మాకొద్దు.. మీ జీపీఎస్‌!

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఎంతో కసరత్తు చేసి ప్రభుత్వ గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌) తీసుకొచ్చామని, దీనివల్ల పాత పింఛను విధానం మాదిరిగానే మేలు కలుగుతుందంటూ జగన్‌ సర్కారు చెబుతున్న మాటలను ఆర్టీసీ ఉద్యోగులు విశ్వసించడం లేదు.

Updated : 07 Dec 2023 10:52 IST

ప్రభుత్వ గ్యారంటీ పింఛనుపై ఆర్టీసీ ఉద్యోగుల విముఖత
ఇప్పటికే ఉన్న ఈపీఎఫ్‌లో కొనసాగేందుకు సుముఖం
జీపీఎస్‌తో ప్రయోజనం  లేదనే భావనలో ఉద్యోగులు

ఈనాడు, అమరావతి: దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఎంతో కసరత్తు చేసి ప్రభుత్వ గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌) తీసుకొచ్చామని, దీనివల్ల పాత పింఛను విధానం మాదిరిగానే మేలు కలుగుతుందంటూ జగన్‌ సర్కారు చెబుతున్న మాటలను ఆర్టీసీ ఉద్యోగులు విశ్వసించడం లేదు. మీ జీపీఎస్‌ మాకొద్దంటూ మెజారిటీ ఉద్యోగులు తిరస్కరిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా ఆర్టీసీలో కొనసాగుతున్న ఉద్యోగి భవిష్య నిధి (ఈపీఎఫ్‌) పింఛనులో కొనసాగుతామని తెగేసి చెబుతున్నారు. ఏ పింఛను కావాలో ఆప్షన్‌ ఇవ్వాలంటూ ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులను కోరితే.. 83.94 శాతం మంది ఈపీఎఫ్‌లో కొనసాగేందుకు మొగ్గు చూపడమే దీనికి నిదర్శనం.

ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పీటీడీ) ఉద్యోగులుగా 2020 జనవరి 1న విలీనమయ్యారు. అయితే అప్పటి నుంచి వీరికి ఏ పింఛను ఇస్తారనేది స్పష్టత ఇవ్వలేదు. వీరి నుంచి ఆప్షన్‌ తీసుకోవాలంటూ గత ఏడాది పీఆర్సీ కమిషన్‌ సూచించింది. మరోవైపు 2004 సెప్టెంబరు తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారికి కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) అమల్లో ఉండగా, దీని స్థానంలో జీపీఎస్‌ అమలు చేసేలా ఇటీవల ప్రభుత్వం చట్టం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీపీఎస్‌ అమలు కావాలంటే తొలుత వారు సీపీఎస్‌లో చేరాలి. ఈ నేపథ్యంలో సీపీఎస్‌లో చేరతారా లేకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న ఈపీఎఫ్‌లో కొనసాగుతారా అనే ఆప్షన్‌ తెలపాలంటూ ఆర్టీసీ ఉద్యోగులందరికీ యాజమాన్యం దరఖాస్తులు ఇచ్చింది. ఇందులో అత్యధికులు ఈపీఎఫ్‌నే ఎంపిక చేసుకున్నారు.

సీపీఎస్‌ కావాలన్నది 16 శాతమే

ఆర్టీసీలో ప్రస్తుతం 49,273 మంది రెగ్యులర్‌ ఉద్యోగులున్నారు. వీరిలో ప్రభుత్వంలో విలీనమైన తర్వాత కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు దక్కిన పోస్టింగ్‌లు పొందిన 286 మందికి సీపీఎస్‌ అమలవుతోంది.

  • మిగిలిన 48,987 మందిలో ఇప్పటి వరకు 34,954 మంది ఆప్షన్‌ ఇచ్చారు. వీరిలో 29,337 మంది (86.94%) ఈపీఎఫ్‌లో కొనసాగేలా ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నారు.
  • కేవలం 5,617 మంది (16.06%) మాత్రమే సీపీఎస్‌లో చేరతామని ఆప్షన్‌ ఇచ్చారు.
  • సీపీఎస్‌ను ఎంపిక చేసుకున్నాక, జీపీఎస్‌ అమలు చేస్తే.. నిర్దిష్టంగా ఎంత పింఛను వస్తుందో స్పష్టత లేదని ఎక్కువ మంది ఉద్యోగులు పేర్కొంటున్నారు.
  • ఈపీఎఫ్‌లో ఇటీవల హయ్యర్‌ పింఛను విధానం అమలు చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎఫ్‌ ట్రస్ట్‌కు ఆప్షన్‌ ఇచ్చారు. వీరిలో చాలా మందికి హయ్యర్‌ పింఛను వర్తించేందుకు ఎంత  సొమ్ము వారి ఖాతాలో ఉండాలో పేర్కొంటూ నోటీసులు వస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఆర్టీసీ ఉద్యోగులు ఈపీఎఫ్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఈ నెల 12 నాటికి   ఉద్యోగులంతా సీపీఎస్‌, ఈపీఎఫ్‌ల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకునే ఆప్షన్‌ గడువు ముగియనుంది. మిగిలిన ఉద్యోగుల్లో కూడా ఎక్కువ మంది ఈపీఎఫ్‌ ఆప్షన్‌ ఇచ్చే వీలుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని