Cyclone Michaung: ముంచేసింది

కోతకొచ్చిన లక్షల ఎకరాల వరిని నేలమట్టం చేస్తూ.. ఆరబెట్టిన లక్షల టన్నుల ధాన్యాన్ని నీటముంచుతూ.. మిగ్‌జాం తీవ్ర తుపాను తీరం దాటింది.

Updated : 06 Dec 2023 08:45 IST

వరికి ఉరేసిన తుపాను
చీరాల సమీపంలో తీరం దాటిన మిగ్‌జాం
అన్నదాత ఆశల్ని ఊడ్చేసిన విపత్తు
లక్షల ఎకరాల్లో నేలవాలిన వరి.. తడిసిన ధాన్యం
ఉద్యాన పంటలకూ దెబ్బ
నష్టం రూ.7వేల కోట్లపైనే!
వేర్వేరు ఘటనల్లో ఆరుగురి మృత్యువాత
ఈనాడు - అమరావతి, బృందం

కోతకొచ్చిన లక్షల ఎకరాల వరిని నేలమట్టం చేస్తూ.. ఆరబెట్టిన లక్షల టన్నుల ధాన్యాన్ని నీటముంచుతూ.. మిగ్‌జాం తీవ్ర తుపాను(Cyclone Michaung) తీరం దాటింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల మధ్య బాపట్లకు దక్షిణంగా చీరాల సమీపంలో ఒడ్డుకు చేరి బలహీనపడింది. ధాన్యం సొమ్ము.. ఇక చేతికొచ్చేసినట్లే అనుకుంటున్న వరి రైతుల ఆశల్ని తుపాను తుడిచిపెట్టేసింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉద్యాన పంటలకూ తీరని నష్టాన్ని మిగిల్చింది. తీవ్ర తుపాను కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టమే రూ.7 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అతి భారీవర్షాలు, గంటకు 100 కి.మీ వేగంతో వీచిన గాలుల తీవ్రతకు వందల గ్రామాలు వణికిపోయాయి.

👉 Follow EENADU WhatsApp Channel

8 జిల్లాల్లోని 60 మండలాల్లో తీవ్ర తుపాను ప్రభావం చూపింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వరి రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఉమ్మడి కడప జిల్లాలో వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు నేలకరిచాయి. తీవ్ర తుపాను కారణంగా.. మంగళవారం ఏలూరు, అనకాపల్లి, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, పల్నాడు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, విశాఖపట్నం, ప్రకాశం, విజయనగరం, కాకినాడ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా ఏలూరు జిల్లా తాడువాయిలో 222, అనకాపల్లి జిల్లా పరవాడలో 178, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో 171, బాపట్ల జిల్లా గురిజేపల్లిలో 150 మి.మీ. వర్షపాతం నమోదైంది.

తిరుపతి జిల్లా చిట్టేడులో 670 మి.మీ

నవంబరు 27న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ.. సోమవారానికి తీవ్ర తుపానుగా మారింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి ప్రయాణిస్తూ.. మంగళవారం తీరం దాటింది. తీవ్ర తుపాను కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురిశాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. ఈ నెల 2 నుంచి 5వ తేదీ సాయంత్రం 7 గంటల మధ్య.. అత్యధికంగా తిరుపతి జిల్లా చిట్టేడులో 670 మి.మీ, చింతవరంలో 647.25, నాయుడుపేటలో 627, నెల్లూరు జిల్లా కత్తువపల్లిలో 621.5, తిరుపతి జిల్లా అల్లంపాడు 610, తిరుపతిలో 554 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇందులో సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్య.. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా చింతవరంలో 421.5, చిట్టేడులో 393, కత్తువపల్లిలో 372 మి.మీ వర్షం కురవడం గమనార్హం. అన్నమయ్య, కృష్ణా, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల కుండపోత వానలు కురిశాయి.

అన్నదాతకు తీరని వేదన

తీవ్ర తుపాను ప్రభావంతో.. రాష్ట్రంలో కోత దశకు వచ్చిన వరిలో 90% నేలవాలింది. వెంటనే నీరు బయటకు పోయినా.. పంట నష్టం తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోత ఖర్చులు పెరగడంతోపాటు ధాన్యం రంగు మారి ధర పడిపోతుందని వాపోతున్నారు. టార్పాలిన్లు కప్పి ఆరబెట్టిన ధాన్యం కిందకు నీరు చేరడంతో.. రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల తేమ కారణంగా ధాన్యం దెబ్బతింటోంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో అధిక శాతం పంట కోత దశలో, కుప్పలపైనే ఉంది. కోత కోసిన చోట పనలు నీటిలో తేలియాడాయి. శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, విజయనగరం, ప్రకాశం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ వరి నేల వాలింది. ఆరబెట్టిన మిరప కూడా అక్కడక్కడా తడిచింది. అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో తోటల్లోని అరటి, బొప్పాయి చెట్లు విరిగిపడ్డాయి.

పునరావాసం, ఆహారమూ కరవు

భారీ వర్షాలకు నెల్లూరు నగరం నీట మునిగింది. తల్పగిరికాలనీ, ఆర్టీసీ కాలనీ, డ్రైవర్స్‌ కాలనీ, రెవెన్యూ కాలనీల్లో నడుములోతు నీరు నిలిచింది. గాంధీ గిరిజన సంఘంలో దాదాపు 60 ఇళ్లు నీట మునిగినా బాధితులకు పునరావాసం, సరిగా ఆహారం ఏర్పాటు చేయలేదు. ఇంటికో భోజనం పొట్లం ఇస్తే ఎలా సరిపోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్‌ పరిధిలో కనుపూరు కాలువకు గండి పడింది. కావలిలో మర్రిచెట్టు కాలనీ నీట మునిగింది. నెల్లూరు మైపాడు బీచ్‌లో రోడ్లపై చెట్లు నెలకొరిగాయి. తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలోకి నీరు రావడంతో బస్సుల రాకపోకలు నిలిపివేశారు. కైవల్య నది ఉద్ధృతంగా ప్రవహించడంతో చింతచెట్ల ప్రాంతం మొత్తం నీట మునిగింది. బాధితులను పునరావాస కేంద్రానికి తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపారు.

తెగిన రహదారులు.. విరిగిపడిన స్తంభాలు

తిరుపతి జిల్లా కాళంగి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో సూళ్లూరుపేట జాతీయ రహదారిపైకి నాలుగు అడుగుల మేరకు నీరు చేరడంతో నెల్లూరు- చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. సూళ్లూరుపేట పట్టణంలోని రైల్వే గేటు పడమర వైపు ఉన్న సాయినగర్‌, మహదేవయ్యనగర్‌ తదితర ప్రాంతాల్లోని కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. స్వర్ణముఖి నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. గూడూరు- రాజంపేట ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు- వెంకటగిరి, గూడూరు- విందూరు మార్గంలోని 15 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.

  •  బాపట్ల సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటుతుందనే సమాచారంతో.. ఆదివారం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు భయంభయంగా గడిపారు. భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో నల్లమడ, కుప్పగంజి, నక్కవాగు, పేరలి, తూర్పు తుంగభద్ర, భట్టిప్రోలు, రేపల్లె మెయిన్‌ డ్రెయిన్‌, తెనాలి డ్రెయిన్‌, గుంటూరు నల్లకాలువ, ఈస్ట్‌ స్వాంప్‌, వెస్ట్‌ స్వాంప్‌, మురుకుండపాడు ఉత్తర,  పర్చూరు వాగు, రొంపేరు, వేటపాలెం, ఈపూరుపాలెం మురుగుకాలువలు ఉద్ధృతంగా ప్రవహించాయి. బాపట్ల- గుంటూరు, రేపల్లె- నిజాంపట్నం, 216ఏ జాతీయ రహదారి, చీరాల- దేశాయిపేట, చీరాల- పర్చూరు మార్గంలో వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
  •  కడప, బద్వేలు ఆర్టీసీ గ్యారేజీల్లోకి వరదనీరు చేరింది.
  • ఏలూరు జిల్లా మండవల్లి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జాతీయ రహదారి 165, ముదినేపల్లిలో జాతీయ రహదారి 216పై నీరు చేరింది. కైకలూరులో ప్రధాన రహదారులన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలోకి భారీగా వర్షం నీరు చేరింది.  వెంకటగిరి -పాలెంకోట మార్గంలో మినీ వంతెన గొడ్డేరు వాగు ధాటికి కొట్టుకుపోయింది.

ఆరుగురి మృతి

వైయస్‌ఆర్‌ జిల్లా సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద చెట్టు విరిగి ద్విచక్రవాహనంపై వెళుతున్న ఏపీఎస్పీ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ సత్యకుమార్‌పై  పడటంతో ఆయన మరణించారు. చీరాలలో ఒక వ్యక్తి మురుగుకాలువలో పడి మృతి చెందారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకు పంచాయతీలో రంగంపేట ఎస్టీ కాలనీ, టీఆర్‌ కండ్రిగ ఆదిఆంధ్రవాడలో ఈదురుగాలులకు తాళలేక ఇద్దరు వృద్ధులు చనిపోయారు.

భారీ వర్షం, ఈదురు గాలులకు పొలంలోని పాకలు కూలి ఇద్దరు గిరిజన రైతులు దుర్మరణం పాలైన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కొత్తరాజానగరంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెట్టి గంగరాజు (60), జోడే రామయ్య (62) తమ పొలాలకు వెళ్లారు. వర్షం తగ్గకపోవడంతో రాత్రి పొద్దుపోయే వరకు అక్కడ ఉన్న వేర్వేరు పాకల్లో ఉండిపోయారు. రామయ్య చలికి తట్టుకోలేక తన పాకలో చలిమంట వేసుకున్నారు. ఒక్కసారిగా ఈదురు గాలి వచ్చి రెండు పాకలు కూలిపోయాయి. పాక స్తంభం తలపై పడి గంగరాజు చనిపోయారు. పాక కూలడంతో చలి కాగుతున్న మంటలు అంటుకొని రామయ్య సజీవ దహనమయ్యారు. గంగరాజుతో పాటు పాకలో ఉన్న మరో ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.


జల్లెడలా రహదారి!

కృష్ణా జిల్లాలో తుపాను కారణంగా మరింత అధ్వానంగా మారిన అవనిగడ్డ - కోడూరు మార్గం. వర్షాలకు గుంతల్లో చేరిన నీటితో  ఏ గొయ్యి ఎంత లోతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. గతేడాది సీఎం జగన్‌ రోడ్డు నిర్మాణానికి రూ.35 కోట్లు ఇస్తామన్నారు. నేటికీ ఇవ్వకపోవడంతో ప్రజలు పడుతూలేస్తూ పయనిస్తున్నారు.


పిల్లలను పట్టించుకోరు

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలోని నీట మునిగిన బాలుర వసతి గృహం. భవనమూ కురుస్తుండటంతో పిల్లలంతా తలదాచుకునేందుకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్తూ కనిపించారు.


జలదిగ్బంధంలో జిల్లా ఆసుపత్రి

ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఫిజియోథెరపీ వార్డు, స్కానింగ్‌ సెంటర్లు, ఆర్‌ఎంవో కార్యాలయం, ఓపీ కౌంటర్లు, ఆరోగ్యశ్రీ హెల్ప్‌ డెస్క్‌, ఎముకల వ్యాధి ఓపీ తదితర విభాగాల్లోకి నీరు చేరడంతో మోటార్లతో తోడారు. రోగులు నిల్చోవడానికి వీల్లేకపోయింది.


నిరాశ్రయులను వదిలేశారు

విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి రహదారి పక్కన వర్షంలోనే అవస్థ పడుతున్న ఈ నిరాశ్రయురాలి పేరు దుర్గ. గతంలో కుడి చేయి కోల్పోయిన వృద్ధురాలు కాళ్లూ కదపలేని స్థితిలో ఉంది. హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన గొడుగు తప్ప మరే రక్షణ లేక నడిరోడ్డుపై బిక్కుబిక్కుమంటూ కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని