నాడు ఆదర్శం... నేడు నిర్వీర్యం

రాళ్లూరప్పలూ.. కొండలూగుట్టలూ.. నడిచేందుకూ వీలులేని దారుల్లో... డోలీ మోతల్లో గిరిశిఖర గ్రామాల మహిళలు పడే ప్రసవ వేదన మాటల్లో చెప్పలేనిది. చిమ్మచీకటి, జోరు వర్షం నడుమ సకాలంలో వైద్యం అందక, పురిటినొప్పులు భరించలేక ఊపిరి వదిలిన తల్లులెందరో. అమ్మఒడిని చేరకుండానే రాలిపోయిన పసిబిడ్డలు ఇంకెందరో.

Updated : 07 Dec 2023 06:42 IST

గిరిజన గర్భిణుల వసతి గృహాలపై జగన్‌ సర్కారు నిర్లక్ష్యం
సిబ్బందికీ జీతాల్లేవు
ఈనాడు - అమరావతి

అది పేదలకు మంచి చేసేదైనా.. ఆడబిడ్డల మేలు కోరేదైనా..
అట్టడుగు వర్గాలను బాగు చేసేదైనా.. ఆఖరికి అభాగ్య గిరిజనులకు ఊపిరిపోసేదైనా సరే!
తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిందైతే చాలు.. దాని అంతు చూడాల్సిందే!
నిర్లక్ష్యం ప్రదర్శించి క్రమంగా నిర్వీర్యం చేయాల్సిందే!
ఇదీ, పేదల పక్షపాతినని బాకా మోగించే జగన్‌ పెత్తందారు పోకడ!
ఈ ధోరణితోనే ఆదివాసీ గర్భిణుల ప్రత్యేక వసతి గృహాలను బలిపీఠం ఎక్కించారు.

రాళ్లూరప్పలూ.. కొండలూగుట్టలూ.. నడిచేందుకూ వీలులేని దారుల్లో... డోలీ మోతల్లో గిరిశిఖర గ్రామాల మహిళలు పడే ప్రసవ వేదన మాటల్లో చెప్పలేనిది. చిమ్మచీకటి, జోరు వర్షం నడుమ సకాలంలో వైద్యం అందక, పురిటినొప్పులు భరించలేక ఊపిరి వదిలిన తల్లులెందరో. అమ్మఒడిని చేరకుండానే రాలిపోయిన పసిబిడ్డలు ఇంకెందరో. ఇలాంటి దుస్థితిని తలచుకుంటేనే మనసు చివుక్కుమంటుంది. ఏ ప్రభుత్వమైనా ఇలాంటి పరిస్థితి నుంచి ఆదిమ తెగల వారిని బయటపడేసేందుకు ప్రయత్నించాల్సిందే. కానీ ముఖ్యమంత్రి జగన్‌కు.. ఆదివాసీ గర్భిణులు పడుతున్న ప్రసవ వేదన ఏమాత్రం కనిపించనట్టుంది. వారిని అడ్డుపెట్టుకుని ఎంతసేపూ ఎన్నికల్లో ఓట్లు ఎలా సంపాదించాలనే ధ్యాసే తప్ప వారి పట్ల కనీస మానవత్వమే లేకుండా వ్యవహరిస్తున్నారు. గిరిజనులకు కొండంత భరోసాగా నిలిచిన గిరిశిఖర గ్రామాల గర్భిణుల వసతి గృహాలపై ఆయన కక్షకట్టారు. ఎంతగా అంటే.. మరమ్మతులకు గురై అంబులెన్స్‌లు మూలకు చేరితే వాడుకలోనికి తీసుకురాలేనంత? మరుగుదొడ్లు కూడా బాగు చేయించలేనంత? దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ ప్రాజెక్టుని నిర్వీర్యం చేయడంలో ఉన్న ఏకైక కారణం ఇవి తెదేపా ప్రభుత్వంలో ఏర్పాటు కావడమే!

నాడలా.. నేడిలా...

గిరిశిఖర గ్రామాల్లో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు ఆలోచన చేసిన తెదేపా ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సాలూరులో గర్భిణులకు ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది. ఏడు నెలలు నిండిన వెంటనే గిరిశిఖర గ్రామాల నుంచి గర్భిణులను ఇక్కడికి తీసుకొచ్చి వారిని పర్యవేక్షించేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు.  సాయంగా ఓ వ్యక్తి కూడా ఉండేందుకు అనుమతి ఉండేది. 24 గంటలూ ఇద్దరు ఏఎన్‌ఎమ్‌లు ఉండేవారు. ప్రత్యేక వైద్యుణ్నీ నియమించింది. అంబులెన్స్‌ అందుబాటులో ఉండేది. గర్భిణులకు పోషకాహారం అందిస్తూ రక్తహీనత సమస్య ఉంటే ప్రత్యేక జాగ్త్రతలు తీసుకునేవారు. సూపర్‌వైజర్‌, ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు క్రమం తప్పకుండా గిరిశిఖర గ్రామాలకు వెళ్లి ఏడు నెలలు నిండిన గర్భిణులను గుర్తించి సుఖ ప్రసవాలపై అవగాహన కల్పించి వసతి గృహాలకు తీసుకొచ్చేవారు. ప్రసవం వరకు వారిని అక్కడే ఉంచి అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. ముగ్గురితో మొదలైన ఈ వసతి గృహం.. స్వల్ప వ్యవధిలోనే వంద శాతం ఆక్యుపెన్సీ సాధించింది. ఇక్కడ సత్ఫలితాలు రావడంతో గుమ్మలక్ష్మీపురంలోనూ మరో వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా 100 మందికి రెండు వసతి గృహాలను అందుబాటులో ఉంచారు. దాంతో ఆ ప్రాంతంలో మాతాశిశు మరణాలు తగ్గాయి. నీతిఅయోగ్‌ బృందం పర్యటించి ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శమంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ వీటిని సందర్శించి.. మిగతా జిల్లాల్లోనూ ఏర్పాటుచేయాలని సూచించారు.

సర్వే నిలిపేశారు...

ఆదివాసీ బిడ్డలకు మేలు చేసేదైతే తనకేమీ... తెదేపా ప్రభుత్వంలో ఏర్పాటయిందా? ఇక అంతే. దాన్ని క్రమక్రమంగా నిర్వీర్యం ఎలా చేయాలని మాత్రమే చూస్తారు. ఈ నాలుగేళ్లలో అదే చేశారు. సాధారణంగా గిరిశిఖర గ్రామాల్లో ఉండే మహిళలకు గర్భం దాల్చాక ఎన్నో నెలలో ఉన్నారన్న విషయంలో కచ్చితమైన అవగాహన ఉండదు. ఈ కారణంగా క్రమం తప్పకుండా చేయాల్సిన పరీక్షల్లోనూ జాప్యం ఉంటుంది. ప్రసవ సమయం దగ్గరైతే ప్రమాదంలో పడే మహిళలు ఎందరో. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకే ఏడు నెలలు గర్భిణులను చేర్చడానికి క్రమం తప్పకుండా సర్వేలు చేయించింది. జగన్‌ అధికారంలోకి రాగానే ఈ సర్వే ఆగిపోయింది. దీంతో వారిని వసతి గృహాలకు తీసుకువచ్చే ఏర్పాట్లు నిలిచిపోయాయి. రోజూ వారిని పరీక్షించేందుకు వసతి గృహాల్లో ప్రత్యేక వైద్యుడు లేరు.

కొత్తవి ఏర్పాటు చేసుంటే...

ఈ రెండు వసతి గృహాల ఏర్పాటు తర్వాత మాతాశిశు మరణాలు చాలావరకు తగ్గాయి. ఇప్పటివరకు 3210 మంది సేవలు వినియోగించుకున్నారు. జగన్‌కు నిజంగా అమాయక గిరిజనులకు మేలు చేసే ఆలోచనే ఉంటే... వీటిని విస్తరించేవారు. పాడేరు, రంపచోడవరం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని గిరిశిఖర గ్రామాలకు అనుబంధంగా వసతి గృహాలు ఏర్పాటు చేస్తే.. డోలీ మోతల నడమ గర్భిణులూ, శిశువుల మరణాలూ తగ్గించొచ్చు. కానీ జగన్‌ నాలుగున్నరేళ్ల కాలంలో ఆ దిశగా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు.


పోషకాహారం... అందడం లేదు!

గిరిజన గర్భిణులకు తెదేపా ప్రభుత్వం ఫుడ్‌ బాస్కెట్‌ పథకం ద్వారా వసతి గృహాల్లోనే పోషకాహారం కింద ఖర్జూరం, చిక్కీలు, నువ్వుల ఉండలు, మందులు అందించేది. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాన్ని అమలు చేస్తున్నా... అది వసతి గృహాల్లో ఉండే గర్భిణులకు సక్రమంగా అందడం లేదు.


మరుగుదొడ్లను బాగు చేయించలేరా?

రెండు చోట్లా మరుగుదొడ్లు వినియోగంలో లేవు. సాలూరులో నీటి సరఫరా పైపు మరమ్మతులకు గురైతే దాన్ని బాగు చేయించకుండా  మేడపైన ఉన్న మరుగుదొడ్లను వినియోగించుకోవాలని గర్భిణులకు సూచిస్తున్నారు. మెట్లు ఎక్కి వెళ్లడానికి ఆందోళన చెందుతున్నారు. గుమ్మలక్ష్మీపురంలో సహాయకుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. ఈ రెండు చోట్లా బాగుచేయించేందుకు రూ.3 లక్షలకు మించి అవ్వదు. రెండు చోట్లా సోలార్‌ విద్యుత్తు పలకలు అప్పట్లో ఏర్పాటు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నిర్వహణ పడకేసింది. ఇక అంతే రెండు చోట్లా మూలకు చేరాయి. జనరేటర్‌ సదుపాయమూ లేదు. రాత్రిళ్లు కరెంటు పోతే చీకట్లో ఉండాల్సిందే.


జీతాలు ఆపేశారు...

ఇక్కడ సేవలు అందిచేందుకు ఏఎన్‌ఎమ్‌లను తెదేపా ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. వీరి సేవలు అవసరం లేదంటూ వైకాపా ప్రభుత్వం గతేడాది తొలగించేందుకు ప్రయత్నించింది. దీంతో 50 శాతం వేతనంతో పనిచేసే అంగీకారంతో కొనసాగించారు. ఏడాదిగా ఆ వేతనాల్నీ పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడ సిబ్బందికి రెండేళ్లుగా జీతాల్లేవ్‌. ఇది పొమ్మనకుండా పొగబెట్టడంకాక మరేంటి! గర్భిణుల వసతి గృహాల పట్ల జగన్‌ ఎంత కక్షసాధింపుగా వ్యవహరిస్తున్నారో.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?


మూలకు చేరిన అంబులెన్స్‌లు

ప్రారంభంలో ప్రతి వసతి గృహానికి ఒక అంబులెన్స్‌ను కేటాయించారు. దీని ద్వారా వైద్య పరీక్షలు అవసరమైన గర్భిణులను రోజూ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి మళ్లీ వసతి గృహానికి తీసుకొచ్చేవారు. అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది ఉపయుక్తంగా ఉండేది. సాలూరు వసతి గృహానికి కేటాయించిన అంబులెన్స్‌ ఇటీవల మరమ్మతులకు గురైంది. దాన్ని బాగు చేయకుండా సమీపంలోని తోణాం పీహెచ్‌సీకి చెందిన వాహనాన్ని కేటాయించారు. అదీ కూడా పాడైంది.  ప్రస్తుతం 108 వాహనాలూ, ఆటోల్లో గర్భిణులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. అంబులెన్సుల మరమ్మతులకు అయ్యే ఖర్చు రూ.2 లక్షలలోపే. బాగు చేయాలని ప్రభుత్వానికి నివేదించినా పట్టింపులేదు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని