దారి దాటేలోగా... దారుణమే జరిగింది!

ప్రసవవేదన పడుతున్న నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించే దారి సక్రమంగా లేక... సకాలంలో వైద్యం అందక ఓ పసిబిడ్డ పుట్టీపుట్టగానే కన్నుమూసింది.

Published : 07 Dec 2023 07:24 IST

ఏటూరునాగారం న్యూస్‌టుడే: ప్రసవవేదన పడుతున్న నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించే దారి సక్రమంగా లేక... సకాలంలో వైద్యం అందక ఓ పసిబిడ్డ పుట్టీపుట్టగానే కన్నుమూసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రాంనగర్‌ గ్రామానికి చెందిన గర్భిణి బొల్లె రమ్య బుధవారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు 108 వాహనానికి ఫోన్‌ చేశారు. వాహనం సిబ్బంది ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం మీదుగా రాంనగర్‌కు వెళ్లారు. మార్గంమధ్యలో జీడివాగు వంతెనకు ఇరువైపులా రిటెన్షన్‌ గోడ నిర్మాణ పనుల కోసం మట్టికుప్పలను పోశారు. 108 సిబ్బంది చాలా కష్టంగా వాటిని దాటుతూ రాంనగర్‌కు చేరుకున్నారు. వచ్చిన మార్గం సరిగా లేదని గర్భిణిని తీసుకుని కమలాపురం వైపు వెళ్లారు. ఆ రోడ్డంతా నిర్మాణంలో ఉంది. పాత రోడ్డును తొలగించి కంకర వేసి దానిపై మట్టిపోశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆ రోడ్డు బురదమయం కావడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయినా ఏదో విధంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. కొద్దిదూరం వెళ్లాక వాహనం నడపడం కష్టమని అంబులెన్స్‌ డ్రైవర్‌ చెప్పడంతో.. అక్కడే వ్యవసాయ పనుల్లో ఉన్న ఓ ట్రాక్టర్‌ను తీసుకువచ్చి దాని సాయంతో బురద రోడ్డు దాటించి.  ఏటూరునాగారంలోని సామాజిక ఆసుపత్రికి చేర్చారు. అక్కడ రమ్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ బిడ్డ ఉమ్మనీరు తాగడం... ప్రయాణంలో జరిగిన ఆలస్యంతో వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పుట్టిన కొద్ది సేపటికే శిశువు మృతిచెందింది. రూ.6.30 కోట్ల అంచనా వ్యయంతో ఈ మార్గంలో జరుగుతున్న విస్తరణ పనుల్లో గుత్తేదారు అలసత్వంతోనే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్లుగా సాగతున్న రహదారి పనులు నిండు ప్రాణాన్ని కబళించాయని వారంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని