ఓటర్ల మెడపై నోటీసుల కత్తి

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్ల మెడపై కత్తి పెడుతోంది. ‘‘మీ ఫొటోతో పలానా పలానా చోట్ల ఓట్లున్నాయి. వాటిల్లో దేన్ని తొలగించాలి? దేన్ని కొనసాగించాలి? నిర్దేశిత తేదీలోగా తెలపండి’’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందికి నోటీసులిస్తోంది.

Updated : 07 Dec 2023 06:48 IST

ఫొటోలు, వివరాలు వేర్వేరు అయినా
పలుచోట్ల ఓట్లు ఉన్నాయంటూ నోటీసులు
సమాధానం ఇవ్వకుంటే తొలగించే ముప్పు
ఈనాడు - అమరావతి

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్ల మెడపై కత్తి పెడుతోంది. ‘‘మీ ఫొటోతో పలానా పలానా చోట్ల ఓట్లున్నాయి. వాటిల్లో దేన్ని తొలగించాలి? దేన్ని కొనసాగించాలి? నిర్దేశిత తేదీలోగా తెలపండి’’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందికి నోటీసులిస్తోంది. నిజంగా ఒకే వ్యక్తికి ఒకటికి మించి ఓట్లుంటే నోటీసులివ్వడంలో తప్పులేదు. కానీ వాటిల్లో పేర్లు, ఫొటోలు, వివరాలు పూర్తిగా వేరు అయినప్పటికీ నోటీసులిస్తున్నారు. అసలు ఏ మాత్రం పోలికలు లేకపోయినా ఫొటో ఒకేలా ఉందంటూ నోటీసులివ్వడం ఏంటి, వాటితో తమకు ఎలాంటి సంబంధమూ లేకపోయినా ఇన్ని కష్టాలు పడాలా అంటూ నోటీసులు అందుకున్న పలువురు ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో సమాధానమివ్వకపోతే ఎక్కడా తమ ఓటు లేకుండా తొలగించే ముప్పు ఉందని కలవరపడుతున్నారు. ప్రధానంగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, గుంటూరు, బాపట్ల సహా పలు జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది. ఈ పరిణామాల వెనుక తటస్థులు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ఓట్లు తొలగించే కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధం లేకున్నా...

  • బాపట్ల జిల్లా వేమూరు మండలం వరాహపురానికి చెందిన ఎల్లమాటి ప్రేమకుమారికి 109వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రం.. క్రమసంఖ్య 373లో ఓటు ఉంది. ఆమెకు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శంఖవరంలో మేలం ఆదిలక్ష్మి పేరుతో, వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం వడ్డిరాలలో నందుల సుబ్బమ్మ పేరుతో ఓట్లు ఉన్నాయంటూ నోటీసులిచ్చారు. ఈ మూడు చోట్లా ఫొటోలు ఒకేలా ఉన్నాయంటూ నోటీసులిచ్చారు. కానీ ఆ రెండు చోట్ల ఉన్న ఫొటోలు, వివరాలతో ప్రేమకుమారికి ఎలాంటి పోలిక లేదు.
  • గుంటూరు కొరిటెపాడులోని ఓ వ్యక్తికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓటర్ల జాబితాలో ఉన్న మరో వ్యక్తి ఫొటోతో పోలిక ఉందంటూ నోటీసిచ్చారు. ఆ రెండు ఫొటోలకు సంబంధమే లేదు.

బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామానికి చెందిన చెరుకూరి రాజ్యలక్ష్మికి యడ్లపల్లిలోని 4వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రం.. క్రమ సంఖ్య 601లో ఓటు ఉంది. చిత్తూరు జిల్లా దుర్గానగర్‌ గ్రేస్‌మెంట్‌పేటలోని 134వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రం... క్రమ  సంఖ్య 387లో పి.భానుమతి పేరుతో మరో ఓటు ఉందంటూ ఆమెకు ఇటీవల నోటీసులిచ్చారు. వాస్తవంగా ఆ ఫొటో, వివరాలతో రాజ్యలక్ష్మికి సంబంధమే లేదు. అదే విషయమై ఆమె ఈఆర్‌ఓ వద్దకు వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ప్రతిపక్షాల అభ్యంతరాలు బేఖాతరు

ఓటర్ల జాబితాలోని ప్రతిపక్షాల మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అధికార వైకాపా నాయకులు ఫిర్యాదులివ్వటమే తరువాయి.. వాటిల్లో ఎంత వాస్తవికత ఉందో నిర్ధారించుకోకుండానే ఆ జాబితాల్లోని వారందరికీ కొందరు ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, జిల్లా ఎన్నికల అధికారులు నోటీసులిస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ ఆధ్వర్యంలో చేర్చిన నకిలీ ఓట్లపై తెదేపా ఎన్నిసార్లు ఫిర్యాదులిస్తున్నా వాటిపై మాత్రం ఎలాంటి నోటీసులూ ఇవ్వడం లేదు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైకాపా ఇన్‌ఛార్జి విశ్వేశ్వర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏకంగా 10 వేల మందికి అధికారులు నోటీసులిచ్చారు. అదే జిల్లా రాప్తాడులో 20 వేల బోగస్‌ ఓట్లు ఉన్నాయని తెదేపా నాయకులు ఫిర్యాదిస్తే మాత్రం పట్టించుకోలేదు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైకాపా నాయకుల ఫిర్యాదుల ఆధారంగా ఏకంగా 6 వేల మందికి నోటీసులివ్వడం గమనార్హం.

సరిగ్గా పరిశీలించకుండానే..

రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల్లో ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువగా ఉన్న ఓట్లను ఈసీఐ.. ఫొటోగ్రాఫిక్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌ (పీఎస్‌ఈ), డెమోగ్రాఫిక్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌ (డీఎస్‌ఈ) వ్యవస్థల ద్వారా గుర్తించింది. అయితే ఈ జాబితాలో అనేక లోపాలున్నాయి. అయినా క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించకుండానే ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఈఆర్‌ఓలు) ఈ జాబితాలో ఉన్నవారందరికీ నోటీసులిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని