జగనన్న కాలనీలా.. చెరువులా?

‘ఇళ్లు కాదు...అవి ఊళ్లు’...జగనన్న కాలనీలపై ముఖ్యమంత్రి జగన్‌ సహా ఆయన అనుచరగణమంతా చెప్పే మాటే ఇది. ఆ ఊళ్లను ఎంత సురక్షితంగా కడుతున్నారో....ఒక్క వర్షం వస్తే ఇట్టే తెలిసిపోతోంది.

Updated : 07 Dec 2023 07:25 IST

రూ.2,200కోట్లు వెచ్చించినా ముంపు సమస్యే..
ఒక్క వర్షానికే నీట మునిగిన జగనన్న కాలనీలు
ఈనాడు - అమరావతి

‘ఇళ్లు కాదు...అవి ఊళ్లు’...జగనన్న కాలనీలపై ముఖ్యమంత్రి జగన్‌ సహా ఆయన అనుచరగణమంతా చెప్పే మాటే ఇది. ఆ ఊళ్లను ఎంత సురక్షితంగా కడుతున్నారో....ఒక్క వర్షం వస్తే ఇట్టే తెలిసిపోతోంది. చాలా లేఅవుట్లలో ఇళ్ల మధ్యకు చెరువులనే తెచ్చేశారు. కాలనీల మీదుగానే వరద నీటినీ పారిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఎవరైనా ఎంత వర్షపాతం నమోదైందో తెలుసుకోవాలంటే అక్కడున్న జగనన్న కాలనీలకు వెళితే ఇట్టే అర్థమయ్యేలా అవి ఉన్నాయి.

మెరక పనులకు రూ.2,200కోట్లు వెచ్చించినా..

కాలనీల్లో మెరక పనుల కోసం ఏకంగా రూ.2,200 కోట్లు వెచ్చించారు. అయినా వాటికి ముంపు సమస్య తప్పలేదు. ఈ పనుల్ని చేసింది చాలా వరకు జగన్‌ అనుచరగణమే. ఇళ్లు కట్టడం పూర్తికాకుండానే వాటిని నీటిలో ముంచుతూ లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు. సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. చిరుజల్లులకే వాన నీరు చేరుతోంది. కాలనీల్లో మెరక, చదును కోసం అత్యధిక నిధులను ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే వినియోగించారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతాల్లో మెరక చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

చేతులేత్తేసిన జగన్‌ సర్కార్‌..

చాలా లేఅవుట్లలో మెరక చేయడం, అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణ పనులను వైకాపా నేతలకే కట్టబెట్టారు. వారు  నాసిరకంగా పనులు కానిచ్చేశారు. చిన్నపాటి వర్షాలకే మెరక చెదిరిపోయి ఆ రహదారులన్నీ గతుకుల మయంగా మారాయి. ఇలాంటి కాలనీల్లో మళ్లీ మెరక చేయాలని జిల్లా అధికారుల నుంచి చాలా కాలంగా ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసమే దాదాపు రూ.100 కోట్లపైగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కిమ్మనకుండా ఉన్నారు.


జలకాలనీ కాదు.. జగనన్న కాలనీనే

ఈ చిత్రం చూస్తే వర్షపు నీటిపైన పునాదులు కడుతున్నారా అన్నట్టుగా ఉంది కదా? జగన్‌ పాలన అంటే ఆ మాత్రం ప్రత్యేకత ఉండాలి కదా? ఇది 2020 డిసెంబర్‌ 25న స్వయంగా జగనే శంకుస్థాపన చేసిన కాలనీ. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఉంది. 350 ఎకరాల్లో 16 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. మెరక చేసేందుకే రూ.70 కోట్లు ఖర్చు పెట్టారు. మెరక ఎటు పోయిందో....అందు కోసం వెచ్చించిన రూ.70 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో జగన్‌కే తెలియాలి? ఇప్పటికి 400 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.


ఇళ్ల మధ్యనే తటాకం

జగన్‌ పాలనలో జగనన్నకాలనీల్లో ఇళ్ల మధ్యనే చెరువులు కనిపిస్తున్నాయి. అందుకు నిదర్శనమే ఏలూరు జిల్లా కైకలూరులోని జగనన్న లేఅవుట్‌. సరైన రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. కాలనీలో నివశిస్తున్న ప్రజలు బయటకు రావాలన్నా, లోపలికి వెళ్లాలన్నా అవస్థలు పడుతున్నారు.


బేస్‌మెంట్‌లే కొట్టుకుపోతున్నాయ్‌....

ఈ చిత్రం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలోని ఇళ్ల నిర్మాణాల దుస్థితిని తెలియజేస్తోంది.  వర్షపు నీరంతా ఇలా నిర్మాణాల మీదుగానే పారుతోంది. ఫలితంగా బేస్‌మెంట్లు ఇలా కొట్టుకుపోతున్నాయి. వేసిన మట్టి రహదారుల పరిస్థితీ ఇదే.


ఈ రహదారులపై ఆదమరిస్తే అంతే సంగతులు

ఏమాత్రం ఆదమరిచినా కాలు జారి కిందపడేలా ఉన్న ఈ రోడ్లు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు జగనన్న కాలనీలోనివి. ఈ కాలనీలో దాదాపుగా 100 కుటుంబాలకుపైగా ఉంటున్నాయి. మేత కోసం కాలనీలోకి గొర్రెలను పంపిస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది చూసి మిగతా లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు వెనుకాడుతున్నారు.


వరద నీరు పారుతున్న ఈ జగనన్న కాలనీ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోనిది. ఇక్కడ 70 మందికి ఇళ్లు మంజూరుచేశారు. నిర్మాణాలు పూర్తిచేసుకుని గత ఆరు నెలలుగా 12 కుటుంబాలు నివసిస్తున్నాయి. అన్ని నెలలుగా అక్కడ లబ్ధిదారులు నివసిస్తుంటే మౌలిక సదుపాయాలైనా కల్పించాలనే కనీస ధ్యాసైనా ప్రభుత్వానికి లేకుండా పోయింది. అందుకే సిమెంటు రహదారులు, మురుగునీటి కాల్వలు నిర్మించలేదు. ఫలితంగా ఇదిగో ఇలా వర్షపునీరు కాలనీలోకి పోటెత్తి లబ్ధిదారులను ఇక్కట్లపాలుజేసింది.


ఇది కాలనీయా.. చెరువా?

ఈ చిత్రం చూపించి....కనిపిస్తున్నది చెరువా? జగనన్న కాలనీనా అని చిన్నపిల్లాడిని అడిగినా చెరువే అని ఠక్కున సమాధానం చెబుతారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఇలాంటి చోటును జగన్‌ కేటాయించారు. పైగా రాష్ట్రంలోనే అతి పెద్ద లేఅవుట్లలో ఇదీ ఒకటి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కరగ్రహారంలో ఉంది. 16 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. స్థలాలు అయితే ఇచ్చారేగానీ మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఫలితంగా చిన్నపాటి వర్షం పడినా ఇలా చెరువులా మారుతుంది. దీంతో కాలనీలో సగం విస్తీర్ణం సరిహద్దురాళ్లకే పరిమితమైంది.


కృష్ణా జిల్లా గొడవర్రు వద్ద పంట పొలాల మధ్య కంకిపాడు మండలానికి చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. వాన పడినప్పుడల్లా పొలాల్లోని నీరంతా ఇలా కాలనీలోకి చేరుతోంది. వేసిన రహదారులు ఎప్పుడో కరిగిపోయాయి. లేఅవుట్‌లోకి వెళ్లాలంటే లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూశారా ఎలాంటి చోట లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారో జగన్‌..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని