క్యాంప్‌ ఆఫీస్‌ ముసుగులో విశాఖకు తరలింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష ముసుగులో క్యాంప్‌ కార్యాలయాల పేరు చెప్పి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు యత్నాలపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.

Updated : 05 Dec 2023 07:45 IST

రాజధాని అమరావతే అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తున్నారు
క్యాంప్‌ కార్యాలయం అనేది బిజినెస్‌ రూల్స్‌లోనే లేదు
ఆ ఉత్తర్వులను సస్పెండ్‌ చేయండి
హైకోర్టులో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతుల వ్యాజ్యం

ఈనాడు, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష ముసుగులో క్యాంప్‌ కార్యాలయాల పేరు చెప్పి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు యత్నాలపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 22న జారీ చేసిన జీవో 2283ను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఏపీ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ సచివాలయం నుంచి కార్యాలయాలను తరలిస్తున్నారన్నారు. మిలేనియం టవర్స్‌ను ప్రభుత్వ కార్యాలయాలకు అనువుగా మార్చడాన్ని ఐటీ పాలసీని ఉల్లంఘించడంగా ప్రకటించాలని కోరారు.

విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌) ప్రాంగణాన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చడం ఎన్‌ఎంసీ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. అధికారుల చర్యలు ఏపీ బిజినెస్‌ రూల్స్‌, సెక్రటేరియట్‌ మాన్యువల్‌ ఉల్లంఘనగా ప్రకటించాలన్నారు. జీవో 2283ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీలక్ష్మిని వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితో పాటు జీఏడీ కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, విశాఖ కలెక్టర్‌, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, రుషికొండ టూరిజం ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

రాజుల ప్యాలెస్‌లా నిర్మించారు

అమరావతే రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించేలా ప్రతివాదులు వ్యవహరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులను, తీర్పు ఇచ్చిన కోర్టును తప్పుదోవ పట్టించేలా పావులు కదుపుతున్నారన్నారు. రైతుల హక్కులను కాపాడేలా అమరావతే రాజధాని అని గతంలో త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు ఇచ్చిందని, సచివాలయంలోని ప్రభుత్వ శాఖలను తరలించడానికి వీల్లేదని అందులో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ ‘క్యాంప్‌ ఆఫీసు’ ముసుగులో అమరావతిలోని సచివాలయం మొత్తాన్ని శాశ్వతంగా తరలిస్తున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. క్యాంప్‌ ఆఫీసు అనే పదం/భావన సచివాలయ మాన్యువల్‌, బిజినెస్‌ రూల్స్‌లో లేదని పేర్కొన్నారు.

రుషికొండపై టూరిజం రిసార్ట్‌ పేరుతో నిర్మాణ పనులు చేపట్టారని వివరించారు. మహారాజులు నివసించేలాంటి ప్యాలెస్‌ను నిర్మించారని.. ఒక్కో వాష్‌రూమ్‌కు రూ.50 లక్షల చొప్పున ఖర్చు చేశారని తెలిపారు. రుషికొండపై సిద్ధం చేసిన ‘విజయనగర బ్లాక్‌’ను క్యాంప్‌ ఆఫీసుగా మభ్యపెట్టి సీఎం నివాస గృహంగా వినియోగించనున్నారని ఆరోపించారు. సీఎస్‌ చట్టబద్ధ పాలనను మరిచిపోయారని, సీఎం చెప్పింది గుడ్డిగా చేస్తున్నారని వివరించారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు జారీచేసిన జీవో అమలును ఆపేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని