Cyclone Michaung: అలల కల్లోలం

మిగ్‌జాం తుపాను.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిపిస్తూ ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది. చెన్నై నగరంతో పాటు.. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే వందల గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి.

Updated : 05 Dec 2023 06:50 IST

నేడు బాపట్లకు దగ్గరలో తీరం దాటనున్న మిగ్‌జాం తుపాను
గంటకు 110 కి.మీ. గరిష్ఠ వేగంతో గాలులు.. అతి భారీ వర్షాలు
నీటమునిగిన నెల్లూరు, తిరుపతి జిల్లాలు
కూలిన చెట్లు.. విద్యుత్తు సరఫరాకు అంతరాయం
ఈనాడు - అమరావతి, బృందం

మిగ్‌జాం తుపాను.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిపిస్తూ ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది. చెన్నై నగరంతో పాటు.. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే వందల గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ సోమవారం రాత్రి నుంచి వర్షం, గాలుల తీవ్రత అధికమైంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి సాగుతున్న తుపాను.. మొత్తం 8 జిల్లాలపై ప్రభావం చూపనుంది. గంటకు గరిష్ఠంగా 110 కి.మీ. వేగంతో సుడిగాలులు సృష్టిస్తూ.. తీరాన్ని చుట్టేయనుంది.

సోమవారం సాయంత్రం మిగ్‌జాం గంటకు 10 కి.మీ. వేగంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి కదులుతోంది. ఇదే వేగం ఉంటే.. మంగళవారం మధ్యాహ్నం చీరాల, బాపట్ల సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరంలో సోమవారం నుంచి అలలు 1.50 మీటర్ల నుంచి 2 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. తుపాను నేపథ్యంలో 8 జిల్లాల్లో 300 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని గుర్తించామని.. 181 ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 10 కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన దళాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. తీరప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు నేడు కూడా సెలవులు ప్రకటించారు.

నీటమునిగిన తిరుపతి, నెల్లూరు జిల్లాలు

మిగ్‌జాం ప్రభావంతో.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో రైల్వే అండర్‌పాస్‌ల వద్ద నీరు నిలిచింది. పలు కాలనీల్లోనూ మోకాల్లోతు నీరు చేరింది. వందకు పైగా ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసరాలు, వస్తువులు తడిసిపోయాయి. సైదాపురం మండలంలో కైవల్యనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడటంతో ఇళ్లు కోతకు గరవుతున్నాయి. శ్రీకాళహస్తి సమీపంలోని రాజీవ్‌నగర్‌ వద్ద జగనన్న కాలనీలో ఇళ్ల మధ్య ఏరులా మారింది. సూళ్లూరుపేట వద్ద కోల్‌కతా-చెన్నై జాతీయరహదారిపై వరద నీరు చేరింది. కొప్పేడు-కావనూరు-శ్రీరామపురం మార్గంలో కాజ్‌వే పై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి.

నదులకు భారీగా వరద.. 

తిరుపతి జిల్లాలో కాళంగి, మల్లెమడుగు, స్వర్ణముఖి నదులకు భారీగా వరదనీరు చేరింది. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కోట, శ్రీకాళహస్తి, ఏర్పేడు, వాకాడు తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తిరుమల ఘాట్‌రోడ్డులోనూ కొన్నిచోట్ల చెట్లు కూలగా.. వెంటనే తొలగించారు. శ్రీకాళహస్తిలోని ప్రాజెక్టు వీధిలో వందేళ్లనాటి చెట్టు కూలింది. నెల్లూరులోనూ పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. నెల్లూరు నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సుమారు 100 బస్సులను రద్దు చేశారు. వాన, గాలులతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచింది.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టోల్‌ ప్లాజా సమీపంలోని గోకులకృష్ణ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద కాళంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై నాలుగు అడుగుల మేర నీటిమట్టంతో వరద ప్రవహిస్తుండటంతో పోలీసులు రహదారిని మూసివేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

పునరావాస శిబిరాల్లోకి

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని వట్రపాలెం పూర్తిగా మునగడంతో సుమారు 500 మందిని, వాకాడు పరిధిలో 250 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నెల్లూరు జిల్లాలో 54 పునరావాస కేంద్రాలకు 1,991 మందిని తరలించామని, మరో 2,423 మందిని తరలించనున్నట్లు అధికారులు వివరించారు. బాపట్ల జిల్లా, రేపల్లె, చీరాలలో పల్లపు ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా చూడటంతోపాటు 800 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో 64 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 2వేల మందిని తరలించారు. నాగాయలంక మండలంలో 4,500 మందిని తరలించనున్నారు. విశాఖలో 64 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు.

నేడు, రేపు భారీ, అతిభారీ వర్షాలు

మంగళవారం: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, వైయస్‌ఆర్‌, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి
బుధవారం: విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు