Cyclone Michaung: గాఢాంధకారంలో గ్రామాలు.. పట్టణాలు!

మిగ్‌జాం తుపాను ప్రభావంతో గాలులు, వర్షాలతో నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా విద్యుత్‌సరఫరా నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

Updated : 06 Dec 2023 08:41 IST

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులుగా నిలిచిన విద్యుత్‌ సరఫరా
ఫోన్‌ ఛార్జింగ్‌కు అగచాట్లు.. తాగునీరు అందక పాట్లు
1,637 గ్రామాలు.. 14 పట్టణాల్లో విద్యుత్‌కు అంతరాయం

ఈనాడు, అమరావతి: మిగ్‌జాం తుపాను(Cyclone Michaung) ప్రభావంతో గాలులు, వర్షాలతో నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా విద్యుత్‌సరఫరా నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈదురుగాలులకు చెట్లు విరిగి విద్యుత్‌ తీగలపై పడ్డాయి. చాలాచోట్ల సబ్‌స్టేషన్లు నీట మునిగాయి. ముందుజాగ్రత్తగా పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. దీంతో మూడు డిస్కంల పరిధిలోని 14 పట్టణాలు, 74 మండలాల పరిధిలోని 1,637 గ్రామాలకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 572 చోట్ల స్తంభాలు విరిగిపడి విద్యుత్‌ సరఫరా ఆగింది. విద్యుత్‌ సంస్థలకు సుమారు రూ.14 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనావేశారు.

👉 Follow EENADU WhatsApp Channel

నెల్లూరు, తిరుపతి జిల్లాలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు సోమవారం ఉదయం నుంచి విద్యుత్‌ సరఫరా లేక ప్రజలు గాఢాంధకారంలో మగ్గిపోతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలపై ప్రభావం పడింది. జనరేటర్ల సాయంతో వైద్యసేవలను అందించాల్సి వచ్చింది. తాగునీటి సరఫరా పథకాలకు విద్యుత్‌ సరఫరా లేక చాలాచోట్ల రెండు రోజులుగా అవి పనిచేయలేదు. వాటర్‌ప్లాంట్లకూ విద్యుత్‌ లేకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందిపడ్డారు.

తెగిపడిన తీగలు.. నీట మునిగిన సబ్‌స్టేషన్లు

తుపాను ప్రభావం నెల్లూరు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, కోట ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల సర్కిళ్ల పరిధిలోని 1,119 గ్రామాల పరిధిలో విద్యుత్‌ సరఫరా లేక.. కొన్నిప్రాంతాల్లో సెల్‌టవర్లు పనిచేయలేదు.

  • నెల్లూరు, తిరుపతి, కడప సర్కిళ్ల పరిధిలో 33 కెవి సబ్‌స్టేషన్లు 43, 33 కెవి ఫీడర్లు 54, 315 చోట్ల విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. 85 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.

  • నెల్లూరు జిల్లాలో విద్యుత్‌సరఫరా పునరుద్ధరణకు వెయ్యిమంది సిబ్బందితో 424 ప్రత్యేక బృందాలను అధికారులు ఏర్పాటుచేశారు. 30 వేల విద్యుత్‌ స్తంభాలు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచారు. మంగళవారం రాత్రికి నగరంలోని ప్రాంతాలకు సరఫరా పునరుద్ధరించారు.

  • బాపట్ల జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో సోమవారం నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచింది. అద్దంకి పరిధిలో 6 సబ్‌ స్టేషన్లు, వేటపాలెం పరిధిలో 5 సబ్‌స్టేషన్లలోకి వరదనీరు చేరింది. దీంతో మంగళవారం వేకువజాము ఒంటిగంట నుంచి విద్యుత్‌సరఫరా నిలిచింది. పర్చూరు 132 కెవి సబ్‌స్టేషన్‌ వరద నీటిలో మునిగింది.
  • తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలో 3చోట్ల 33 కెవి సబ్‌స్టేషన్లు, 23చోట్ల 33 కెవి ఫీడర్లు, సుమారు 100 చోట్ల స్తంభాలు విరిగిపడ్డాయి. 68 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
  • కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని గుంటూరు, విజయవాడ, ఒంగోలు సర్కిళ్ల పరిధిలో 25 మండలాల పరిధిలోని 361 గ్రామాలు, 8 పట్టణాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచింది. 33 కెవి సబ్‌స్టేషన్లు 64, 33 కెవి ఫీడర్లు 46, వందకు పైగా స్తంభాలు విరిగిపడ్డాయి.

తీరం దాటిన వేళ...

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-బాపట్ల: తీవ్ర తుపాను మిగ్‌జాం తీరం దాటే సమయంలో ఈదురుగాలుల ధాటికి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో పలు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు విరిగి ఇళ్లు, రహదారులపై పడటంతో రాకపోకలు స్తంభించాయి. సూర్యలంక వద్ద మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరం, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో నీళ్లు రహదారుల మీదకు చేరాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి మంగళవారం ఆహారం పంపిణీ చేయడానికి జోరువానలో యంత్రాంగం ఇబ్బందులు పడింది. ఈదురుగాలులకు 350 విద్యుత్తు స్తంభాలు విరిగిపడి బాపట్ల జిల్లాలో అంధకారం నెలకొంది. ఎమ్మెల్యే కోన రఘుపతి ఇంటి సమీపంలో కరెంటు తీగలపై పెద్ద చెట్టు పడి స్తంభాలు కూలిపోయాయి. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని