బలహీనపడిన తుపాను

మిగ్‌జాం తీవ్ర తుపాను తీరం దాటాక.. కోస్తాను కుదిపేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు భారీ, అతి భారీ వర్షాలతో ముంచెత్తింది.

Updated : 07 Dec 2023 06:54 IST

అల్పపీడనంగా కొనసాగుతున్న మిగ్‌జాం
ఉత్తర కోస్తాలో కుండపోతగా వానలు
అత్యధికంగా ఏలూరు జిల్లా తాడువాయిలో 297 మి.మీ. వర్షం
పొంగిన గెడ్డలు.. నిలిచిన రాకపోకలు
ఏలూరు జిల్లాలో ముగ్గురు, అల్లూరి  జిల్లాలో ఒకరు మృత్యువాత
నేడూ, రేపూ వర్షాలు

ఈనాడు- అమరావతి, ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం: మిగ్‌జాం తీవ్ర తుపాను తీరం దాటాక.. కోస్తాను కుదిపేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు భారీ, అతి భారీ వర్షాలతో ముంచెత్తింది. క్రమంగా తుపాను, వాయుగుండగా బలహీనపడి.. అల్పపీడనంగా మారింది. ఈశాన్య తెలంగాణ, దాన్ని అనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశా, కోస్తాలోనే కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల మధ్య ఏలూరు జిల్లా తాడువాయిలో 297 మి.మీ., అనకాపల్లి జిల్లా దార్లపూడిలో 295.5, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 254.5, కాకినాడ జిల్లా పిఠాపురంలో 253.5, అల్లూరి జిల్లా అనంతగిరిలో 231.5, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలులో 218.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం నుంచి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్నాయి. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

పొంగిన వాగులు.. కోతకు గురైన రహదారులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో కోస్తా జలమయమైంది. బాపట్ల జిల్లా పర్చూరు, కారంచేడు ప్రాంతాల్లో వాగులు పొంగాయి. పెదనందిపాడు వద్ద నల్లమడ వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పల్నాడు జిల్లాలో వరద పెరగడంతో పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. ఉత్తరాంధ్రలో వరద ధాటికి చాలాచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. తెలంగాణ నుంచి వచ్చిన వరదతో ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వాగులు పరవళ్లు తొక్కాయి. గంపలగూడెం- విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచాయి. ఎడతెరిపి లేని వర్షంతో రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కాలనీల్లోకి నీరు చేరింది. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో గోస్తనీ నది ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. మైనర్‌ శారదా నది ఉద్ధృతికి అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎలమంచిలి- గాజువాక బైపాస్‌ రహదారిలో నారాయణపురం వద్ద ప్రవాహం పెరిగింది. సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం దగ్గర పెద్దగడ్డ వంతెన కొట్టుకుపోయింది. అనంతగిరి మండలంలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రంపచోడవరం మండలం భూపతిపాలెం రిజర్వాయర్‌ ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కోటవురట్లలో వరదనీరు ప్రధాన రహదారిపైౖకి చేరి వాగును తలపించింది. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలకు నదులు, గెడ్డలు, వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. వందల ఇళ్లు జలదిగ్బంధమయ్యాయి. పాలకొల్లు, భీమవరం, ఏలూరు, నూజివీడు తదితర పట్టణాల్లోని ఇళ్లల్లోకి కూడా నీరు చేరింది. వాగుల ఉద్ధృతితో ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్‌ గోడ కూలిపోయింది.

వాగు దాటుతూ ముగ్గురు గల్లంతు

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం సీతపాడులో ఉప్పొంగి ప్రవహిస్తున్న లవ్వగెడ్డను దాటేందుకు ప్రయత్నించి ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు.  ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో సొసైటీ ఎదుటి రోడ్డులోని గోతిలో పడి గుర్తు తెలియని వ్యక్తి, నూజివీడు మండలం పాత అన్నవరంలో మురుగు కాల్వలో పడి వృద్ధుడు, జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం ఊరచెరువులో పడి ఒక యువకుడు మృతి చెందారు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం దగ్గర జల్లేరు వాగులో మరో యువకుడు గల్లంతయ్యాడు.


లక్షలు పెట్టుబడి పెట్టా.. సర్వం కోల్పోయా
- ఇమడాబత్తిని వీరాస్వామి, వంగిపురం, ప్రత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా

ఏడెకరాల్లో మినుము సాగు చేశా. పొలం మొత్తం వాగు నీరు ప్రవహించి, పంటంతా నాశనమైపోయింది. మినుముకే రూ.2లక్షల వరకు పెట్టుబడి పెట్టా. రెండెకరాల్లో శనగకు రూ.30 వేలు పెట్టాను. మొత్తం పోయినట్లే.


పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది

మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాం. కోత కోయించి ఓదెలు వేశాం. నాలుగు రోజుల కింద ఓదెలు కూడా తిప్పాం. ఆరిన తర్వాత కుప్పలు వేయాల్సిన సమయంలో తుపాను వచ్చి పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.

ఈమినేని రాఘవమ్మ, మహిళా రైతు, కొల్లూరు, బాపట్ల జిల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని