ఉన్నారు.

Updated : 04 Dec 2023 06:22 IST

రోడ్లు దెబ్బతిన్నా మరమ్మతులకు నిధులేవీ?
రెండేళ్లనాటి పనులకూ చెల్లింపుల్లేవు

ఈనాడు, అమరావతి: రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపాను.. రహదారులు భవనాలశాఖ ఇంజినీర్లను కూడా భయపెడుతోంది. తుపాను తీవ్రతతో రహదారులు దెబ్బతింటే చేతులెత్తేయాల్సిన దుస్థితిలో ఇంజినీర్లు ఉన్నారు. రహదారుల మరమ్మతులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం, అత్యవసర పనులకు రూపాయి కూడా లేకపోవడంతో.. విపత్తు నిర్వహణ నిధులతో తాత్కాలిక పనులు మినహా ఇతర పనులు చేసే అవకాశం లేదు. జగన్‌ ప్రభుత్వం రహదారుల గుత్తేదారులకు చెల్లింపులు చేయకపోవడంతో పనులకు ఎవరూ ముందుకొచ్చే అవకాశం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో కురిసే భారీ వర్షాలకు రోడ్లు కోతకు గురవుతాయి. కల్వర్టులు కూలిపోతాయి.

ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు వెంటనే స్పందించి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసి వాహనాలు నిలిచిపోకుండా చూడాలి. ఇందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి కొంత సొమ్ము ఇస్తారు. మిగిలినది ఆర్‌అండ్‌బీకి నిర్వహణ పనుల నిధుల నుంచి వెచ్చించాలి. 2023-24 బడ్జెట్‌లో రోడ్ల నిర్వహణకు వైకాపా ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు రోడ్లపై గుంతలనూ పూడ్చలేకపోతున్నారు. ఇపుడు తుపాను ముంచుకు రావడంతో.. పనులు ఎలా చేయించాలో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు. రహదారుల సాధారణ మరమ్మతులకు కి.మీ.కు రూ.40 వేల చొప్పున బడ్జెట్‌లో కేటాయిస్తారు. తుపాన్లు, వరదలతో రోడ్లు దెబ్బతింటే ఈ నిధులనుంచే కొంత వినియోగిస్తారు.

పనులు చేసే గుత్తేదారులు ఏరీ?

రెండేళ్ల క్రితం తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు పరిధిలో భారీ వర్షాలతో రహదారులు దెబ్బతింటే.. వాటికి విపత్తు నిర్వహణ నిధులతో పనులు చేశారు. ఇప్పటికీ ఆ గుత్తేదారులకు రూ.25 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక గతేడాది రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పనులు చేసిన గుత్తేదారులకు రూ.250 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు ముంచుకొస్తున్న తుపాను తర్వాత రహదారులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాల్సివస్తే.. ఆ గుత్తేదారులు ఎవరూ ముందుకొచ్చే అవకాశం లేదని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని