క్రమబద్ధీకరణ హామీకి నాలుగేళ్లు

‘మీ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తా. నిశ్చింతగా ఉండండి’ అని సీఎం జగన్‌ స్వయంగా హామీ ఇచ్చి నాలుగేళ్లు దాటినా ఇంత వరకు ప్రభుత్వాసుపత్రుల్లోని ట్రామాకేర్‌ సెంటర్లలో పనిచేసే ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ కార్యరూపం దాల్చలేదు.

Published : 07 Dec 2023 04:20 IST

చర్యలు మాత్రం శూన్యం
ట్రామాకేర్‌ సెంటర్ల సిబ్బంది ఆవేదన

ఈనాడు, అమరావతి, కర్నూలు: ‘మీ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తా. నిశ్చింతగా ఉండండి’ అని సీఎం జగన్‌ స్వయంగా హామీ ఇచ్చి నాలుగేళ్లు దాటినా ఇంత వరకు ప్రభుత్వాసుపత్రుల్లోని ట్రామాకేర్‌ సెంటర్లలో పనిచేసే ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ కార్యరూపం దాల్చలేదు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి జగన్‌ ఇచ్చిన హామీల జాబితాలో ట్రామాకేర్‌ సెంటర్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం ఉన్నా తదుపరి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. రాష్ట్రంలోని ఎంపిక చేసిన పది ఆసుపత్రుల్లోని ట్రామాకేర్‌ సెంటర్లలో వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, అంబులెన్సు డ్రైవర్లు కలిపి సుమారు 500 మంది వరకు ఉన్నారు. జిల్లా కమిటీ ద్వారా వీరి నియామకాలు జరగ్గా చాలా మంది 2011 నుంచి పనిచేస్తున్నారు. వీరి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని 2019 అక్టోబరులో ఏలూరులో తనను కలిసిన ట్రామా కేర్‌ ఉద్యోగులకు సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. పాదయాత్ర సమయంలోనూ ఇలాగే హామీ ఇచ్చారని ఉద్యోగులు అప్పుడు గుర్తుచేయగా ఈసారి పని అయిపోతుందని వారికి నచ్చజెప్పారు. ఇలా చెప్పి నాలుగు సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణ చర్యల్లో అతీగతీలేదు. జగనన్న హామీలు ఎలా ఉంటాయనేందుకు ఇదో నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వారికి ఒకలా.. వీరికి మరోలా..: వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద ‘రెగ్యులర్‌ కాంట్రాక్ట్‌’ పేరుతోనూ సుమారు 20 వేల మంది స్టాఫ్‌ నర్సులు ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో అత్యధికులను రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమబద్ధీకరించారు. 2011 తరువాత విధుల్లో చేరినవారి ఉద్యోగాలను ఇప్పటి వరకు క్రమబద్ధీకరించలేదు. ఇదే సమయంలో కొన్ని జిల్లాల డీఎంహెచ్‌ఒ కార్యాలయాల నుంచి కొందరు ఫోన్లు చేసి అఫిడవిట్‌పై సంతకాలు పెట్టలంటూ ఉద్యోగులను ఒత్తిడి చేస్తున్నారు. ఎన్‌హెచ్‌ఎం కింద విధులు నిర్వర్తిస్తున్న తమను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఒప్పంద ఉద్యోగులుగా వైద్య ఆరోగ్యశాఖ పరిగణిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ సర్వీసును క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేనట్లు వ్యవహరిస్తోందని చెబుతున్నారు. ఆర్‌సీహెచ్‌-1, 2ల కింద నియమితులైన వారిని ఒకలా, అదే విధానంలో విధుల్లో చేరిన తమను మరోలా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని