YSRCP Leader: పేరులో చిన్న.. సెటిల్‌మెంట్లలో ‘పెద్ద’

‘యథా రాజా తథా ప్రజా’... ఈ మాటల్ని ‘యథా బడా నేత తథా ఛోటా నేత’గా అన్వయించుకుంటున్నారు వైకాపా నాయకులు. జగన్‌ సీఎం అయ్యాక ఇదివరకెన్నడూ లేనంతగా సెటిల్‌మెంట్లు, బెదిరింపుల సంస్కృతి జిల్లాలకూ పాకింది. వివాదం అని తెలిస్తే చాలు...

Updated : 05 Dec 2023 08:09 IST

భూములైనా, ఆస్తులైనా ఆయన కన్నుపడితే సొంతం కావాల్సిందే
ఎంతటి పెద్దవారైనా ఆదేశాలకు తలొగ్గాల్సిందే..
విజయనగరం జిల్లాలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి అరాచకం
ఈనాడు, అమరావతి

‘యథా రాజా తథా ప్రజా’... ఈ మాటల్ని ‘యథా బడా నేత తథా ఛోటా నేత’గా అన్వయించుకుంటున్నారు వైకాపా నాయకులు. జగన్‌ సీఎం అయ్యాక ఇదివరకెన్నడూ లేనంతగా సెటిల్‌మెంట్లు, బెదిరింపుల సంస్కృతి జిల్లాలకూ పాకింది. వివాదం అని తెలిస్తే చాలు... రెండు పిల్లుల మధ్య రొట్టె తగవు కోతి తీర్చినట్లుగా... మధ్యలో దూరి మొత్తం స్వాహా చేసేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి సెటిల్‌మెంట్ల దూకుడుకు జనాలు బెంబేలెత్తుతున్నారు. భూములూ, ఆస్తులూ, పరిశ్రమలూ... వేటిమీద కన్ను పడితే అవి ఆయన పేరిట మారిపోవాల్సిందే. బాధితులది మౌన రోదనే!

క్కడ ఏ లావాదేవీలు జరగాలన్నా ఆయన సెటిల్‌మెంట్‌ చేయాల్సిందే. ఎంతటివారైనా ఇచ్చినంత పుచ్చుకుని తప్పుకోవాల్సిందే. కాదూ కూడదంటే కథ మలుపుతిప్పి వారంతట వారే కాళ్లబేరానికి వచ్చేలా చేస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధి పేట్రేగిపోతున్న తీరిది. తన సమీప బంధువైన రాష్ట్రస్థాయి నాయకుడి నీడగా రాజకీయంగా ఎదిగిన ఈయన.. ఇప్పుడు జిల్లాలో అరాచకాలు, అక్రమాలు, అవినీతికి వట వృక్షంలా మారారు. ఆయన పేరుకే ‘చిన్న’ మనిషి.. దందాల్లో చాలా ‘పెద్ద’. ఈ నాయకుడికి ఓ కీలక పదవి కట్టబెట్టేందుకు దాని రిజర్వేషన్‌నే మార్పించేశారు.

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనల్లో అన్నీ తానై వ్యవహరిస్తారీయన. అపాయింట్‌మెంట్‌ లేకుండానూ సీఎం జగన్‌ను కలవగలరు. ఈ స్థాయిలో ప్రభుత్వాధినేత అండదండలు ఉండటంతో చెలరేగిపోతున్నారు. యంత్రాంగాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుని దందాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వీటికోసం ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. వారు సెటిల్‌మెంట్ల వ్యవహారాలను ఈయన దృష్టికి తీసుకొస్తే ఇరువర్గాలను పిలిపించి, ఒప్పందాలు చేసి భారీ మొత్తంలో వాటాలు దక్కించుకుంటారు. తన ఆదేశాలు ధిక్కరిస్తే బెదిరిస్తారు. మరి కొన్నిసార్లు ఆ ఆస్తులు, భూములను అతి తక్కువ ధరకు ఈ నాయకుడే దక్కించుకుంటారు. 

కన్ను పడితే... అప్పగించి తీరాల్సిందే!

  • గరివిడిలో విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సుమారు మూడెకరాల స్థలాన్ని కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంత మొత్తం అడ్వాన్సుగా చెల్లించి మిగతా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఇస్తామన్నారు. గడువులోగా వారు డబ్బులు చెల్లించకపోవటంతో పంచాయితీ ‘ప్రజాప్రతినిధి’ దగ్గరకు చేరింది. అతను ఆ భూములను తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకుని పరిష్కారం చూపారు. వాటిలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు.
  • నెల్లిమర్ల మండలంలో ఓ రైస్‌మిల్లు అమ్మకానికి దాని యజమాని ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొనుగోలుదారులు, అమ్మకందారు మధ్య వివాదం రావడంతో ఛోటా నేత పంచాయితీ చేశారు. ‘‘రైస్‌మిల్లు నేను తీసుకుంటా.. మా పేరిటే ఉంటుంది’’ అంటూ  వాస్తవ విలువ కంటే చాలా తక్కువ మొత్తం చెల్లించి దాన్ని దక్కించుకున్నాడు. నష్టపోయినవారు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక లబోదిబోమంటున్నారు.
  • ఓ పరిశ్రమ యాజమాన్యం నుంచి అత్యంత విలువైన భూములను అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. పారిశ్రామికవాడ కింద ఉన్న ఆ భూములను సాధారణ భూములుగా కన్వర్షన్‌ చేయించుకుని  తన సమీప బంధువుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు.

కన్నేసి... కాజేసి

మూతపడిన ఓ పరిశ్రమ భూములు కొనడానికి అయిదుగురు వ్యక్తులు ఒప్పందం చేసుకుని అడ్వాన్సు చెల్లించారు. ఈ లోపల వాటిపై ఈ ప్రజాప్రతినిధి కన్నుపడింది. వాళ్లను ఇంటికి పిలిపించి సగం వాటా ఇవ్వాలని, లేదంటే రిజిస్ట్రేషన్‌కు చిక్కులు తప్పవని హెచ్చరించగా.. తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించారు. మూడు నెలలకు మరోసారి  పిలిపించి... ఆ భూముల విషయంలో ఎన్నో చిక్కులున్నాయని... వాటిని పరిష్కరించుకుంటానని, తనకు వదిలేయాలని చెప్పి గుడ్‌విల్‌ పేరిట కొంత మొత్తం ముట్టజెప్పి వాటిని సొంతం చేసుకున్నారు. ఆయన్ను ఎదిరించలేక వారు మిన్నకుండిపోయారు.


భూకబ్జాల్లో ఆయన స్టైలే సెపరేటు..

విజయనగరంలోని అత్యంత విలువైన ఓ ప్రైవేటు స్థలంపై కన్నేసిన ‘ప్రజాప్రతినిధి’ తన అనుచరుల ద్వారా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నించారు. చట్టపరంగా పోరాడేందుకు ఆ స్థలం యజమాని సిద్ధమవగా అతన్ని పిలిపించి ‘ఎంతో కొంత ఇస్తా, తీసుకుపో’ అని హెచ్చరించారు. దాంతో ఆ భూ యజమాని.. ఓ మంత్రి వద్దకెళ్లి మొర పెట్టుకోగా ఆయన ఆ ‘ప్రజాప్రతినిధి’కి ఫోన్‌చేసి ఏదో రకంగా అతనికి న్యాయం చేయాలన్నారు.  తన సమస్య పరిష్కారమైనట్టేనని భావించి వెళ్లి ఆ నాయకుడి ఎదుట వాలిపోగా... కూర్చోబెట్టి, టీ తాగించి.. ‘‘ఇక మీరు వెళ్లొచ్చు.. ఆ భూమిని మాత్రం వదిలేసుకోవాల్సిందే.’’ అని చెప్పారు. ఉలిక్కిపడిన బాధితుడు ‘‘మంత్రి గారు చెప్పారు కదా’ అని ప్రాధేయపడగా.. ‘‘ఆయన చెప్పారు కాబట్టే కూర్చోబెట్టి మాట్లాడాను. లేకుంటేనా...’’ అని సమాధానమిచ్చారు. ఆయన భూకబ్జాలు ఏ  స్టైల్‌లో చేస్తారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ.


పైపులన్నీ ఆ కంపెనీవే..

ఈయనకి ఓ పైపుల పరిశ్రమ ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లా పరిధిలో ఇంటింటికీ తాగునీరు అందించే ప్రాజెక్టు పనుల పైపులన్నీ తమ పరిశ్రమ నుంచే కొనాలని హుకుం జారీచేశారు. దీనికి సహకరించని అధికారిని బదిలీ చేయించి.. తాను చెప్పినదానికి తలాడించే అధికారిని తెచ్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఈ కంపెనీ పైపులే వినియోగిస్తున్నారు.

* జిల్లాలో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం, నిర్వహణ తదితర పనులన్నీ తన భాగస్వాములైన ఇద్దరు గుత్తేదారులకే దక్కేలా చేస్తారు. ఇంకెవరికీ అవకాశమే ఉండదు.


సెటిల్‌మెంట్లు.. దందాలు

  • ఎస్‌.కోట నియోజకవర్గంలో ఇనాం భూముల్లోని ఓ చెరువు వ్యవహారంలో కొందరికి అనుకూలంగా సెటిల్‌మెంట్‌ చేసి భారీగా లబ్ధి పొందారు.
  • బొబ్బిలిలో మూతపడిన ఓ పరిశ్రమ స్థలం కొనుగోలు వ్యవహారంలో చక్రం తిప్పి సొమ్ము చేసుకున్నారు.
  • పార్వతీపురం నియోజకవర్గంలో ఓ కర్మాగారం భూముల వేలంలోనూ తెరవెనక కథ నడిపించారు.
  • రామభద్రాపురం మండలంలో ఓ రియల్‌ ఎస్టేట్‌ లే అవుట్‌ విషయంలో దాని యజమానులు ఇద్దరి మధ్య విభేదాలు నెలకొనగా.. దాన్ని సెటిల్‌ చేసి భారీగా ఆర్థిక లబ్ధి పొందారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని