Vijayasai Reddy: ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ వృత్తికి మచ్చ తెచ్చిన విజయసాయిరెడ్డి

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) క్రమశిక్షణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది.

Updated : 05 Dec 2023 09:12 IST

జగన్‌తో కలిసి పెట్టుబడులు పెట్టించారు
ఐసీఏఐ క్రమశిక్షణ కమిటీ ప్రాథమిక నిర్ధారణ
విచారణకు హాజరుకావాలని నోటీసులు
తెలంగాణ హైకోర్టు నుంచి స్టే పొందిన విజయసాయిరెడ్డి  
నేడు ఉన్నత న్యాయస్థానంలో విచారణ 

ఈనాడు, హైదరాబాద్‌: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) క్రమశిక్షణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన గ్రూపు కంపెనీలకు ఆర్థిక సలహాదారుగా ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ సమావేశం తీర్మానించింది. వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై విచారణకు హాజరు కావాలంటూ అక్టోబరు 23న నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై విజయసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు.

ఈ పిటిషన్‌ మంగళవారం మరోసారి విచారణ జరగనుంది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో అరబిందో, హెటిరోలకు భూకేటాయింపులు, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, రాంకీ ఫార్మా, వాన్‌పిక్‌ ప్రాజెక్టులు, దాల్మియా సిమెంట్స్‌ కేసుల్లో సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాల్లోని అంశాలను, అందులో సాక్షుల వాంగ్మూలాలను ఐసీఏఐ డిసిప్లినరీ డైరెక్టరేట్‌ పరిగణనలోకి తీసుకుని ప్రాథమిక అభిప్రాయాన్ని వెల్లడించింది. వీటితోపాటు జగతి పబ్లికేషన్స్‌ విలువ మదింపుపై డెల్లాయిట్‌ ఇచ్చిన నివేదిక, విజయసాయిరెడ్డి చిరునామాతో డెల్లాయిట్‌ పంపిన బిల్లు, జగతి పెట్టుబడులపై ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. 2017, 2021, 2022ల్లో మూడు దఫాలుగా వెల్లడించిన ప్రాథమిక అభిప్రాయాల్లో విజయసాయిరెడ్డి వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు వెల్లడించింది. ఇదే అభిప్రాయంతో క్రమశిక్షణ కమిటీ ఏకీభవిస్తూ తుది నిర్ణయం నిమిత్తం విచారణ చేపట్టాలని నిర్ణయించి విజయసాయిరెడ్డికి తాఖీదు పంపింది. ప్రాథమిక నిర్ణయం వెలువరించడానికి పరిగణనలోకి తీసుకున్న అంశాలు ఇలా ఉన్నాయి.

పెట్టుబడులకు సాయిరెడ్డి ఒత్తిడి

ఏపీలో సమస్యల్లేకుండా సిమెంట్‌ పరిశ్రమను నిర్వహించుకోవడానికి జగన్‌కు చెందిన జగతిలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాలని జయలక్ష్మి టెక్స్‌టైల్స్‌ అధినేత కన్నన్‌పై సాయిరెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆయన 2008 ఆగస్టు 5న రూ. 5 కోట్లు పెట్టుబడి పెట్టారు. వాటిపై కన్నన్‌కు ఎలాంటి డివిడెండ్‌ అందలేదు. పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు. 2008 నవంబరులో ఎన్నారై మాధవ్‌ రామచంద్రకు జగతి నుంచి పెట్టుబడులు కోరుతూ ఫోన్‌ వచ్చింది. తరువాత కంపెనీ వివరాలతోపాటు డెల్లాయిట్‌ నివేదిక అందింది. విజయసాయి మాటలతోపాటు డెల్లాయిట్‌ నివేదికను విశ్వసించి జగతిలో పెట్టుబడులు పెట్టడానికి మాధవ్‌ రామచంద్ర నిర్ణయించుకున్నారు. రూ. 19.66 కోట్లు జగతికి చెల్లించారు. తన పెట్టుబడి వెనక్కి తీసుకోవడానికి పలు ప్రయత్నాలు చేశారు. జగతి నుంచి ఆయనకు సమాధానం ఇవ్వలేదు.

సంకేత భాష

దాల్మియా సిమెంట్స్‌ వాటాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ము తిరిగి పొందడంలో సాయిరెడ్డి ఈమెయిళ్లలో సంకేత భాషను వాడినట్లు సీబీఐ అభియోగ పత్రంలో పేర్కొంది. 2010 డిసెంబరు 31న సాయిరెడ్డి పంపిన ఈమెయిల్‌లో 3500 టన్నుల స్టాక్‌ అందింది. 2011 జనవరి నాటికి మరో 500 టన్నులు సరఫరా చేస్తామంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దాల్మియాలో జేఆర్‌ (జగన్‌రెడ్డి) ఖాతాను పరిశీలిస్తే రూ. 35 కోట్లు అందాయని, కోట్లకు బదులు టన్నులు అనే సంకేత భాషను వాడారని సీబీఐ పేర్కొంది. 2010-11 మధ్య జగన్‌కు నిధులను సమకూర్చడంలో సాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు.

జగన్‌తో కలిసి పెట్టుబడులు రాబట్టడానికి సాయిరెడ్డి చురుకైన పాత్ర పోషించారని ఐసీఏఐ పేర్కొంది. ఆయన డైరెక్టర్‌గా రాజీనామా చేసిన అనంతరం కూడా ఆ కంపెనీతో, జగన్‌తో సన్నిహితంగా ఉంటూ పెట్టుబడులు రాబట్టారు.  మదింపు నివేదికను తారుమారు చేయడంలో ఆయన పాత్ర స్పష్టంగా ఉందని పేర్కొంది. ఈ సమయంలో ప్రాక్టీసింగ్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉన్నారని, వృత్తిపరమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జగన్‌, ఆయన కంపెనీలకు  సహకరించారని, ఇది ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా ఉండి చేయాల్సింది కాదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని