మునిగేది రైతన్న.. ముంచేది ఎవరన్న?

మొన్న ఏం జరిగింది? నిన్న దాని ప్రభావం ఏమిటి? నేడు  ఎలా ముందుకెళ్లాలి... అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం.

Updated : 07 Dec 2023 06:13 IST

పంటకాలం ముందుకు జరపడంలో తీవ్ర నిర్లక్ష్యం
జూన్‌లోనే నాట్లు వేసేలా అవగాహన కల్పించడంలో విఫలం
కాల్వల్లో ముందుకు సాగని జలాలు.. ఆలస్యంగా నాట్లు
కోతల సమయంలో విరుచుకుపడుతున్న తుపాన్లు
ఏటా రూ.వేల కోట్లు నష్టపోతున్న రైతులు

మొన్న ఏం జరిగింది? నిన్న దాని ప్రభావం ఏమిటి? నేడు  ఎలా ముందుకెళ్లాలి... అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ముఖ్యంగా కోట్ల మంది ప్రజల సంక్షేమానికి బాధ్యత వహించే ప్రభుత్వాలకు ఇలాంటి ఆలోచన, ప్రణాళిక అత్యంత   అవసరం. రాష్ట్రాన్ని ఏలుతున్న జగన్‌ ప్రభుత్వానికి దురదృష్టవశాత్తు ఈ ముందుచూపు కరవైంది. ఆయన ఏలుబడిలో యువతకు ఉపాధి చూపే పారిశ్రామిక రంగమైనా, ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే వ్యవసాయ రంగమైనా... నిర్లక్ష్యానికి గురవడం సాధారణ విషయంగా మారిపోయింది.

ఎందుకంటే...

వానలను తట్టుకుని, వరదలను దాటుకుని అన్నదాతలు... ఒకటికి రెండుసార్లు నాట్లేసినా.. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి    విరుచుకుపడుతున్న తుపాన్లు వారికి ఏటా రూ.వందల కోట్ల నష్టాన్ని   మిగులుస్తుండటమే ఇందుకు తాజా ఉదాహరణ. సాధారణంగా నవంబరు, డిసెంబర్లలో తుపాన్లు వస్తుంటాయి. ఈలోగా వరి కోతలు పూర్తి చేయించగలిగితే... రైతుల్ని భారీ నష్టం నుంచి కాపాడవచ్చు. వైకాపా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచనే చేయడం లేదు. రైతుల్లో   అవగాహన కల్పించడం లేదు. సర్కారు వైఫల్యం కారణంగానే ప్రస్తుత ఏడాది కూడా 60% పైగా పంట నేల కొరిగింది. నూర్పిడి చేసి ఒడ్డుకు చేర్చిన లక్షల టన్నుల ధాన్యం తడిసింది. పది, పదిహేను రోజుల ముందే కోతలు ముగిసి ఉంటే ఈ నష్టం  తప్పేదని రైతులు వాపోతున్నారు.

...అయితే అమలు చేయబోమంతే!

తుపాన్లతో జరుగుతున్న నష్టాలను నివారించడానికి గత ప్రభుత్వం... పంట కాలాన్ని ముందుకు జరపాలని నిర్ణయించింది. రైతుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జూన్‌లోనే నీటిని విడుదల చేయడం ప్రారంభించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సైతం పూర్తి చేసింది. అన్నదాతలు ఆ ఫలాలను అందుకునే సమయంలోనే వైకాపా ప్రభుత్వం వచ్చింది. పంటకాలంపై గత ప్రభుత్వ ప్రణాళికలను పక్కన పెట్టేసింది. నాలుగేళ్లుగా వాటి ఆచరణ లేదు. ఏదో మొక్కుబడిగా నీటిని విడుదల చేసి... చేతులు దులిపేసుకుంటోంది. ముందే నీటిని ఇస్తున్నామని ఘనంగా ప్రకటనలు చేయడం తప్పితే.. కాల్వల నిర్వహణకు నిధులివ్వడం లేదు. అంతిమంగా రైతుల్ని తుపాన్ల  సుడిగుండాల్లోకి నెట్టేస్తోంది. ఏటా పంట దిగుబడులు నీళ్లలో   నానుతున్నా పట్టనట్లు ఉంటోంది.


నారుమడి స్థాయి నుంచి దినదినగండమే

గోదావరి, కృష్ణా డెల్టాల వరి రైతులు ఏటా తుపాన్ల బారిన పడుతున్నారు. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టినా.. పంట చేతికి వచ్చే వరకు దినదినగండమే. చాలాసార్లు ఖరీఫ్‌ ఆరంభం నుంచి వరదలు ముంచెత్తుతుండటంతో జులైలో నారుమళ్ల దశలోనే మునుగుతున్నాయి. దీంతో మరోసారి నారు పోసుకోవాల్సి వస్తోంది. ఆగస్టులో నాట్లు వేసినా.. ఇంకోసారి వరద ముంచుతోంది. మళ్లీ ఎక్కడోచోట నారు తెచ్చి నాట్లు వేస్తున్నారు. మూడు నెలలపాటు పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాక... డిసెంబరులో కోతలు మొదలవుతున్నాయి. సరిగ్గా ఇదే సమయానికి తుపాన్లు వచ్చి అన్నదాతల కష్టార్జితాన్ని నీట ముంచుతున్నాయి. ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుందని, అవసరాలు తీర్చుకోవచ్చనే గంపెడాశతో ఉంటున్న రైతులకు... కనీసం పశువుల మేతకైనా గడ్డి దక్కని దుస్థితి ఎదురవుతోంది.


నవంబరు నాటికే   కోతలు పూర్తయ్యేలా...

అధిక శాతం తుపాన్లు నవంబరు, డిసెంబరు నెలల్లోనే వస్తున్నాయి. ఈలోగా వరి కోతలు పూర్తి చేసుకుంటే రైతులను నష్టాల బారి నుంచి తప్పించవచ్చు. ఈ ఆలోచనతోనే గత ప్రభుత్వం గోదావరి, కృష్ణా డెల్టాలకు నీటి విడుదలపై 2017 సంవత్సరంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం జూన్‌ 1వ తేదీన నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. వెంటనే నారు పోసుకుంటే జులైలో నాట్లు పూర్తి చేసుకోవచ్చు. నవంబరులోగా వరి కోతలు పూర్తవుతాయి. దీంతో రైతులను తుపాన్ల నుంచి కాపాడవచ్చు. పంటకాలాన్ని ముందుకు జరపాలనే లక్ష్యంతోనే గత ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సైతం పూర్తి చేసి, జూన్‌లోనే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసింది.

రబీపైనా ప్రభావం

ఖరీఫ్‌ కోతలు ఆలస్యం అవుతున్న ప్రభావం రబీ నాట్లపైనా పడుతోంది. ఈ నాట్లు కూడా ఆలస్యం అవుతుండటంతో... ఏప్రిల్‌, మే నెలల్లో రబీ వరి కోతకొస్తోంది. అప్పుడు కూడా అకాల వర్షాలు ముంచేస్తున్నాయి. దాంతో ఖరీఫ్‌, రబీ రెండు పంటల్ని నష్టపోతున్నామనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. 2023 రబీని పరిశీలిస్తే... ఏప్రిల్‌ ఆఖరు నుంచి మే మొదటి వారం వరకు 18 జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంది. సాధారణం కంటే 300% అధికంగా వానలు కురిశాయి. దీంతో ఆరబెట్టిన లక్షల టన్నుల ధాన్యం తడిచింది. కొనేందుకు మిల్లర్లు సతాయించారు. ప్రభుత్వమూ పట్టించుకోలేదు. రైతులు భారీగా నష్టపోయారు. ఇలా ఏటా కనీసం ఒక పంట అయినా దెబ్బతింటోంది. ముందే నారు పోసి, నాట్లు వేసేలా అన్నదాతలకు అవగాహన కల్పించడంతోపాటు కాల్వల నిర్వహణకు నిధులిస్తే వారిని నష్టాల నుంచి బయట పడవేయవచ్చనే విషయాన్ని వైకాపా సర్కారు విస్మరిస్తోంది.


కాల్వల నిర్వహణ లేక.. నిధులూ ఇవ్వక...

తాము అధికారంలోకి వచ్చాక జూన్‌లోనే నీటిని విడుదల చేస్తున్నామని జగన్‌ ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. అయితే అత్యంత కీలకమైన కాల్వల మరమ్మతులను విస్మరించింది. వాటి నిర్వహణకు నిధులు కూడా ఇవ్వడం లేదు. అవి ఎక్కడికక్కడే పూడికతో నిండిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ కారణంగానే గతేడాది డెల్టాలో పంట విరామం కూడా ప్రకటించడం గమనార్హం. కొన్నిచోట్ల రైతులే సొంత నిధులను ఖర్చు పెట్టి అక్కడక్కడ మరమ్మతులు చేయించుకుంటున్నారు. అయితే,  ప్రభుత్వం జూన్‌ 1న నీరు విడుదల చేసినా... కాల్వల్లో పూడిక కారణంగా పొలాలకు చేరేసరికి నెల రోజులకుపైగా సమయం పడుతోంది. ఫలితంగా జులైలో నారు పోసి, ఆగస్టులో నాట్లు వేస్తున్నారు. నవంబరు నెలాఖరుకు, డిసెంబరులో కోతల సమయానికి తుపాన్లు విరుచుకుపడుతున్నాయి. పంటంతా నీటిపాలై... పెట్టుబడులు దక్కక అన్నదాతలు నష్టపోతున్నారు. ఈ ఏడాది కృష్ణా డెల్టాలో నీరిచ్చినా చివరి భూములకు చేరలేదు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని