‘గుండె’ గోడు వినపడదా..?

తాను పుట్టిందే పేదల్ని ఉద్ధరించడానికి అన్నట్లు స్వయంగా గొప్పలు చెప్పుకొంటారు. అవకాశం చిక్కితే చాలు సమయం, సందర్భమూ చూడకుండా పేదలు, పెత్తందారులంటూ రాగాలు తీస్తారు. ఆయన ఒక్కరే పేదల పక్షమన్నట్లు, మిగతా వారంతా పెత్తందారులు అన్నట్లు విరుచుకుపడతారు...

Updated : 05 Dec 2023 07:44 IST

తీవ్ర ఆందోళనలో పేద హృద్రోగులు
ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో తక్కువ కేటాయింపులే కారణం
ఆయుష్మాన్‌ భారత్‌తో పోలిస్తే భారీ వ్యత్యాసాలు
ఏకంగా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు తేడా
శస్త్రచికిత్సలకు వెనుకాడుతున్న ప్రైవేటు ఆసుపత్రులు
పేదల పక్షపాతినని చెప్పుకొనే జగన్‌కు ఇవేవీ కనిపించవేం?
ఈనాడు, అమరావతి

తాను పుట్టిందే పేదల్ని ఉద్ధరించడానికి అన్నట్లు స్వయంగా గొప్పలు చెప్పుకొంటారు. అవకాశం చిక్కితే చాలు సమయం, సందర్భమూ చూడకుండా పేదలు, పెత్తందారులంటూ రాగాలు తీస్తారు. ఆయన ఒక్కరే పేదల పక్షమన్నట్లు, మిగతా వారంతా పెత్తందారులు అన్నట్లు విరుచుకుపడతారు... ముఖ్యమంత్రి జగన్‌.

అయితే,

రాష్ట్రంలోని పేదల ‘గుండె’లు అల్లాడుతున్నా పట్టనట్లే ఉంటున్నారు. ఆరోగ్యశ్రీలో చేస్తున్న హృద్రోగ శస్త్రచికిత్సలకు సరిపడా కేటాయింపులు చేయడంలేదు. ఇదేమని అడిగితే... తమకు ఎవ్వరితోనూ పోలిక లేదంటారు. ఇదేనా పేదలపై మీ పక్షపాతం సీఎంగారూ..! కనీసం పేదల చికిత్సకు సరిపడా నిధులిచ్చేందుకైనా పెద్ద మనసు చేసుకోలేరా? నిరుపేదల వైద్యానికి డబ్బులిస్తే మీ సొంత ఆస్తులేమైనా కరిగిపోతాయా?

కరోనరీ ఆర్టెరీ బైపాస్‌ గ్రాఫ్ట్‌ (సీఏబీజీ)... సామాన్య పరిభాషలో చెప్పాలంటే గుండెకు చేసే బైపాస్‌ ఆపరేషన్‌. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆపరేషన్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,18,881 ఇస్తోంది. ఇదే శస్త్రచికిత్సకు ఆయుష్మాన్‌ భారత్‌లో కేంద్రం రూ.1,84,500 ఇస్తోంది. ఇది రాష్ట్రం ఇస్తున్నదానికంటే 55.20% అంటే... రూ.65,619 ఎక్కువ. ఒక్క బైపాస్‌ సర్జరీనే కాదు... పెద్దలు, పిల్లల్లో హృద్రోగ సమస్యల్ని సరిదిద్దేందుకు చేసే సుమారు వందకుపైగా శస్త్రచికిత్సల్లో.... ప్రతి ఆపరేషన్‌కు కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం తక్కువ నిధులివ్వడం పేదలపాలిట శాపంగా మారింది. పెద్దలు, పిల్లల్లో ఎక్కువగా నిర్వహించే 43 రకాల గుండె ఆపరేషన్లకు సంబంధించి కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం 10% నుంచి 290% వరకు... అంటే రూ.50 వేల నుంచి సుమారు రూ.2 లక్షల వరకు తక్కువగా ఇస్తోంది.

గుండె శస్త్రచికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు చాలడం లేదని చాలా ప్రైవేటు ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి. గుండె శస్త్రచికిత్సల్లో పెద్దవారితో పోలిస్తే పిల్లలకు ఎక్కువ ఖర్చు అవుతుండడంతో... వారికి ఆపరేషన్లు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతానికి ఆయా ఆస్పత్రులు తప్పని పరిస్థితుల్లో గుండె ఆపరేషన్లు చేస్తున్నా... ఖర్చు తగ్గించుకోవడానికి వాడిన పరికరాల్నే పదేపదే వాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఇది కొన్ని సందర్భాల్లో రోగులకు ప్రాణసంకటంగా మారడంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలకూ దారితీస్తోంది. దాదాపు అన్ని వ్యాధులనూ ఆరోగ్యశ్రీలో చేర్చేశామని ఊదరగొడుతున్న జగన్‌ ప్రభుత్వం దీనికేం సమాధానం చెబుతుంది?.


ఆపరేషన్లపై ప్రభావం

పెద్దలు, పిల్లలు, శిశువుల్లో హృద్రోగ సమస్యలకు చేసే శస్త్ర చికిత్సల్లో 95% వరకు... బైపాస్‌, కవాటం మార్పిడి, పిల్లల గుండెలో రంధ్రం పూడ్చే ఆపరేషన్లే ఉంటాయి. మిగతా శస్త్రచికిత్సలు మరో 100 రకాల వరకు ఉన్నా... వాటిని చాలా అరుదుగా చేయాల్సి వస్తుంది. పెద్దల్లో ఎక్కువగా కరోనరీ ఆర్టెరీ బైపాస్‌ గ్రాఫ్ట్‌ (బైపాస్‌ సర్జరీ)తో పాటు కవాటం మార్పిడి, కవాటం మరమ్మతు ఆపరేషన్లు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. గుండె సమస్యలకు పరీక్షలు, చికిత్సలకయ్యే ఖర్చూ అధికమే. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి వర్గాల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టిపెట్టి, ఉదారంగా నిధులివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది.

పెద్దల్లో కవాటం మార్పిడి, మరమ్మతు శస్త్రచికిత్సలకు... కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ కంటే రాష్ట్రం ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్న ప్యాకేజీ రూ.1.08 లక్షల నుంచి రూ.1.11 లక్షల వరకు తక్కువ ఉంది. ఇంతతక్కువ మొత్తంలో శస్త్రచికిత్సలు చేయడం తమకు గిట్టుబాటు కాదని ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నాయి. ఆ విషయం రోగులకు నేరుగా చెబితే తమపై ఒత్తిడి తెస్తారన్న ఉద్దేశంతో... తమ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవని, అలాంటి శస్త్రచికిత్సలు తామెప్పుడూ చేయలేదని, ఇక్కడి కంటే హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లి చేయించుకోవడం మంచిదని... రకరకాల సాకులు చెబుతున్నాయి.


వాడిన పరికరాల్నే మళ్లీ వాడుతూ..!

ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అసలు ఆపరేషన్లే జరగడం లేదా? అంటే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న డబ్బుతోనే సర్దుకుపోయి... వాటిలోనే వైద్య పరికరాలకు, వైద్యులకు, నర్సింగ్‌ సిబ్బందికి, ఆపరేషన్‌ అనంతర పర్యవేక్షణకు అయ్యే ఖర్చు పోగా... కొంత లాభం కూడా వేసుకుని కొన్ని ఆస్పత్రులు ఆపరేషన్లు చేస్తున్నాయి. ఖర్చు తగ్గించేందుకు చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సల పరికరాలను ఎక్కువ మందికి వినియోగిస్తున్నాయి. ఉదాహరణకు... యాంజియోగ్రామ్‌ నిర్వహించేందుకు వాడే వైర్‌ని ఆరోగ్యశ్రీలో ముగ్గురు నలుగురికి వాడతున్నట్లు సమాచారం. పదేపదే వాడితే బలహీనపడే ఆ వైర్‌ కొన్ని సందర్భాల్లో రోగి రక్తనాళాల్లోకి వెళ్లాక విరిగిపోయి... అక్కడే ఉండిపోయే ప్రమాదముంది. అలాంటి సమయాల్లో పరీక్ష చేస్తుండగానే రోగి ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించిందని చెప్పి... అప్పటికప్పుడు బైపాస్‌ సర్జరీలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని కొందరు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు శస్త్రచికిత్సల విషయంలోనూ వాడిన పరికరాల్నే మళ్లీమళ్లీ వాడటంతో సమస్యలు వస్తున్నట్లు చెబుతున్నారు.


చిన్న గుండెకు పెద్ద కష్టం

రాష్ట్రంలో ఏటా గుండె సంబంధిత సమస్యలతో జన్మించే శిశువుల సంఖ్య 6,000 వరకు ఉంటుందని అంచనా. వారిలో 10 శాతానికి మందులతోనే సమస్యను తగ్గించవచ్చు. మరో 10 శాతానికి పరికరాల్ని అమర్చి చికిత్స చేయొచ్చు. మిగతా 80% పిల్లలకు ఆపరేషన్లు చేయాల్సిందే. ఇలాంటి పిల్లల్లో అత్యధికులు పేదవర్గాల వారేనని వైద్యులు చెబుతున్నారు. ‘‘శిశువు తల్లి గర్భంలో ఉండగానే 16-20 వారాల వయసులో స్కానింగ్‌ చేస్తే సమస్య ఉంటే తెలుస్తుంది. ఆర్థిక స్తోమత ఉన్నవారు వెంటనే తగిన నివారణ చర్యలు చేపడతారు. సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉందని, శిశువు జన్మించినా ఆరోగ్యంగా జీవనం సాగించలేదని వైద్యులు నిర్ధారిస్తే... గర్భవిచ్ఛిత్తికి మొగ్గు చూపుతారు. పేదలు మాత్రం అలాంటివేమీ చేయలేరు. పిల్లలు పుట్టాక ఆస్పత్రులకు వెళ్లి విషయం తెలుసుకొని.. నిస్సహాయ స్థితిలో ఇంటికి తీసుకెళ్లిపోతారు.

కొన్నాళ్లకు ఆ పిల్లలు చనిపోతున్నారు’’ అని నిపుణుడొకరు తెలిపారు. ‘‘పిల్లల గుండెల్లో రంధ్రం పూడ్చడానికి... ఖర్చులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నా రూ.లక్ష వరకు అవుతుంది. కానీ ప్రభుత్వం రూ.87 వేలు మాత్రమే ఇస్తోంది. ఆపరేషన్‌ థియేటర్‌లో వాడే పరికరాలకే రూ.60-70 వేల వరకు ఖర్చవుతుంది. అందుకే పిల్లల ఆపరేషన్లు చేయడానికి ఆస్పత్రులు ముందుకు రావడం లేదు’’ అని తెలిపారు. 28 రోజుల్లోపు వయసు (నియోనాటల్‌) శిశువు నుంచి... అన్ని వయసుల పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద గుండె శస్త్రచికిత్సలు చేస్తున్న ఆస్పత్రులు ప్రస్తుతం తిరుపతిలో ఒకటి, ప్రైవేటు రంగంలో విజయవాడలో మరొకటి ఉన్నాయి. అక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చే నిధులు చాలకపోయినా... దాతల సహకారంతో పిల్లలకు ఆపరేషన్లు చేయగలుగుతున్నారు.


అన్నింటిలోనూ పోలిక ఉండాలిగా..

ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్న ఆస్పత్రులు... చాలా చికిత్సలకు ప్రభుత్వమిచ్చే ఛార్జీలు తమకు గిట్టుబాటు కావడం లేదని, పెంచాలని చాన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఇటీవల ఒక సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు దానిపై స్పందిస్తూ... ‘ఆయుష్మాన్‌ భారత్‌’లో ఇస్తున్నదానికంటే ఎక్కువ ఇవ్వడం కుదరదని స్పష్టంచేశారు. ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీల ప్యాకేజీలు దాదాపు సమానంగా, కొద్దిపాటి వ్యత్యాసం మాత్రమే ఉన్న ఛార్జ్లీలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఆ మాటలన్నారు. గుండె శస్త్రచికిత్సలకు కూడా ఆయుష్మాన్‌ భారత్‌తో సమానంగా ప్యాకేజీ ఇవ్వాలి కదా? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు పెంచకుంటే, భవిష్యత్తులో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద గుండె శస్త్రచికిత్సలు చేయబోమని మొండికేస్తే... అప్పుడు పేద రోగుల పరిస్థితేంటి?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని