పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు

తీవ్ర తుపాను ‘మిగ్‌జాం’ తీరానికి సమాంతరంగా కదులుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గాలుల తీవ్రత పెరిగిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ సునంద తెలిపారు. తీరానికి చేరువలోకి వచ్చేసరికి 90-112 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయన్నారు.

Published : 05 Dec 2023 03:36 IST

కృష్ణపట్నం నుంచి మచిలీపట్నం వరకు పదో హెచ్చరిక
విజయవాడ, విశాఖ, తిరుపతిలలో పలు విమానసర్వీసుల రద్దు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: తీవ్ర తుపాను ‘మిగ్‌జాం’ తీరానికి సమాంతరంగా కదులుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గాలుల తీవ్రత పెరిగిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ సునంద తెలిపారు. తీరానికి చేరువలోకి వచ్చేసరికి 90-112 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయన్నారు. తీరం దాటే సమయానికి ఇదే వేగం కొనసాగితే నిజాంపట్నం పరిసరాల్లో పల్లపు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి సముద్రజలాలు చొచ్చుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ఉప్పెన 1.5 నుంచి 2 మీటర్ల వరకు ఉండొచ్చన్నారు. తుపాను ప్రభావంతో కృష్ణపట్నం నుంచి మచిలీపట్నం వరకు పోర్టులకు పదో నంబరు, కాకినాడకు తొమ్మిది, విశాఖ, కళింగపట్నం పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు జారీ చేశామన్నారు.

ముగ్గురు సీఎంలతో అమిత్‌ షా సమీక్ష

తుపాను పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమీక్షించారు. ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి, కేంద్రం నుంచి అవసరమైన  సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

విమాన సర్వీసుల రద్దు

తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలోని రన్‌వే పైకి సోమవారం వరద నీరు చేరింది. దీంతో హైదరాబాద్‌, విజయవాడ, కలబురగి, బెంగళూరు నుంచి ఇక్కడకు రాకపోకలు సాగించే సర్వీసులు రద్దుచేశారు. మరికొన్ని దారి మళ్లించారు.

  • విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం పలు సర్వీసులు రద్దయ్యాయి. ఉదయం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, మధ్యాహ్నం తిరుపతి, కడప, హైదరాబాద్‌, బెంగళూరు సహా రాత్రికి రావాల్సిన విమానాలను వాతావరణ మార్పుల కారణంగా సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు ప్రకటించాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ సర్వీసులతో పాటు రాత్రి 8.10 గంటలకు వెళ్లే ఎయిర్‌ ఇండియా సర్వీసులే నడుస్తాయని అధికారులు తెలిపారు.
  • విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఏడు విమానాల రాకపోకలు నిలిపివేసినట్లు విమానయాన సంస్థ, అథారిటీ వర్గాలు తెలిపాయి. విశాఖపట్నం నుంచి చెన్నై, హైదరాబాద్‌, గోవా, బెంగళూరు, దిలీ,్ల తిరుపతి, విజయవాడ విమానాల రాకపోకలను తాత్కాలికంగా రద్దుచేశారు. మంగళవారం కూడా 19 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని