Gold: తనఖా బంగారం పోతే బ్యాంకుదే బాధ్యత

ఆర్థిక అవసరాలు వస్తే ఇంట్లోని బంగారు ఆభరణాలను తనఖా పెట్టి, నగదు అప్పు తెచ్చుకోవడం సులభమైన మార్గం.

Updated : 06 Dec 2023 17:36 IST

ఖాతాదార్లకు సమాన లోహం.. లేదా నగదు చెల్లింపు
ప్రతి రుణానికీ బీమా ఉంటుంది

ఈనాడు వాణిజ్య విభాగం: ఆర్థిక అవసరాలు వస్తే ఇంట్లోని బంగారు ఆభరణాలను తనఖా పెట్టి, నగదు అప్పు తెచ్చుకోవడం సులభమైన మార్గం. గ్రాము బంగారం తనఖాపై ప్రైవేటు వ్యాపారులు, ఎన్‌బీఎఫ్‌సీల కంటే జాతీయబ్యాంకులో తక్కువ మొత్తమే రుణంగా ఇస్తున్నా, తమ సొత్తు భద్రంగా ఉంటుందనే భరోసాతో ప్రజలు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గార ఎస్‌బీఐలో ప్రజలు తనఖా పెట్టిన 7 కిలోల బంగారు ఆభరణాలు (సుమారు రూ.4.07 కోట్ల విలువ) కనిపించకపోవడం, అక్కడి ఒక మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడంతో ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తనఖా పెట్టుకున్న ఆభరణాల బాధ్యత బ్యాంకుదే అవుతుందని, ఈ విషయంలో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక జాతీయబ్యాంకు ప్రధానాధికారి ‘ఈనాడు’తో చెప్పారు.

👉 Follow EENADU WhatsApp Channel

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఖాతాదారులు తనఖా పెట్టిన ఆభరణాలను బ్యాంకు సేఫ్‌లో భద్రపరుస్తారు. బ్యాంకుశాఖలోని ఎకౌంటెంట్‌తో పాటు క్యాష్‌ ఇన్‌ఛార్జి (క్లర్క్‌) లేదా మరో అధికారి సంయుక్తంగా వీటికి బాధ్యత వహిస్తారు. ఈ సేఫ్‌ తాళాలు ఇద్దరి దగ్గర ఉంటాయి. ఒకరిని గుడ్డిగా నమ్మి, వేరొకరు కూడా తమ తాళాన్ని వారికి ఇస్తే తప్ప సొత్తును అపహరించడం కష్టం. బ్యాంకు శాఖల్లో తనిఖీ/ఆడిట్‌ జరిగినప్పుడు ఆభరణాలు ఏమైనా తగ్గితే.. వెంటనే పరిశీలన జరిపి, లెక్క తేలుస్తారు. కొందరు రుణం తీర్చేసినప్పుడు వారికి ఆభరణాలు ఇచ్చేసినా.. పొరపాటున సేఫ్‌లోనూ ఉన్నట్లు అధికారులు రాసుకుంటారని పదవీవిరమణ చేసిన మరో బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు.

ఇప్పుడేమవుతుంది?: గార ఎస్‌బీఐలో సిబ్బంది ఆభరణాలను అపహరించినట్లు భావిస్తున్నారు. రుణం ఇచ్చేటప్పుడు బ్యాంకులో నమోదయ్యే బంగారం బరువు మేరకు ఖాతాదార్లు పరిహారం పొందొచ్చు. 100 గ్రాముల ఆభరణం పెట్టినా, 98 గ్రాములనే పరిగణనలోకి తీసుకుంటే.. అంత బంగారం గానీ, దాని విలువ మేరకు నగదును కానీ పొందే హక్కు ఖాతాదార్లకు ఉంటుంది. తనఖా పెట్టినప్పటి ధర, చోరీ జరిగినట్లు గుర్తించినప్పటి ధరలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం చెల్లిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని