‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’

‘పిచ్చిపిచ్చిగా ఉందా.. ఏమి ఒళ్లు బద్ధకమా.. చెబితే అర్థం కాదా యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’ అంటూ కర్నూలు నగరపాలక సంస్థకు చెందిన ఓ అధికారి వార్డు సచివాలయ అడ్మిన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 05 Dec 2023 03:06 IST

‘ఆడుదాం ఆంధ్రా’లో వెనుకబాటుపై అధికారి ఆగ్రహం
కర్నూలులో ఇద్దరు సచివాలయ అడ్మిన్ల సస్పెన్షన్‌

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-కర్నూలు నగరపాలకసంస్థ: ‘పిచ్చిపిచ్చిగా ఉందా.. ఏమి ఒళ్లు బద్ధకమా.. చెబితే అర్థం కాదా యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’ అంటూ కర్నూలు నగరపాలక సంస్థకు చెందిన ఓ అధికారి వార్డు సచివాలయ అడ్మిన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆడుదాం.. ఆంధ్రా’ రిజిస్ట్రేషన్లు చేయడంలో వెనకబడ్డామని.. ఇతర జిల్లాల్లో లక్షల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్లు చేయట్లేదని ఇద్దరు అడ్మిన్లను సస్పెండ్‌ చేశారు. సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన అడ్మిన్లతో ఇలా మాట్లాడారు. ‘వాలంటీర్లతో రిజిస్ట్రేషన్లు చేయించలేరా.. అందరూ ఒకటి, రెండు, మూడు.. చేస్తే ఎలా? వారం రోజులుగా బతిమాలుతుంటే ఎందుకు స్పందించడం లేదు? ఏమి పొడిచే పనులు ఉన్నాయి? యూజ్‌లెస్‌ ఫెలోస్‌ను తెచ్చి పెట్టుకున్నాం’ అని మండిపడ్డారు. ‘నగరంలో 6 లక్షల మంది ఉంటే వెయ్యిమందినే రిజిస్టర్‌ చేశారు. ఓటీపీలు పనిచేయట్లేదని చెబుతున్నారు.. నా చెవిలో పూలు పెడుతున్నారా? ఇలా చెప్పేందుకు సిగ్గులేదా? పనిచేయకపోతే ఇంటికి వెళ్లిపోండి. ఏమి చేస్తారో ఏమో.. ఈ ఒక్క రోజులో 5వేల రిజిస్ట్రేషన్లు కావాలి’ అన్నారు.

ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే క్రీడాకారుల రిజిస్ట్రేషన్ల కోసం సచివాలయాల ఉద్యోగులకు లక్ష్యాలను నిర్ణయించి ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. పోటీల్లో పాల్గొనేందుకు ప్రజలు ఆసక్తి చూపని కారణంగా ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వం ఉద్యోగులపై చర్యలు తీసుకుంటోంది. బాపట్ల జిల్లాలో ఇటీవల 29 మంది పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓలు షోకాజ్‌ నోటీసులిచ్చారు. ఇప్పుడు ఏకంగా సస్పెండ్‌ చేయడంతో ఉద్యోగుల్లో కలకలం రేగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు