నిర్మాణాలపై మూడో పక్షానికి హక్కులు కల్పించొద్దు

భూ కేటాయింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో హయగ్రీవ ఫార్మ్స్‌, డెవలపర్స్‌కు కేటాయించిన 12.51 ఎకరాలను రద్దు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated : 07 Dec 2023 06:29 IST

హయగ్రీవ సంస్థకు హైకోర్టు ఆదేశం
12.51 ఎకరాల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరణ
నిర్ణయ బాధ్యతను జిల్లా కలెక్టర్‌పై ఉంచడంపై ఆక్షేపణ
విచారణ ఫిబ్రవరి 1కి వాయిదా

ఈనాడు, అమరావతి: భూ కేటాయింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో హయగ్రీవ ఫార్మ్స్‌, డెవలపర్స్‌కు కేటాయించిన 12.51 ఎకరాలను రద్దు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్‌పై ఉంచడం ఏంటని ఆక్షేపించింది. ఇంత పెద్ద వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించింది. దీనిపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు అక్కడి నిర్మాణాలపై మూడో పక్షానికి(థర్డ్‌ పార్టీకి) హక్కులు కల్పించొద్దని హయగ్రీవ సంస్థను ఆదేశించింది. నిర్మాణాలేమైనా చేపడితే అవి మీ సొంత రిస్క్‌పై ఆధారపడి ఉంటుందని ఆ సంస్థకు స్పష్టం చేస్తూ విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కలెక్టర్‌ సిఫారసు చేసినా చర్యలు లేవు: పిటిషనర్ల తరఫు న్యాయవాదులు

భూ కేటాయింపు నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తున్న కారణంగా హయగ్రీవ ఫార్మ్స్‌, డెవలపర్స్‌కు ఎండాడ గ్రామంలోని సర్వే నంబరు 92/3లో కేటాయించిన 12.51 ఎకరాలను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, విశాఖ తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన కార్పొరేటర్‌ పీఎల్‌వీఎన్‌ మూర్తియాదవ్‌ గతేడాది హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి, న్యాయవాది టి.వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. భూముల కేటాయింపు ఉద్దేశాన్ని తుంగలో తొక్కుతూ ప్రైవేటు వ్యక్తులకు భూమి బదలాయించారని, ఇది స్థిరాస్తి వ్యాపారం తప్ప మరొకటి కాదని, భూ కేటాయింపులను రద్దు చేయవచ్చని విశాఖ జిల్లా కలెక్టర్‌.. రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం నిర్మించాల్సి ఉందన్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారం పది శాతం స్థలంలో అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలన్నారు. మిగిలిన స్థలంలో ఇళ్ల నిర్మాణం చేసి వయోవృద్ధులకు మాత్రమే విక్రయించాల్సి ఉందన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో హయగ్రీవ ఫార్మ్స్‌, డెవలపర్స్‌కు ఇచ్చిన 12.51 ఎకరాల కేటాయింపును రద్దు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున.. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు.

వివరణ ఇచ్చాం: హయగ్రీవ తరఫు న్యాయవాది

హయగ్రీవ సంస్థ తరఫున న్యాయవాది ఎన్‌ అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. గతంలో ఈ వ్యవహారాన్ని హైకోర్టు సింగిల్‌ జడ్జి తేల్చారన్నారు. దానిని ధర్మాసనం ముందు అప్పీల్‌ చేయగా సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థించిందన్నారు. మళ్లీ అదే వ్యవహారంపై పిల్‌ దాఖలు చేశారన్నారు. ఆ భూమికి మార్కెట్‌ విలువ చెల్లించామన్నారు. జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకూ వివరణ ఇచ్చామన్నారు. ఇరువైపు వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక, హయగ్రీవ సంస్థ ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకొని భూమి రద్దు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని