Cyclone Michaung: ముంచుకొస్తున్న తుపాను

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్‌జాం తుపాను మంగళవారం తీవ్ర తుపానుగా బలపడనుంది.

Updated : 04 Dec 2023 07:38 IST

రేపు మధ్యాహ్నంలోగా దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం
నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు
రైతుల్లో ఆందోళన.. పంటలపై తీవ్ర ప్రభావం
సహాయ చర్యలపై అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం
తిరుపతి జిల్లాలో గోడ కూలి బాలుడి మృతి

ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్‌జాం తుపాను మంగళవారం తీవ్ర తుపానుగా(Cyclone Michaung) బలపడనుంది. ఆ రోజు మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, భారీ నుంచి అతిభారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని హెచ్చరించింది. దీంతో కోస్తా, రాయలసీమ జిల్లాలు వణుకుతున్నాయి. ఆదివారం నుంచి తీరంలో అలల తీవ్రత పెరిగింది. తుపాను ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలో శనివారం రాత్రి నుంచే మొదలైంది.

రెండు రోజులుగా తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. శనివారం తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలాచోట్ల భారీవర్షాలు కురిశాయి. ప్రకాశం, అనంతపురం, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. వర్షాలకు పూరి గుడిసె గోడ కూలి తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని చిందేపల్లి ఎస్టీకాలనీకి చెందిన బాలుడు యశ్వంత్‌ (4) మృతిచెందాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో కోతకు సిద్ధంగా ఉన్న వరి, ఆరబెట్టిన ధాన్యం రాశులకు నష్టం వాటిల్లుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మిరప తదితర పంటలు సాగు చేసిన రైతులకు నిద్ర కరవైంది.

మంగళవారం మధ్యాహ్నంలోగా..

తుపాను ఆదివారం సాయంత్రానికి పుదుచ్చేరికి 260 కి.మీ., చెన్నైకి 250 కి.మీ., నెల్లూరుకు 380 కి.మీ., బాపట్లకు 490 కి.మీ., మచిలీపట్నానికి 500 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి సోమవారం తీవ్ర తుపానుగా మారనుంది. మంగళవారం మధ్యాహ్నంలోగా నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు.

గంటకు 90-110 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముంది. సోమ, మంగళవారాల్లో రాయలసీమ, కోసాంధ్రల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, బుధవారం కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణకోస్తాలో సోమవారం ఉదయం నుంచి 80-100 కి.మీ. వేగంతో, సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు 90-110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి.  తుపాను నేపథ్యంలో పాఠశాలలకు స్థానిక సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌కుమార్‌ ఆదేశాలిచ్చారు. కృష్ణా, సత్యసాయి, శ్రీకాకుళం జిల్లాల కలెక్టరేట్లలో సోమవారం స్పందన కార్యక్రమాలు రద్దు చేశారు.

ధాన్యంలో తేమ శాతాన్ని చూడవద్దన్న సీఎం

తుపాను నేపథ్యంలో సహాయ చర్యలపై జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘ధాన్యంలో తేమ శాతం లాంటి సాంకేతిక అంశాల్ని పక్కన పెట్టండి. రైతుల దగ్గరున్న ధాన్యాన్ని సేకరించి వెంటనే మిల్లులకు తరలించండి’ అని పేర్కొన్నారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం ఆయన అధికారులతో సమీక్షించారు.

ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాని

తుపానుపై ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడారు. రాష్ట్రానికి అన్నివిధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు