జీతాల కోసం ఎడతెగని నిరీక్షణ

అప్పు తీసుకుని అప్పులు తీర్చడమే ఆర్థిక నిర్వహణగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో నేటికీ నవంబరు నెల జీతాలు అందక వేల మంది ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Updated : 08 Dec 2023 05:37 IST

ఇంకా రూ.వెయ్యి కోట్లకు పైనే పెండింగ్‌
తెచ్చిన అప్పు ఓడీకే జమ
మళ్లీ చేబదుళ్లతోనే చెల్లింపులా?
రోజురోజుకూ దారుణంగా మారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

ఈనాడు, అమరావతి: అప్పు తీసుకుని అప్పులు తీర్చడమే ఆర్థిక నిర్వహణగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో నేటికీ నవంబరు నెల జీతాలు అందక వేల మంది ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరు పెన్షనర్లకూ నవంబరు నెల పింఛను రావాల్సి ఉంది. కొత్త నెల ప్రారంభమై వారం రోజులు దాటిపోయినా జీతాలు దక్కని పరిస్థితి కొనసాగుతోంది. ఏ ఒక్క నెలలోనైనా ఒకటో తారీకున జీతం అందుతుందేమోనని ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదో కలగా మారిపోయింది. జగన్‌ పాలనలో ఒకటో తారీకున జీతం ఇవ్వలేనంత ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చేసినా ఇదే దుస్థితి. తాజా సమాచారం మేరకు ఈ నెలలో జీతాల రూపేణా రూ.2,600 కోట్లు, మరో రూ.1,400 కోట్లు పెన్షన్‌ రూపంలో చెల్లించినట్లు తెలిసింది. ఉద్యోగులకు ఇంకా రూ.1,400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. పెన్షన్ల రూపంలో రూ.300 కోట్ల వరకు పెండింగులో ఉన్నాయి. రోజువారీ రాబడితో పాటు తిరిగి ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌలభ్యంతోనే ఈ చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెచ్చిన రుణం.. ఓడీకే సరి

డిసెంబరు నెల ప్రారంభంలోనే రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌లోకి వెళ్లిపోయింది. కిందటి మంగళవారం రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.3,000 కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకున్నారు. ఆరేళ్ల కాలపరిమితి, 7.70 శాతం వడ్డీతో రూ.వెయ్యి కోట్లు, తొమ్మిదేళ్ల కాలపరిమితి, 7.73 శాతం వడ్డీతో మరో రూ.వెయ్యి కోట్లు, 14 ఏళ్ల కాలపరిమితి, 7.71 శాతం వడ్డీతో మరో వెయ్యి కోట్లు జగన్‌ ప్రభుత్వం రుణం తీసుకుంది. అప్పటికే రాష్ట్రం అయిదు రోజులుగా ఓవర్‌ డ్రాఫ్ట్‌లో ఉంటూ వస్తోంది. దీంతో అప్పు తెచ్చిన సొమ్ములన్నీ ఓడీ నుంచి బయటపడేందుకు వెచ్చించాల్సి వచ్చింది. అంతేకాదు ప్రభుత్వం ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి దాదాపు రూ.3,200 కోట్ల మేర చేబదుళ్లు తీసుకుంది. ఇప్పుడు ఎలాంటి రాబడి లేకుండా ఆ మొత్తం చెల్లించాలంటే తిరిగి ఓవర్‌ డ్రాఫ్ట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని