‘వంద అడుగుల’ వ్యూహం

విశాఖ నడిబొడ్డున ఉన్న విలువైన దసపల్లా భూములు ఇటీవలే నిషేధిత జాబితా (22ఏ) నుంచి బయటపడ్డాయి.

Updated : 06 Dec 2023 06:59 IST

దసపల్లాపై మరో ‘మాస్టర్‌ ప్లాన్‌’!
రోడ్ల విస్తరణకు కదిలిన పావులు
ఓ నేత ప్రాజెక్టు అనుమతులు సులువయ్యేందుకే!

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నడిబొడ్డున ఉన్న విలువైన దసపల్లా భూములు ఇటీవలే నిషేధిత జాబితా (22ఏ) నుంచి బయటపడ్డాయి. ఇందులో రూ.3వేల కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని డెవలప్‌ చేయడానికి ఓ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టులో ఎక్కువ వాటా ఉన్న వ్యక్తి వైకాపా కీలక నేతకు బినామీ అనే ఆరోపణలున్నాయి. అక్కడ ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు.. ఒకే రోడ్డుతో అటు భారీ అంతస్తులకు అనుమతులు, ఇటు పరిహారం కింద రూ.వందల కోట్ల విలువైన టీడీఆర్‌లు దక్కించుకునేందుకు పావులు కదిలాయి. ఈ భూముల మధ్యలో వంద అడుగుల రోడ్డు అభివృద్ధి చేయడానికి తాజాగా జీవీఎంసీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ విడుదల చేయడం వెనుక ఆ నేత పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. వంద అడుగుల రోడ్డు ఉంటేనే అక్కడ ఎత్తయిన అపార్టుమెంట్లకు అనుమతి వస్తుంది. అందుకే.. ఇక్కడ అధికారపార్టీ నేతల స్థలాలకు విలువ పెరిగేలా, భారీ భవనాలకు మార్గం సులువయ్యేలా ‘మాస్టర్‌ప్లాన్‌’ రోడ్డు అభివృద్ధికి పావులు కదిపారు. దీన్ని వంద అడుగులకు విస్తరిస్తున్నట్లు జీవీఎంసీ మంగళవారం ప్రకటన ఇచ్చింది.

👉 Follow EENADU WhatsApp Channel

అలా లబ్ధి: ‘మాస్టర్‌ప్లాన్‌-2041’లో అభివృద్ధి చేసే రహదారికి ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించడం నేతలకు లబ్ధి కోసమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్క్యూట్‌హౌస్‌ కూడలి నుంచి నౌరోజి రోడ్డు వరకు వంద అడుగులకు విస్తరించాలనుకున్న రోడ్డు దసపల్లా భూముల మధ్య నుంచే వెళుతోంది. ఇదే జరిగితే విస్తరిస్తున్న రహదారికి అవసరమైన భూమికి పరిహారంగా టీడీఆర్‌లు కొట్టేసేందుకు అడుగులు పడినట్లే. ఈ టీడీఆర్‌లను దసపల్లా భూముల్లో మున్ముందు చేపట్టే భారీ నిర్మాణాలకు జీవీఎంసీకి చెల్లించాల్సిన ఛార్జీలకు బదులుగా వినియోగించుకునేలా ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఇక్కడే 1028, 1196, 1197 సర్వే నంబర్లలో రాణిసాహిబా వాద్వాన్‌ పేరున రికార్డులున్నాయి. టీడీఆర్‌లకు ఎవరు దరఖాస్తు చేసుకుంటున్నారు? ఆమె వారసులెవరు? దసపల్లా భూములు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? అంటే అధికారుల వద్ద సమాధానాల్లేవు. ఓ ప్రణాళిక ప్రకారం వైకాపా నాయకులకు చెందిన భూములుగా చిత్రీకరిస్తున్న అధికారులు, వారికే టీడీఆర్‌లు కట్టబెట్టే అవకాశాలున్నాయి. జీవీఎంసీకి చెందిన మంచినీటి సరఫరా ట్యాంకు ఈ భూముల్లో ఒకటిన్నర ఎకరాల్లో విస్తరించింది. దాన్నీ తొలగించడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని