తుపాను సన్నద్ధత ఇదా?

తుపాను విరుచుకు పడుతుందని తెలిస్తే.. ఏ ప్రభుత్వమైనా వారం ముందు నుంచే సహాయ చర్యలపై దృష్టిసారిస్తుంది. పంట నష్టాన్ని తగ్గించడంపై శ్రద్ధ పెడుతుంది. ఘనత వహించిన వైకాపా సర్కారుకు మాత్రం.. తీరం దాటడానికి ఒకటి, రెండు రోజుల ముందే రైతులు గుర్తొస్తారు.

Published : 05 Dec 2023 03:37 IST

వర్షాల భయంతో ధాన్యం తెగనమ్ముకున్నాక రైతులు గుర్తొచ్చారా?

ఈనాడు, అమరావతి: తుపాను విరుచుకు పడుతుందని తెలిస్తే.. ఏ ప్రభుత్వమైనా వారం ముందు నుంచే సహాయ చర్యలపై దృష్టిసారిస్తుంది. పంట నష్టాన్ని తగ్గించడంపై శ్రద్ధ పెడుతుంది. ఘనత వహించిన వైకాపా సర్కారుకు మాత్రం.. తీరం దాటడానికి ఒకటి, రెండు రోజుల ముందే రైతులు గుర్తొస్తారు. రైతుల దగ్గరున్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి ఆదుకోవాలనే ఆలోచన కొరవడింది. తేమ శాతంతో పనిలేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం జగన్‌ ఆదివారం మధ్యాహ్నం ఆదేశాలిచ్చారు. అదేదో వారం ముందే చెబితే రైతులకు న్యాయం జరిగేది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, బాపట్ల జిల్లాల్లో చాలాచోట్ల కుప్పలు పోసిన ధాన్యం, వాటిపై పరదాలు కప్పి కాపాడుకునేందుకు పాట్లు పడుతున్న రైతులే కనిపిస్తున్నారు. కుప్పలుగా పోసిన ధాన్యం 10 లక్షల టన్నులు ఉంటుందని అంచనా.

నవంబర్‌ 23 నుంచే హెచ్చరికలు

తుపాను మన రాష్ట్రం వైపు రావచ్చని వాతావరణ శాఖ గత నెల 23నే ప్రకటించింది. దానికి తగ్గట్లే అల్పపీడనం తుపానుగా మారింది. మంగళవారం తీరం దాటనుంది. దీని తీవ్రత అధికంగా ఉంటుందని.. తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణశాఖ ఆదివారం ప్రకటించింది. వాతావరణశాఖ చాలా ముందునుంచే హెచ్చరిస్తున్నా, ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. పైగా పంట కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం..తన బాధ్యతను విస్మరించింది. ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉందని, ఆరబెట్టి తీసుకురావాలని ఆర్‌బీకేల ద్వారా సతాయించింది. నిబంధనల ప్రకారమే 17% తేమ ఉందని చెప్పినా 15% వస్తేనే తీసుకుంటామని వేధించారు. అధిక శాతం రైతులు బస్తా ధాన్యాన్ని మద్దతు ధర కంటే రూ.200-300 తక్కువకు అమ్ముకున్నారు. ఒక్కో రైతు ఎకరానికి రూ.10 వేలకు పైగా నష్టపోయారు. వర్షం కురిస్తే ధాన్యం తడుస్తుందనే భయంతో దక్కిన ధరకు తెగనమ్ముకున్నారు.


ముంచేసే ముందురోజు.. ప్రత్యేకాధికారుల నియామకమా?

తుపాను ముంచేసే ముందురోజు వరకూ.. జిల్లాలకు సీనియర్‌ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించాలనే ఆలోచనే ప్రభుత్వానికి రాలేదు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తూ.. పల్లపు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం రాలేద]ు. మంగళవారం మధ్యాహ్నం తీరం దాటుతుందంటే.. 8 జిల్లాలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తున్నామని సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. అమరావతి నుంచి తమకు కేటాయించిన జిల్లాలకు వారు చేరుకునేసరికే సాయంత్రం అవుతుంది. అక్కడకు వెళ్లాక.. పరిస్థితుల్ని అవగాహన చేసుకునేదెప్పుడు? సహాయ చర్యలపై దృష్టి పెట్టేదెప్పుడు? కనీసం రెండు, మూడు రోజుల ముందైనా ఈ ఉత్తర్వులు ఇవ్వాలనే విజ్ఞత సర్కారుకు లేకపోయింది.


గోదాముల్లో భద్రపర్చుకోవచ్చు మార్కెటింగ్‌ ఆర్జేడీ

గుంటూరు(మిర్చియార్డు), న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను కారణంగా కురిసే భారీ వర్షాల దృష్ట్యా రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డుల గోదాముల్లో భద్రపర్చుకోవచ్చని మార్కెటింగ్‌ శాఖ ఆర్జేడీ కాకుమాను శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని రైతులు కోత కోసిన ధాన్యాన్ని నిల్వచేసుకునే సౌకర్యం లేకపోతే మార్కెట్ యార్డుల గోదాముల్లో నిల్వ చేసుకోవాలన్నారు. వివరాలకు నంబరు 7331154812లో సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు