అటు ప్రకృతి ప్రకోపం.. ఇటు జగన్‌ వికృత రూపం

రాష్ట్రంలోని రైతులు ఏటికేడు నష్టాల ఊబిలోకి దిగబడుతున్నారు. ప్రకృతితోపాటు వైకాపా సర్కారు పనితీరూ ఇందుకు కారణం.

Updated : 06 Dec 2023 07:08 IST

నలిగిపోతున్న రాష్ట్ర రైతులు
నాలుగున్నరేళ్లుగా ఏటా నష్టాలు... కష్టాలు
నష్టం రూ.20వేల కోట్లు... సాయం రూ.2వేల కోట్లే
విపత్తుల పడగ నీడలో వ్యవసాయం
ఈనాడు, అమరావతి

అధిక వానలు... అకాల వర్షాలు...
తుపానులు... ఈదురు గాలులు, వడగళ్లు..
అతివృష్టి లేదంటే అనావృష్టి...
ఆంధ్రావనిపై ప్రకృతి ఏదోరకంగా    ప్రకోపిస్తునే ఉంది...
ఈ విపత్తులకు జగనన్న సర్కారు వికృత రాజకీయం కూడా తోడవటంతో...
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అన్నదాతలు నష్టాల్లో మునిగి... కష్టాల్లో తేలుతున్నారు!
అయినా.. పేదల పక్షపాతినని చెప్పుకొనే సీఎం జగన్‌కు చీమ కుట్టినట్లైనా లేదు..  
కంటితుడుపు చర్యలతో సరిపెట్టడమేనా ముఖ్యమంత్రి చెప్పే సంక్షేమం?
తమ పాలనలో కరవనేదే లేదని గొప్పలు చెప్పుకొనే జగనే దీనికి సమాధానం చెప్పాలి మరి..

రాష్ట్రంలోని రైతులు ఏటికేడు నష్టాల ఊబిలోకి దిగబడుతున్నారు. ప్రకృతితోపాటు వైకాపా సర్కారు పనితీరూ ఇందుకు కారణం. విపత్తులతో 2019 నుంచి సుమారు రూ.20వేల కోట్లకు పైగా పంట ఉత్పత్తుల్ని రైతులు నష్టపోయి ఉంటారని అంచనా. అయితే సర్కారు పెట్టుబడి రాయితీగా ఇచ్చింది రూ.1,977 కోట్లు మాత్రమే. అంటే.. మొత్తం నష్టంలో 10 శాతం మాత్రమేనన్నమాట. నాలుగేళ్లుగా తుపాన్లూ, వరదలతో అన్నదాతలు నిండా మునుగుతున్నా, రూ.వేల కోట్లలో నష్టపోతున్నా.. పెట్టుబడి రాయితీ పేరుతో పదీ పరకా ఇచ్చి సరిపెడుతున్నారు. అదే ఘనమైన సాయంగా ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు వరస నష్టాలే. వరి పండించే రైతుల పరిస్థితి మరీ దయనీయం. ఏకంగా పంట విరామం ప్రకటించాల్సిన అగత్యం ఏర్పడింది. ఉచిత పంటల బీమా ఇచ్చి ఆదుకుందామనే ఆలోచన కూడా వైకాపా సర్కారుకు లేకపోయింది. లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగితే.. 25 శాతం విస్తీర్ణానికి కూడా పెట్టుబడి రాయితీ అందడం లేదు.


2019లో కౌలు రైతులపై దెబ్బ 

2019 అక్టోబరు చివరి వారంలో గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు కురిసిన వర్షాలతో వరి, పత్తి రైతులు నష్టపోయారు. శ్రీకాకుళం జిల్లాలో సాధారణం కంటే 64.3 శాతం, విజయనగరం జిల్లాలో 90 శాతం అధికంగా వానలు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరులోనూ సాధారణం కంటే 39 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. భారీగా వరి నేలకొరిగింది. సుమారు 6 లక్షల ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నట్లు అంచనా. సుమారు రూ.1,000 కోట్ల పైనే నష్టం జరిగింది. ఈ వర్షాలు కౌలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి.


2020లో వరస వరదలు

2020 ఖరీఫ్‌లో వరి రైతులు జులై, సెప్టెంబరు, అక్టోబరులో మూడుసార్లు నష్టాపోయారు. ఒకసారి నారుమళ్లు దెబ్బతింటే మళ్లీ విత్తారు. ఆ తర్వాత కురిసిన వానలకు అవి మునిగాయి. మళ్లీ ధైర్యం చేసి నాటి, పంట వేసినా.. తీరా నవంబరులో దిగుబడి చేతికొచ్చే సమయంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లాలో సాధారణం కంటే 91.8 శాతం అధికంగా వానలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలతో రైతులు నష్టపోయారు. వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు పశు, మత్స్య రంగాలకు రూ.1,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.

2020 నవంబరులో నివర్‌ తుపాను విరుచుకుపడింది.

ఆ ప్రభావంతో 17.33 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రకటించారు. వరి సహా ఇతర పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. మొత్తంగా రూ.3,167 కోట్ల మేర పంట నష్టం జరిగింది.


2021లో గులాబ్‌..

2021 జులైలో కురిసిన వర్షాలతో పత్తి, వరి నారుమళ్లు, నాట్లు నీట మునిగాయి. సెప్టెంబరులో గులాబ్‌ తుపాను ముంచేసింది. అదే ఏడాది
అక్టోబరు, నవంబరులోనూ భారీ వర్షాలు కురవడంతో 13.24 లక్షల ఎకరాల్లో  పంటలు దెబ్బతిన్నాయి. పంటనష్టంతోపాటు పశు, మత్స్యరంగాలను కలిపితే రూ.1,892 కోట్ల నష్టం జరిగిందని అంచనా.


2022లో కాకి లెక్కలు..

2022 జులైలో గోదావరికి వరదలు రావడంతో.. పరిసర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో 25.80 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తడంతో నారుమళ్లు మునిగిపోయాయి. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోజుల తరబడి నీరు నిలవడంతో.. అరటి, బొప్పాయితోపాటు కూరగాయ పంటల రైతులు భారీగా నష్టపోయారు.

2022 డిసెంబరులో మాండౌస్‌ తుపాను 16 జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని రైతులు చెబుతుంటే, అధికారులు మాత్రం 1.51 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని తేల్చారు.


2023లో ఇచ్చింది గోరంత..

2023 మార్చి నెలలో ఈదురుగాలులు, వడగళ్ల వానలతో 22 జిల్లాల్లో పంటలపై ప్రభావం పడిందని అంచనా. ఉద్యాన రైతులకు కోలుకోలేని నష్టం జరిగింది. అరటి, మామిడి, బొప్పాయితోపాటు అక్కడక్కడా వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టం రూ.1,000 కోట్ల పైనే ఉంటుందని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. ప్రభుత్వం మాత్రం 59 వేల
ఎకరాల్లోపే పంట నష్టంగా గుర్తించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో తూర్పుగోదావరి, కాకినాడ, డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ధాన్యం తడిసింది. కోత దశలోని వరి నేల వాలింది. మొక్కజొన్న, జొన్న సాగు చేసిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. రోజుల తరబడి పంట నీటిలోనే ఉండటంతో పసుపు రైతుల కష్టం వర్ణనాతీతం. 23 జిల్లాల పరిధిలో 6 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని పంటలు దెబ్బతింటే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.54 కోట్ల పెట్టుబడి రాయితీతో సరిపెట్టింది. మే నుంచి ఆగస్టు వరకు అకాల వర్షాలు, వరదలతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వారికి అందించిన సాయం రూ.11 కోట్లు మాత్రమే.


చితికిపోతున్న చిన్న రైతులు

వరద, కరవులతో నష్టపోతున్న వారిలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. వైపరీత్యాలతో గింజ కూడా చేతికి రాక.. అప్పులు తీర్చలేక సాగుకే దూరమవుతున్నారు. డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, బాపట్ల తదితర జిల్లాల్లో రైతులు ఖరీఫ్‌లో పంట వేయడమే
మానుకున్నారు. రబీలో కొంతైనా లాభదాయకంగా ఉంటుందని నాట్లు వేస్తే.. ఇప్పుడూ అదే పరిస్థితి. ఏ పంట నష్టానికి అదే పంట కాలంలోపు పెట్టుబడి రాయితీ ఇవ్వడమే గొప్పగా భుజాలు చరుచుకుంటున్న ప్రభుత్వం.. వాస్తవంగా ఎకరానికి ఎంత నష్టపోతున్నారు.. ఇచ్చేదెంత? తదితర అంశాలపై దృష్టి పెట్టకపోవడం శోచనీయం.


అది కరవు కాదంట... 

వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2019 జూన్‌లో వానలు లేక సాగు తగ్గింది. జూన్‌ ఆఖరుకు సాధారణం కంటే 43 శాతం తక్కువ వానలు కురిశాయి. జులై 24వ తేదీ నాటికి 36 శాతం వర్షపాతలోటు నమోదైంది. 11 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. సాధారణ విస్తీర్ణం కంటే 15 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. అయినా ప్రభుత్వం కరవుగా ప్రకటించలేదు. 

  • 2021-22 ఆగస్టు, సెప్టెంబరులో రాయలసీమలో వర్షాభావం నెలకొంది. వేరుశనగ ఎకరాకు 106 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. పంటనష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లినా, కరవుగా గుర్తించలేదు.
  • 2022-23లోనూ కర్నూలు, పల్నాడు, రాయలసీమ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. 273 మండలాల్లో పొడివాతావరణం నెలకొంది. 18 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. పత్తి దిగుబడి భారీగా తగ్గింది. అయినా ఒక్క మండలాన్నీ కరవు ప్రభావితంగా ప్రకటించలేదు.
  • ఈ ఏడాది ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం నెలకొంది. వందేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా వానలు కురిశాయి. సుమారు 30లక్షల ఎకరాల సాగు తగ్గింది. 400లకు పైగా మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులుంటే, కేవలం 103 మాత్రమే కరవు ప్రభావితంగా ప్రకటించారు. రైతులకు రూ.వేల కోట్లలో నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం కొద్దిపాటి కరవే అంటూ కొట్టిపారేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని