వ్యాపార రిజిస్ట్రేషన్లకు సేవాకేంద్రాలు

రాష్ట్రంలో వ్యాపారులు వస్తు సేవల పన్నుకు (జీఎస్టీ) సంబంధించిన రిజిస్ట్రేషన్లు, పన్నులు చెల్లించడాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక సేవాకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తెలిపారు. గుజరాత్‌, పాండిచ్చేరితోపాటు ఏపీలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఈ జీఎస్టీ సేవా కేంద్రాలను నెలకొల్పామని మంత్రి వెల్లడించారు.

Published : 05 Dec 2023 03:35 IST

ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో ఏర్పాటు
ఆర్థిక మంత్రి బుగ్గన

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వ్యాపారులు వస్తు సేవల పన్నుకు (జీఎస్టీ) సంబంధించిన రిజిస్ట్రేషన్లు, పన్నులు చెల్లించడాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక సేవాకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తెలిపారు. గుజరాత్‌, పాండిచ్చేరితోపాటు ఏపీలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఈ జీఎస్టీ సేవా కేంద్రాలను నెలకొల్పామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో విజయవాడ, మరో 12 ప్రాంతాల్లో సోమవారం ఒకేసారి సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలో రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ సేవా కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. పన్ను ఎగవేతలను అరికట్టడంతోపాటు చిరువ్యాపారుల నుంచి పెద్ద వాణిజ్య వర్గాల వరకూ అందరికీ అత్యంత తేలికగా జీఎస్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఈ సేవాకేంద్రాలు ఉపకరిస్తాయని తెలిపారు. ఆధార్‌ ఆధారిత నమోదు ప్రక్రియ ద్వారా ఇక్కడ చేసే రిజిస్ట్రేషన్లతో నకిలీలను పూర్తిగా నివారించడమే కాకుండా.. కార్యాలయాల చుట్టూ వ్యాపారులు తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఆరంభించిన ఈ కేంద్రాలు విజయవంతమైతే అన్నిచోట్లా వీటిని ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. విజయవాడలోని కేంద్రం ద్వారా నగరంలో చాక్లెట్లు, బిస్కెట్లు తయారుచేసి విక్రయించే చిరు వ్యాపారికి మొదటి రిజిస్ట్రేషన్‌ను వెంటనే పూర్తి చేయడం ద్వారా అందరికీ ఒక మంచి సందేశాన్ని ఇచ్చామని మంత్రి బుగ్గన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని