ఏపీ కుత్తుకపై కత్తి.. ప్రశ్నించరేం గొంతెత్తి?

జగనన్నా... 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి అది సాధిస్తా.. ఇది తీసుకొస్తానంటూ బీరాలు పలికారు కదా... కేంద్రం మెడలు వంచైనా చెప్పింది చేస్తానని ఈ నాలుగున్నరేళ్లలో సాధించిందేంటి? ప్రధాని మోదీతో అంతా బాగుందని స్వయంగా ప్రకటించుకున్న మీరు...

Updated : 05 Dec 2023 07:02 IST

సాగునీటి ప్రాజెక్టులు, నీటిపంపకాల్లో రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన వైకాపా సర్కారు
పార్లమెంటులో 31 మంది ఎంపీలున్నా తీరని డిమాండ్లు 
ఎన్నికల ముంగిటైనా ఎలుగెత్తే ప్రయత్నం చేస్తారా?
ఇదే చివరి పూర్తిస్థాయి లోక్‌సభ భేటీ మరి!
ఈనాడు - అమరావతి

జగనన్నా... 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి అది సాధిస్తా.. ఇది తీసుకొస్తానంటూ బీరాలు పలికారు కదా...
కేంద్రం మెడలు వంచైనా చెప్పింది చేస్తానని ఈ నాలుగున్నరేళ్లలో సాధించిందేంటి?
ప్రధాని మోదీతో అంతా బాగుందని స్వయంగా ప్రకటించుకున్న మీరు... దిల్లీకి వెళ్తే శాలువాలు కప్పడం, వాళ్లు ఇక్కడికొస్తే సాగిలపడటం.. అంతేకదా...
మీ స్వప్రయోజనాల కారణంగా ఇప్పటివరకూ కుదరలేదనే అనుకుందాం..
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనైనా, మన రాష్ట్ర న్యాయమైన డిమాండ్లను గట్టిగా వినిపించే ప్రయత్నమేదైనా చేస్తున్నారా?
ఎందుకంటే, ఇప్పుడు జరుగుతున్నవే లోక్‌సభ పూర్తిస్థాయి సమావేశాలు. తర్వాత ఓట్‌ఆన్‌ అకౌంట్‌ మాత్రమే ఉంటుంది!
కనీసం, పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా నిర్వహించకపోతిరి!
మీకే రాష్ట్ర ప్రయోజనాలు పట్టకపోతే, ఇక ఎంపీలెందుకు నోరెత్తుతారు.

రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా, జగన్‌ సర్కారు పెదవి విప్పి దిల్లీ పెద్దలను ప్రశ్నించే చేవ చూపడం లేదు. తూతూమంత్రంగా లేఖలు రాయడం తప్ప చేసిందేమీ లేదు. ప్రధాని మోదీతో రాజకీయాలకు అతీతమైన అలౌకిక స్నేహం ఉందని ప్రకటించుకున్న సీఎం జగన్‌.. నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేకంగా సాధించిందేమీ లేదు. లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 31 మంది ఎంపీల బలమున్నా ఒరిగింది శూన్యం. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ సహా కేంద్రం నుంచి అన్నీ సాధిస్తానని చెప్పిన సీఎం ఇప్పుడు కనీసం నోరు మెదపట్లేదు. అంతర్రాష్ట్ర జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో వైకాపా సర్కారు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, రాష్ట్రానికి దక్కాల్సిన నదీ జలాలను కాపాడుకోవడం.. ఎగువ రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించకుండా అడ్డుకోవడం లాంటి అంశాల్లో దిల్లీతో సంబంధ బాంధవ్యాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే, రాష్ట్ర సాగునీటి కేటాయింపులకు నష్టం కలిగించే దస్త్రాలు ఒక్కొక్కటిగా కేంద్ర జలశక్తి శాఖలో కదులుతున్నా జగన్‌ తెలుసుకోలేకపోయారు. తీరా పరిస్థితి చేయి దాటిపోయాక తూతూమంత్రంగా లేఖలు రాసి మిన్నకుండిపోయారు. ఎగువ రాష్ట్రాలు పావులు కదుపుతున్నా ఏమీ చేయలేకపోయారనేందుకు ఎన్నో ఉదాహరణలు.

  1. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను పునఃసమీక్షించాలని కేంద్రం నిర్ణయించి, నోటిఫికేషన్‌ జారీ చేసింది. కృష్ణా జలాలపై ట్రైబ్యునల్‌ లేదా పునఃసమీక్ష అక్కర్లేదన్నది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాదన. ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై జగన్‌ గట్టిగా మాట్లాడలేకపోయారు. కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ముందుగా పసిగట్టలేకపోయారు. రాష్ట్ర ఎంపీలూ దీనిపై గొంతెత్తిన పాపాన పోలేదు.
  2. గోదావరిలో తెలుగు రాష్ట్రాల నీటి వాటాలను స్పష్టంగా తేల్చిచెప్పేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్‌ ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ డిమాండు చేస్తోంది. కానీ కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. సీఎం జగన్‌ లేఖలు రాయడం తప్ప ఏమీ చేయడం లేదు.
  3. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేకపోవడంతోపాటు హరిత ట్రైబ్యునల్‌ తీర్పుతో ఆ పనులు ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకపోతేనే ఇలాంటి అడ్డంకులు వస్తాయని జలవనరుల శాఖ అధికారులే చెబుతున్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ అధికారులను సంప్రదించి ఒప్పించే నాథుడే లేకుండా పోయారు. ఎత్తిపోతల పథకం కొలిక్కి వస్తే వర్షాభావ పరిస్థితులు తలెత్తిన సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. అయినా ఎంపీలు చొరవ చూపితే ఒట్టు.
  4. కర్ణాటక ఎగువభద్ర ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇందుకు కేంద్రం పెట్టుబడి అనుమతులు ఇచ్చేసింది. అయితే, ఏదైనా జలాశయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చేటప్పుడు కేంద్ర జలసంఘం దిగువ ఉండే రాష్ట్రాల వాదనలు వినాలి. ఇక్కడ దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ వాదనలేమీ వినలేదు. పైగా ఈ ప్రాజెక్టుకు 36 టీఎంసీల నీటి కోసం కర్ణాటక చేసిన ప్రతిపాదనలను నీటి లభ్యత లేకపోవడంతో బచావత్‌ ట్రైబ్యునల్‌ అనుమతించలేదు. దీన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతులు, నిధులు ఇచ్చినా ఏపీ సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప గట్టిగా చేసిందేమీ లేదు.
  5. పోలవరం ప్రాజెక్టుకు విభజన చట్టం ప్రకారం పూర్తి నిధులు రావాలి. ఇప్పటికీ పునరావాసం పూర్తికాకపోవడంతో లక్ష కుటుంబాలకు పైగా విలవిల్లాడుతున్నాయి. రూ.47,725 కోట్లతో రెండో డీపీఆర్‌కు పెట్టుబడి అనుమతులు తప్ప.. అన్నీ 2019 నాటికే పూర్తయ్యాయి. సీఎం జగన్‌ ఇప్పటికీ ఆ పెట్టుబడికి అనుమతులు సాధించలేదు. తాజాగా మళ్లీ నిధులపై కేంద్రం నాలుక  మడతేసినా ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు. ఎంపీలు స్పందించడంలేదు. ఇందుకు రాజకీయ కారణాలే అడ్డంకిగా ఉన్నాయని అధికారులూ అంగీకరిస్తున్నారు.
  6. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ప్రాజెక్టులను ఆ బోర్డుల పరిధిలోకి తీసుకురావాలనేది ఆంధ్రప్రదేశ్‌ డిమాండు. చట్టప్రకారం ఇది చేయాల్సిందే. దీనిపైనా గట్టిగా మాట్లాడరు.. దిల్లీ పెద్దలను ప్రశ్నించరు.. న్యాయమైన డిమాండునూ సాధించరు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని