అన్నదాతను దెబ్బతీసిన మిగ్‌జాం

ఎటు చూసినా పొలాల్ని చుట్టేసిన వరద.. వాననీటిలో తేలుతున్న వరి ఓదెలు.. కోతకు వచ్చిన పనలు నేలవాలి నీటమునగడంతో గల్లంతైన ఆశలు.. కుప్పలు పోసినా చెమ్మ చేరి దెబ్బతింటున్న ధాన్యం.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే చేజారిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు.. కోస్తా జిల్లాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు.

Updated : 06 Dec 2023 07:18 IST

నేలవాలిన వరి.. రైతు ఆశలు ఆవిరి
లక్షల ఎకరాల్లో పంట వర్షార్పణం
మినుము, పత్తి, మిర్చి, అరటి తదితర పంటలకూ నష్టం
కన్నీటిపర్యంతమవుతున్న కర్షకులు

ఈనాడు- అమరావతి, కాకినాడు, అనకాపల్లి, నెల్లూరు, ఒంగోలు, కడప, న్యూస్‌టుడే-బాపట్ల: ఎటు చూసినా పొలాల్ని చుట్టేసిన వరద.. వాననీటిలో తేలుతున్న వరి ఓదెలు.. కోతకు వచ్చిన పనలు నేలవాలి నీటమునగడంతో గల్లంతైన ఆశలు.. కుప్పలు పోసినా చెమ్మ చేరి దెబ్బతింటున్న ధాన్యం.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే చేజారిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు.. కోస్తా జిల్లాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు. గుంటూరు జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో వరి పంటకు తుపానుతో కోలుకోలేని దెబ్బ తగిలింది.

👉 Follow EENADU WhatsApp Channel

బాపట్ల జిల్లాలో 1.95 లక్షల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట మొత్తం వర్షార్పణమైంది. 3,125 ఎకరాల్లో కోసి కుప్పలు వేసి ధాన్యంలోకి నీరు చేరి దెబ్బతింది. మరో వారం రోజుల్లో పంట కోతకు వచ్చి రూ.కోట్ల విలువైన దిగుబడులు చేతికందే తరుణంలో మిగ్‌జాం తుపాను పంటతో పాటు రైతు ఆశల్నీ ఊడ్చేసింది. బాపట్ల జిల్లాలో వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో కోత కోసి పొలాల్లో వేసిన ఓదెలు వాన నీటిలో తేలియాడుతున్నాయి. వర్షం నుంచి రక్షించుకునేందుకు పట్టలు కప్పినా పైన నీరు నిలిచి ధాన్యం తడిసిపోతోంది. ధాన్యం నిల్వకు గోదాముల్లేక రైతులు కష్టాలు పడుతున్నారు.

కృష్ణా పశ్చిమ డెల్టాలో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి పంట వర్షానికి దెబ్బతింది. ఎకరాకు సగటున 35 బస్తాల చొప్పున దిగుబడి వస్తోంది. 76 కిలోల బస్తా ధాన్యం రూ.1,650కు కొంటున్నారు. ఈ లెక్కన ఎకరాకు రూ.57,750 రైతులు కోల్పోయారు. పంట పూర్తిగా కోల్పోతే రెండు జిల్లాల పరిధిలో రైతులకు రూ.1732 కోట్ల మేర నష్టం వాటిల్లుతుంది. గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో నూర్పిడి చేయాల్సిన మినుము 3 వేల ఎకరాల్లో దెబ్బతింది. లేత దశలో ఉన్న శనగ పంట 10 వేల ఎకరాల్లో నీట మునిగి కుళ్లిపోతోంది. మిర్చి పంట 30,295 ఎకరాల్లో దెబ్బతింది. బాపట్ల జిల్లాలో మిర్చి 8820, శనగ 8000, పొగాకు 5000, అపరాలు 2000, అరటి 1415, వేరుసెనగ 1820 హెక్టార్లలో దెబ్బతిన్నాయి.

అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అరటి, బొప్పాయి తోటలన్నీ నేలవాలాయి. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలు, కమలాపురం మండలాల్లో వరి పంట నేల వాలడంతో గింజలు మొలకెత్తాయి. అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాలో వరి 30 వేల ఎకరాలు, అరటి 12 వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.

అనకాపల్లి జిల్లాలోని ఎస్‌.రాయవరం, కోటవురట్ల మండలాల్లో మంగళవారం 14 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో గెడ్డలు, వాగులు పొంగి పొర్లాయి. వరి పంటంతా నేలమట్టమైంది. కోసిన పనలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. జిల్లా మొత్తంగా 4 వేల ఎకరాల్లో వరి పైరు నేలకొరిగి నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇది మరింత ఎక్కువగానే ఉంటుందని ఓ అధికారి తెలిపారు.

కృష్ణాలో లక్షన్నర ఎకరాల్లో దెబ్బతిన్న వరి

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 55 వేల టన్నుల ధాన్యం రాశులు తడిసిపోయాయి. కొన్ని మొలకలొస్తున్నాయి. లక్షన్నర ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలి నీటమునిగాయి. దాదాపు 20 వేల ఎకరాల్లో పత్తి పంట వాననీటికి నల్లబడింది. దిగుబడి భారీగా తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. 

ప్రకాశంలో పొగాకు, శనగకు దెబ్బ

భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలో పొగాకు, మిర్చి, వరి, శనగ పంటలు నీట మునిగాయి. అరటి తోటలు నేలకొరిగాయి. పొగాకు, పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. కోతలకు వచ్చిన వరి, మిర్చి తోటలు నేలకొరిగాయి. రూ.80 కోట్ల వరకు నష్టం ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం 26,430 ఎకరాల్లో పంట దెబ్బతింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని