Cyclones: ఏపీలో అయిదు దశాబ్దాల్లో 60 తుపాన్లు

వాతావరణ మార్పులు, ఇతర కారణాలతో బంగాళాఖాతంలో తుపాన్ల సంఖ్య తగ్గినా.. అప్పుడప్పుడు ఏర్పడినవే తీవ్ర రూపం దాల్చుతున్నాయి.

Published : 06 Dec 2023 07:50 IST

భవిష్యత్తులో మరింత ముప్పు
మడ అడవుల నరికివేతతో తీరప్రాంతాల్లో సమస్యలు

 ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: వాతావరణ మార్పులు, ఇతర కారణాలతో బంగాళాఖాతంలో తుపాన్ల సంఖ్య తగ్గినా.. అప్పుడప్పుడు ఏర్పడినవే తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గత అయిదు దశాబ్దాల్లో రాష్ట్రంపై దాదాపు 60 తుపాన్లు ప్రభావం చూపాయి. వాటిలో 36కు పైగా తీవ్ర, అతితీవ్రత తుపాన్లే. నవంబరు, డిసెంబరు నెలల్లో 25 తుపాన్లు ఏర్పడటం గమనార్హం. తాజాగా బాపట్ల సమీపంలో తీరం దాటిన ‘మిగ్‌జాం’ తుపాను నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలపైనా ప్రభావం చూపించింది. భవిష్యత్తులో మరిన్ని తీవ్ర తుపాన్లు ఏర్పడే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తీర ప్రాంతాలకు ప్రమాదం: రాష్ట్రంలో 90 శాతం తుపాన్లు అక్టోబరు 15 నుంచి డిసెంబరు వరకు తీరం దాటడానికి అనుకూల పరిస్థితులుంటాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, జలాలు ఉప్పొంగడం వల్ల భవిష్యత్తులో తీర ప్రాంతాలకు ప్రమాదం వాటిల్లే అవకాశముంది. మడ అడవులను ధ్వంసం చేయడమూ ఇందుకు ఒక కారణం. రాష్ట్రంలో పూడిమడక, కాకినాడ, ప్రకాశం జిల్లాలో స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వాటిని కొట్టేస్తున్నారు. ‘భవిష్యత్తు పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో సుందర్‌బన్స్‌ తరహా మడ అడవులు పెంచాలి. తుపాన్లు, సునామీలు, ఉప్పెనలను ఎదుర్కోగల శక్తి వాటికే ఉంది’ అని ఏయూ వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు భానుకుమార్‌ తెలిపారు.

  • రాష్ట్రంలో దాదాపు 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతముంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం తీర ప్రాంత జిల్లాల్లో దాదాపు 3.5 కోట్ల మంది నివసిస్తున్నారు. దీంతో సముద్రం నుంచి చిన్నపాటి ఉప్పెన వచ్చినా అది లక్షలాది మందిపై ప్రభావం చూపుతుంది.
  • 1985లో శ్రీహరికోట సమీపంలో తీరం దాటిన తీవ్ర తుపాను వల్ల 16 మంది మరణించగా, రూ.40.5 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. 2003లో మచిలీపట్నం వద్ద తీరం దాటిన తుపాను కారణంగా రూ.766 కోట్ల నష్టం మిగల్చగా, 44మంది చనిపోయారు. 2014లో హుద్‌హుద్‌ తుపాను వల్ల రూ.21,000 కోట్ల నష్టం వాటిల్లింది. 2018లో తూర్పుగోదావరి జిల్లాలో తీరం దాటిన తుపాను 8 లక్షల మందిపై ప్రభావం చూపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని