పునరావాస శిబిరాల్లో ఎలాంటి లోటూ రాకూడదు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస శిబిరాలకు తరలించి, అన్ని సౌకర్యాలూ కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కోసిన పంటను, రంగు మారిన ధాన్యాన్ని కూడా యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పారు. ఖరీఫ్‌ పంటల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Updated : 05 Dec 2023 05:40 IST

కోసిన, రంగు మారిన ధాన్యాన్ని సేకరించాలి
తుపాను సహాయ చర్యలపై కలెక్టర్లతో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస శిబిరాలకు తరలించి, అన్ని సౌకర్యాలూ కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కోసిన పంటను, రంగు మారిన ధాన్యాన్ని కూడా యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పారు. ఖరీఫ్‌ పంటల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఆయన క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం సమీక్షించారు. ‘తుపాను సహాయ చర్యల కోసం ఇప్పటికే జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని ఆదేశాలిచ్చాం. ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించాం. ప్రతి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఒక సవాలుగా తీసుకుని పనిచేయాలి.

ఎలాంటి ప్రాణనష్టం జరగడానికి వీల్లేదు. కోతకు వచ్చిన పంటను కాపాడుకోవాలి. ఇప్పటికే 97 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. 6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పంట కోత కోయని చోట వాయిదా వేసేలా రైతులకు నచ్చజెప్పండి. తుపాను తీరం దాటాక పంట నష్టాన్ని లెక్కించాలి’ అని సీఎం సూచించారు. ‘సహాయ శిబిరాల్లో మందులు, ఆహారం, తాగునీరు అందించాలి. ఎలాంటి లోటూ రాకూడదు. అంటు వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. విద్యుత్తు, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి’ అని అధికారులతో సీఎం పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు.

కుటుంబానికి రూ.2,500 చొప్పున సాయం

‘సహాయ చర్యలకు అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధం. సీఎస్‌, రెవెన్యూ ఉన్నతాధికారులతో సహా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులంతా ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలో ఉంటారు. ఏం కావాలన్నా వెంటనే అడగండి. మా కలెక్టర్‌ బాగా చూసుకోలేదనే మాట ఎక్కడా వినిపించకూడదు’ అని కలెక్టర్లతో సీఎం జగన్‌ అన్నారు. ‘పునరావాస శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరికీ రూ.1,000, కుటుంబానికి రూ.2,500 చొప్పున ఇవ్వాలి. ఇళ్లలోకి నీరొచ్చిన కుటుంబాలకు కూడా 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పామోలిన్‌ ఆయిల్‌, ఉల్లి, బంగాళదుంపలు అందించాలి. తుపాను ప్రభావంతో గుడిసెలు, ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు ఇవ్వాలి’ అని వెల్లడించారు. బాలింతలు, గర్భిణుల్ని ఆసుపత్రులకు తరలించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులు

తుపాను ప్రభావిత జిల్లాలకు పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. బాపట్ల జిల్లాకు కాటమనేని భాస్కర్‌, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు జయలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లాకు వివేక్‌ యాదవ్‌, కాకినాడ జిల్లాకు యువరాజ్‌, ప్రకాశం జిల్లాకు ప్రద్యుమ్న, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు హరికిరణ్‌, తిరుపతి జిల్లాకు జె.శ్యామలరావు, పశ్చిమగోదావరి జిల్లాకు కన్నబాబును నియమిస్తున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని