Revanth Reddy: ఆరు గ్యారంటీలతో ఆరంభం

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Updated : 07 Dec 2023 07:56 IST

ఆ దస్త్రంపైనే రేవంత్‌ తొలి సంతకం
నేటి మధ్యాహ్నం 1.04కు సీఎంగా ప్రమాణ స్వీకారం
సోనియా, ఖర్గే, రాహుల్‌, ప్రియాంకలను కలిసిన రేవంత్‌రెడ్డి
ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానం
మంత్రివర్గ కూర్పుపై అగ్రనేతలతో చర్చ
‘ఇండియా’ నేతలకూ రమ్మని పిలుపు
ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు
లక్ష మందికి పైగా హాజరవుతారని అంచనా
కేసీఆర్‌, జగన్‌, స్టాలిన్‌, చంద్రబాబులకూ ఆహ్వానం

ఈనాడు - హైదరాబాద్‌, దిల్లీ : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌, మంత్రులతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తొలుత ఉదయం 10.28 గంటలకు నిర్వహించాలని భావించినా.. తర్వాత ముహూర్త సమయాన్ని మార్చారు. పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన ‘ఆరు గ్యారంటీల’ చట్టానికి సంబంధించిన ముసాయిదాపై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొద్ది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహకంగా.. సీఎల్పీ సమావేశంలో రేవంత్‌రెడ్డిని తమ నాయకుడిగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కాంగ్రెస్‌ నాయకులు అందజేయగా.. గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రొటోకాల్‌ ప్రకారం.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే సహా పలువురు ప్రముఖులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్‌ పార్టీ పరంగా కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయపక్షాల నాయకులకు ఆహ్వానాలు పంపారు. వీరిలో మాజీ సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబు, ఏపీ, తమిళనాడు సీఎంలు జగన్‌, స్టాలిన్‌ తదితరులున్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సహా కొందరు వామపక్ష నాయకులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నట్లు సమాచారం.

దిల్లీలో రేవంత్‌ బిజీబిజీ

మరోవైపు రేవంత్‌ రెడ్డి బుధవారం రోజంతా దిల్లీలో తీరిక లేకుండా గడిపారు. కాంగ్రెస్‌ అగ్రనేతలైన సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌, ప్రియాంకాగాంధీలతో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్‌ తదితరులను రేవంత్‌ కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. గురువారం జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి వారిని ఆహ్వానించారు. ‘ఇండియా’ కూటమిలోని వారితోపాటు పలు పార్టీల నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా రేవంత్‌ ఆహ్వానించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు సభలో గడిపారు. అనంతరం వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులను కలుసుకున్నారు. వారంతా ఆయనకు అభినందనలు తెలిపారు.

మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి... తొలిరోజు ఎంతమందితో ప్రమాణ స్వీకారం చేయించాలనే అంశంపై ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి చర్చించారు. మంత్రులుగా మొత్తం ఎంతమందిని తీసుకోవాలనే అంశం ఇంకా నిర్ణయించలేదని కేసీ వేణుగోపాల్‌ విలేకరులకు తెలిపారు.

మంగళవారం రాత్రి దిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరికలేని సమావేశాలతో గడిపారు. తొలుత ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌, తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను వారి నివాసాల్లో కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం 10 జన్‌పథ్‌కు చేరుకొని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ ఆశీస్సులు తీసుకున్నారు. తనకు పార్టీలో సముచిత అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అక్కడే ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీలతో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షునిగా అవకాశమివ్వడం, ఎన్నికల ప్రచారంలో విస్తృత ప్రచారం చేసి పార్టీని విజయపథంలో నడిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్గ కూర్పుతో పాటు గ్యారంటీల అమలు గురించి రాహుల్‌ గాంధీ రేవంత్‌రెడ్డికి పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

వివిధ పార్టీల నేతలతో భేటీ

అనంతరం రేవంత్‌రెడ్డి నేరుగా హరియాణాకు చెందిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు దీపేంద్ర సింగ్‌ హుడా నివాసానికి వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. భేటీ అనంతరం వారిద్దరూ పార్లమెంటుకు వెళ్లారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రాజ్యసభ హౌస్‌ కమిటీ ఛైర్మన్‌ సీఎం రమేష్‌ ఛాంబర్‌కు వెళ్లి ఆయనతో పాటు, తనను అభినందించడానికి వచ్చిన తమిళనాడు కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిమణి సెన్నిమలై, కేరళ ఎంపీ హిబి ఈడెన్‌, తెదేపా ఎంపీలు రామ్మోహన్‌ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌, వైకాపా ఎంపీలు రఘురామకృష్ణరాజు, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్‌లతో కాసేపు ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. తర్వాత లోక్‌సభకు వెళ్లి సభాపతి ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి పదవికి ఎంపికైనందుకు ఆయనకు ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌ కొద్దిసేపు లోక్‌సభలో కూర్చుని బయటకు వచ్చారు. ఆ సందర్భంగా ఆయనను కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ మనీశ్‌ తివారీ, రమ్యా హరిదాసు, కొడిక్కొన్నల్‌ సురేష్‌, భారాస ఎంపీ పి.రాములు, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం రేవంత్‌ తన నివాసానికి వెళ్లారు. సాయంత్రం 3.45 గంటల సమయంలో హైదరాబాద్‌ వెళ్లేందుకు బయలుదేరారు. కానీ విమానాశ్రయం చేరుకునేలోగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే నుంచి పిలుపు రావడంతో రేవంత్‌ మళ్లీ వెనక్కు వచ్చారు. మహారాష్ట్ర సదన్‌లో ఉన్న ఠాక్రేను కలిశారు. సుమారు గంటపాటు వారిద్దరి మధ్య భేటీ కొనసాగింది. మంత్రివర్గ కూర్పు, ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానాలు తదితర అంశాలపై చర్చించారు. తర్వాత ఇద్దరూ హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఉదయం నుంచి రేవంత్‌ రెడ్డి వెంట కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, రాష్ట్ర మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ ఉన్నారు.

ప్రముఖులకు పేరుపేరునా ఆహ్వానం

తెలంగాణ ఏర్పాటు సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న సుశీల్‌కుమార్‌ శిందే, ఆనాడు సభాపతిగా ఉన్న మీరా కుమార్‌తో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, సుఖ్వీందర్‌ సింగ్‌, మాజీ ముఖ్యమంత్రులు అశోక్‌ గహ్లోత్‌, కమల్‌నాథ్‌, భూపేశ్‌ బఘేల్‌, ‘ఇండియా’లోని ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నీతీశ్‌ కుమార్‌, హేమంత్‌ సోరెన్‌, స్టాలిన్‌, పినరయి విజయన్‌ తదితరులను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు తెలిసింది.

డీకేను కలిసిన శ్రీధర్‌బాబు

మంత్రి పదవులు ఆశిస్తున్న శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డిలు బుధవారం దిల్లీలో డీకే శివకుమార్‌ను కలిశారు. తమకు మంత్రులుగా అవకాశమివ్వాలని కోరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ కలిసి మంత్రివర్గంలో చోటివ్వాలని విజ్ఞప్తి చేశారు.


రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సర్కార్‌: రాహుల్‌

రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ తెలంగాణలో ప్రజా సర్కార్‌ ఏర్పాటు చేస్తుందని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్‌కు ఆయన బుధవారం ‘ఎక్స్‌’లో అభినందనలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు