అన్నదాతల్లో తుపాను కలవరం

తుపాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ రైతుల్లో ఆందోళన అధికమవుతోంది. ఈదురుగాలుల ధాటికి కోతకు సిద్ధంగా ఉన్న లక్షల ఎకరాల్లో వరి.. నేలవాలుతోంది. వర్షాలు, గాలుల తీవ్రత పెరిగితే చేతికి దక్కదేమో అనే భయం వారిని వెన్నాడుతోంది.

Published : 05 Dec 2023 03:36 IST

పలు జిల్లాల్లో నేల వాలుతున్న వరి
ధాన్యం రంగుమారే ప్రమాదం
మెట్టపంటలపైనా ప్రభావం

ఈనాడు-అమరావతి, బృందం: తుపాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ రైతుల్లో ఆందోళన అధికమవుతోంది. ఈదురుగాలుల ధాటికి కోతకు సిద్ధంగా ఉన్న లక్షల ఎకరాల్లో వరి.. నేలవాలుతోంది. వర్షాలు, గాలుల తీవ్రత పెరిగితే చేతికి దక్కదేమో అనే భయం వారిని వెన్నాడుతోంది.

ఆరబెట్టిన ధాన్యం కిందకు నీరు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి.  ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయలేదు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 60వేల టన్నుల ధాన్యం రహదారులపైనే ఉంది. వర్షం కారణంగా.. వేల ఎకరాల్లో పంట నేలకొరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 4వేల టన్నుల పంట రోడ్లపై టార్పాలిన్ల కింద ఉంది.

శ్రీకాకుళం జిల్లాలో రహదారుల పక్కన కుప్పలు పోసిన ధాన్యం కనిపిస్తోంది. 5.20లక్షల టన్నుల సేకరణ లక్ష్యం కాగా.. ఇప్పటికి 30వేల టన్నులే సేకరించారు. వర్షం కారణంగా తీసుకోలేమని మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు.

సీఎం చెప్పే నాటికే.. మొదలైన వానలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సాగుచేసిన వరిలో 60% కోతలు పూర్తికాగా 40% నూర్పిళ్లు జరిగాయి. కోత కోసిన ధాన్యంలో 20% కూడా తరలించలేదు. చాలావరకు పొలాల్లో, రహదారులపైనే ఉంది. పలు మండలాల్లో పంటలు నేలవాలిపోయాయి. టార్పాలిన్లు కప్పినా.. నీరు చేరి ధాన్యం తడిసిపోయింది. ‘తుపాను ముంచుకొస్తోందంటూ సంచుల కోసం ఆర్బీకేలకు వెళ్లినా తేమ 15% లోపుంటేనే ఇస్తామంటూ సతాయించారు. టార్పాలిన్ల కిందనుంచి వర్షం నీరు చేసి ధాన్యం తడిసిపోతోంది’ అని తణుకు మండలం మండపాక రైతు నాగేశ్వరరావు ఆవేదన వెలిబుచ్చారు.

పనలపై కొంత.. కుప్పలుగా కొంత

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కురుస్తున్న వానలకు వరి రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. అవనిగడ్డ ప్రాంతంలో 5వేల ఎకరాల్లో వరి నేలవాలింది. పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో కళ్లాల్లోని ధాన్యాన్ని గోదాములకు తరలిస్తున్నారు. వర్షం నుంచి కాపాడుకుందామంటే.. రైతుల దగ్గర టార్పాలిన్లు లేవు.

గుంటూరు జిల్లాలో వట్టిచెరుకూరు, తాడికొండ, దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి, పొన్నూరు మండలాల్లో పలుచోట్ల వరి నేలవాలింది. తడిసి మొలకెత్తుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

తిరుపతి జిల్లాలో 18 వేల ఎకరాల మేరకు పంట నీట మునిగింది. ఒకటి రెండు రోజుల్లో నీరు బయటకు పోకుంటే నష్టమే. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాల్లోని పొలాల్లో ఇసుకమేట వేసింది.

మెట్టపంటలపైనా.. వాన పిడుగు

మెట్ట పంటలపైనా తుపాను ప్రభావం చూపిస్తోంది. ప్రకాశం జిల్లాలోని పొగాకు, మిర్చి, మొక్కజొన్న రైతుల్లో తీవ్ర అలజడి నెలకొంది. మొక్కజొన్న రైతులు అయినకాడికి పంటను అమ్ముకుంటున్నారు. ‘వర్షాలకు మొక్కజొన్న తడిసింది. వారం కిందట క్వింటాల్‌ రూ.2200 నుంచి రూ.2300 పలికింది. తడవడంతో రూ.2వేలకు అడుగుతున్నారు’ అని తాళ్లూరు మండలం కేవీపాలేనికి చెందిన గోనుగుంట వెంకటేశ్వర్లు వాపోయారు. తిరుపతి జిల్లాలో 500 ఎకరాల వరకు వేరుశెనగ పంట దెబ్బతిన్నది. గాలుల ధాటికి అరటి, బొప్పాయి దెబ్బతిన్నాయి. నగరిలో పూలతోటల్లోకి నీరు చేరింది. ఎన్టీఆర్‌ జిల్లాలో తీతకు సిద్ధంగా ఉన్న పత్తి నల్లబారే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఇబ్బంది లేకున్నా.. వాన, గాలుల తీవ్రత పెరిగితే మిరప పైరు దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని