‘ఇవి నగరాలు కావు..’ ప్రత్యక్ష నరకాలు

నగరాలు... మానవ ప్రగతికి చిహ్నాలు. అవి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. యువత ఉపాధికి ఊతమిస్తాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా పనిచేస్తాయి.

Updated : 08 Dec 2023 07:14 IST

బాగోగులను పట్టించుకోని వైకాపా సర్కారు
కొద్దిపాటి వర్షాలకే చెరువులను తలపిస్తున్న కాలనీలు
వరద ముంపు నివారణకు గత ప్రభుత్వ కృషి
పలు చోట్ల ఏకంగా రూ.2,048 కోట్లతో పనులు
అన్నింటినీ నిలిపేసిన జగన్‌ ప్రభుత్వం
మిగ్‌జాం తుపానుతో మరిన్ని కష్టాలు
ఈనాడు - అమరావతి

గరాలు... మానవ ప్రగతికి చిహ్నాలు. అవి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. యువత ఉపాధికి ఊతమిస్తాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా పనిచేస్తాయి. అందుకే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని నగరాల ప్రగతికి ఇతోధికంగా నిధులు సమకూరాయి. ముఖ్యంగా వరద నీటి పారుదల వ్యవస్థల బలోపేతానికి రూ.2,048 కోట్లు కేటాయించి, ఏకంగా 2,381 కి.మీ.ల పొడవున కొత్తగా కాలువలను నిర్మించింది. మరో 3,915 కి.మీ.ల పొడవైన ప్రాజెక్టుల పనుల్ని ప్రారంభించింది. అవన్నీ పూర్తయి ఉంటే... వరదలు, తుపాన్లు వచ్చినప్పుడు జరిగే నష్టం చాలావరకు తగ్గేది. అయితే, వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో మొదలైన పనులనే అక్కసుతో అన్నింటిపైనా నిర్లక్ష్యం ప్రదర్శించింది. నాలుగున్నరేళ్లలో 162 కి.మీ.ల కాలువల పనులనే పూర్తి చేసింది. ఫలితంగా వర్షాలు వచ్చినప్పుడల్లా నగరాలు, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లోని నగరాలు నీట మునుగుతున్నాయి. తాజాగా మిగ్‌జాం కారణంగా ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. సీఎం హోదాలో జగన్‌ ఇచ్చిన హామీలు సైతం నగరాలకు ఊరట కలిగించకపోవడం గమనార్హం.


విజయవాడ
గుత్తేదారుని తప్పించి... ప్రాజెక్టును గాలికి వదిలేసి...

విజయవాడలో ఓ మోస్తరు వర్షం ఎప్పుడు కురిసినా... పటమట, మొగల్రాజపురం, బెంజిసర్కిల్‌ వంటి కీలక కూడళ్లు, జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీలు, వన్‌టౌన్‌ ప్రాంతంలోని వీధులన్నీ నీటమునుగుతున్నాయి. సమస్య పరిష్కారానికి తెదేపా ప్రభుత్వ హయాంలో... అప్పుటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రూ.461 కోట్లు మంజూరు చేయగా 2017 ఏప్రిల్‌లోనే వాననీటి పారుదల ప్రాజెక్టు పనులు చేపట్టారు. 59 డివిజన్లలో 440 కి.మీ.ల పొడవైన కాలువలు నిర్మించాలన్నది లక్ష్యం. పనులు జరుగుతుండగానే వైకాపా అధికారంలోకి వచ్చింది. కొన్నాళ్లపాటు పనులు కొనసాగించి రూ.172 కోట్లతో 252.22 కి.మీ.ల పొడవున కాలువలు నిర్మించారు. పనుల్లో జాప్యం జరుగుతోందంటూ 2021లో గుత్తేదారు సంస్థను తప్పించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే మిగతా పనులు చేస్తామన్నారు. ఇప్పటివరకు అతీగతీ లేదు. సుమారు 500 ప్రాంతాల్లో ఇలా నిర్మించిన కాలువలను ఇంకా అనుసంధానించలేదు. దాంతో చేసిన పనులూ నిరుపయోగమయ్యాయి. ఈ నిర్లక్ష్యానికి సమాధానం చెప్పేవారే లేరు.


జగనన్నా... ఈ నిర్లక్ష్యాన్ని ఏమనాలి?

చినుకుపడితే నగరాలు నిండా మునుగుతున్నాయి
రోడ్లన్నీ కాలువలుగా మారుతున్నాయి
మురుగు పారుదల వ్యవస్థలు కుదేలు
ప్రస్తుత వర్షాలకు ప్రజలకు మరిన్ని కష్టాలు 

నిర్లక్ష్యం...! నగరాల ప్రజలకు శాపంగా మారిన జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం...!!

నగరాలు చెరువులుగా మారుతున్నా, వీధులన్నీ ఏరులై పారుతున్నా, లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగి ప్రజలు అల్లాడుతున్నా... వారి మొర చెవికెక్కనంత నిర్లక్ష్యం..!! విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కడప, తిరుపతి, అనంతపురం... అనే తేడా లేకుండా నగరాలన్నీ ఓ మోస్తరు వర్షాలకే అల్లాడుతున్నాయి. ఇక తుపాన్లు భారీ వర్షాలు ముంచెత్తితే చెప్పాల్సిన పనేలేదు. అయినా వైకాపా ప్రభుత్వానికి ఏమీ పట్టడంలేదు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటిపోయినా... నగరాల్లో వరద నీరు, మురుగునీటి పారుదల వ్యవస్థల్ని మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. గత ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టుల్ని పూర్తిగా గాలికొదిలేసింది.

వాటిని పూర్తి చేస్తే ఆ ప్రభుత్వానికే పేరు వస్తుందన్న అక్కసుతో పక్కన పెట్టేసింది. రాష్ట్రంలో పురపాలకశాఖ అంటూ ఒకటుందని, దానికో మంత్రి ఉన్నారని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రస్తుత, గత పురపాలక శాఖ మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, బొత్స సత్యనారాయణ సీరియస్‌గా సమీక్షించిన దాఖలాల్లేవు. ముఖ్యమంత్రి సంగతి సరేసరి..! మిగ్‌జాం తుపానుతో రాష్ట్రంలోని పలు నగరాలను ‘ఈనాడు’ పరిశీలిస్తే.. ఎక్కడ చూసినా కాలువలుగా మారిన రోడ్లు... చెరువులుగా మారిన కాలనీలు... అడుగు వేయడానికి జంకాల్సిన పరిస్థితులే కనిపించాయి. ఆయా నగరాల్లో నెలకొన్న దుస్థితిపై ఇవీ వివరాలు...


కర్నూలు...

వెన్నాడుతున్న నాటి పీడ కల

కర్నూలు ప్రజలకు 2009 నాటి జలప్రళయం పీడకలలాంటిది. నాడు నగరంలోని 1,200 కాలనీల్లో 800 కాలనీలు నీటమునిగాయి. ఎనిమిది అడుగుల ఎత్తువరకు నీరు నిలిచింది. అపార్ట్‌మెంట్ల మొదటి అంతస్తులు కూడా నీట మునిగాయి. వరద ఉద్ధృతి తగ్గాక కూడా... మోకాల్లోతు బురద పేరుకుపోయింది. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తుంగభద్ర, హంద్రి, వక్కెరావుగ, సుద్దవాగుల కట్టలను బలోపేతం చేసి, రక్షణ గోడలు నిర్మించేందుకు రూ.243.23 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. వాటికి పరిపాలన అనుమతులూ ఇచ్చింది. కానీ రూ.1.17 కోట్ల పని మాత్రమే జరిగింది. తుంగభద్ర, హంద్రీనదుల సంగమ ప్రాంతం నుంచి రైల్వే బ్రిడ్జి వరకు రూ.75.93 కోట్లతో రక్షణ గోడల నిర్మాణమూ దస్త్రాలకే పరిమితమైంది. కర్నూలు నగరాన్ని వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రతిపాదించిన ఇతర పనుల్నీ అటకెక్కించారు. ప్రస్తుతం ఆ పనులన్నీ చేయాలంటే రూ.1,150 కోట్లు అవసరమని అంచనా.


మచిలీపట్నం...

పురాతన మున్సిపాలిటీకీ తిప్పలే

దేశంలోనే పురాతన మున్సిపాలిటీల్లో మచిలీపట్నం ఒకటి. ఈ పట్టణం సముద్ర మట్టానికి దిగువన ఉండటంతో మురుగునీటి పారుదల పెద్ద సమస్యగా మారింది. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో నిపుణుల సూచన మేరకు ఓపెన్‌ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టేందుకు 2008లో అప్పటి ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ పథకం కింద రూ.80 కోట్లు మంజూరు చేసింది. గుత్తేదారు సంస్థ లాభసాటి పనుల వరకూ చేసి మిగతా వాటిని మధ్యలోనే వదిలేసింది. అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.21 కోట్లు కేటాయించారు. నగరవ్యాప్తంగా 86 కి.మీ. మేర అంతర్గత డ్రెయిన్ల నిర్మాణం, వాననీటి పారుదల వ్యవస్థల ఏర్పాటు, అవసరమైన చోట ఎత్తిపోతల పథకాలు అమలు చేసేందుకు మరో రూ.68 కోట్లు మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇటీవల వైకాపా ఎంపీ బాలశౌరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో... ముంపు సమస్యపై అధ్యయనం చేయడానికి కేంద్ర నిపుణుల బృందాన్ని రప్పించే ప్రయత్నం చేయగా, నగరపాలక సంస్థ పట్టించుకోకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు.


విశాఖ...

గెడ్డల ఆధునికీకరణ హుళక్కి

విశాఖలో భారీ వర్షం కురిస్తే జ్ఞానాపురం, పూర్ణామార్కెట్‌, వన్‌టౌన్‌, గాజువాక హెచ్‌బీ కాలనీ, కణితి, నరవ తదితర ప్రాంతాల్లో ప్రజలకు నరకం కనిపిస్తుంది. కాలువలను వెడల్పు చేయకపోవడం, కొత్తగా వరద నీటి కాలువలు నిర్మించకపోవడమే దీనికి కారణం. నగరంలోని 90% కాలువల నుంచి వచ్చే నీరు ఎర్రిగెడ్డ, గంగులగెడ్డ, ఎస్‌ఎల్‌ కెనాల్‌ ద్వారా సముద్రంలో కలుస్తుంది. ప్లాస్టిక్‌ వస్తువులు, ఇతర వ్యర్థాలు సముద్రంలో కలవకుండా విశాఖ పోర్టు అధికారులు గెడ్డలకు అడ్డంగా గేట్లు పెడుతున్నారు. భారీ వర్షం కురిసినప్పుడూ గేట్లు మూసి ఉండటంతో గెడ్డలు పొంగి జ్ఞానాపురం, పూర్ణామార్కెట్‌, వెలంపేట, వన్‌టౌన్‌ ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. ప్రత్యేకించి చావుల మదుం వద్ద నీటి ప్రవాహ ఉద్ధృతితో వాహనాల రాకపోకలకు గంటల కొద్దీ అంతరాయం ఏర్పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో గెడ్డల ఆధునికీకరణకు చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు.


కడప...

సీఎం సొంత జిల్లాపైనా శ్రద్ధలేదు

వానలు రావాలి... చెరువులు నిండాలి... నీటి కరవు తీరాలని రాయలసీమ ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. కడపలో మాత్రం చినుకు కురిస్తే జనం వణికిపోతున్నారు. నాయకులు, వారి అనుచరగణం నగరం చుట్టూ ఉన్న చెరువుల్ని, అలుగుల్ని, వంకల్ని, వాగుల్ని యథేచ్ఛగా ఆక్రమించేయడంతో చిన్న వర్షానికే కడప జలమయం అవుతోంది. ఒకప్పుడు బుగ్గవంక మాత్రమే నగరానికి ప్రమాదకరంగా ఉండేది. ఇప్పుడు ప్రతి వంక, చివరకు మురుగు కాలువా అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయి. 2021లో వచ్చిన వరదలకు నగరంలో ఎన్జీఓ, భాగ్యనగర్‌ కాలనీలు మూడు రోజులు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిన్నచౌకు ప్రాంతంలో ప్రజలు పడవలపై తిరగాల్సి వచ్చింది.

శంకుస్థాపనతో సరి: వరద నష్టాన్ని పరిశీలించేందుకు 2021 జూలై 9న కడప వెళ్లిన ముఖ్యమంత్రికి సమస్యకు కారణాలను అధికారులు వివరించారు. వెంటనే స్పందించిన సీఎం... గతంలో ఒక రోడ్డు విస్తరణ పనికి కేటాయించిన రూ.69.5 కోట్లను కడప వరద నీటిపారుదల పనులకు ఇస్తున్నట్లు ప్రకటించారు. అది జరిగి రెండేళ్లయినా ఒక్క రూపాయి విడుదల చేయలేదు. మరోవైపు నగరంలో వరద కాలువల నిర్మాణానికి ఒక కన్సల్టెన్సీతో డీపీఆర్‌ సిద్ధం చేయించారు. రూ.500 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. అదీ ముందుకి వెళ్లలేదు. ఈ ఏడాది జులై 10న సీఎం మళ్లీ కడప వచ్చారు. ఈసారి ఏకంగా ప్రాజెక్టుకి శంకుస్థాపనే చేశారు. కానీ అంగుళం కూడా ముందుకు కదల్లేదు.

పేదల ఇళ్లే పడగొట్టారు: ఆక్రమణలు తొలగించి వరద కాలువల ఏర్పాటుకి నగరాన్ని ఏడు జోన్లుగా విభజించారు. పేదలు అధికంగా నివసించే ప్రకాశ్‌నగర్‌, వరదకాలనీ, తిలక్‌నగర్‌వంటి చోట్ల ఇళ్లు పడగొట్టారు. ఎన్జీఓ కాలనీ, అప్సరా థియేటర్‌, అంబేడ్కర్‌ కూడలి- వైజంక్షన్‌ వంటి చోట్ల పలుకుబడి కలిగిన వ్యక్తుల భవనాల జోలికి పోలేదు.


నెల్లూరు...

ముంపు నివారణ పట్టదే

నెల్లూరులో కురిసిన వర్షపునీరంతా సర్వేపల్లి కాలువలోకి వెళ్లేలా నిర్మించిన అనేక కాలువలు ఆక్రమణకు గురవడంతో ఎప్పుడు వర్షం పడినా నగరం నీట మునుగుతోంది. పది మీటర్ల వెడల్పు ఉండాల్సిన కాలువలు కొన్నిచోట్ల రెండు మీటర్లకు కుంచించుకుపోయాయి. దీంతో సోమశిల జలాశయం ఎగువన వర్షం కురిస్తే... నగర ప్రజలకు కంటిమీద కునుకు ఉండటం లేదు. పెన్నాకు వరదొస్తే పరీవాహకంలోని ప్రాంతాలకు ముంపు తప్పడం లేదు. ముంపు నివారణకు కాలువల ఆక్రమణలపై సర్వే నిర్వహించారు. వాటి ఆధునికీకరణకు రూ.65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కాలువ గట్లపై నివసిస్తున్న వారికి భారీ సంఖ్యలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వారిని అక్కడికి తరలించి కాలువల్ని ఆధునికీకరించాలనుకున్నారు. నెల్లూరులో తెదేపా ప్రభుత్వం రూ.645.05 కోట్లతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ప్రారంభించింది. 420 కి.మీ.లకు సుమారు 390 కి.మీల పనులు పూర్తయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక బిల్లులు చెల్లించలేదని గుత్తేదారులు పనులు ఆపేశారు.

లబ్ధిదారులకు ఇళ్లూ ఇవ్వలేదు: వైకాపా ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదు. కాలువల ఆధునికీకరణ ప్రతిపాదనను అటకెక్కించింది. నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌... రెండున్నరేళ్లపాటు మంత్రిగా ఉన్నా నగరాన్ని ముంపు సమస్య నుంచి బయటపడేసేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కాలువల ఆక్రమణలు కొనసాగుతున్నా నగరపాలక సంస్థ సిబ్బంది పట్టించుకోవడం లేదు. తాజాగా మిగ్‌జాం తుపాను ధాటికి నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్‌ వంటి ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి.


గుంటూరు...

అటకెక్కిన పనులు

గుంటూరులో భారీ వర్షం కురిస్తే అనేక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. గుజ్జన గుండ్ల వంటి ఎగువ ప్రాంతాల నుంచి నీరంతా కిందకు ప్రవహించి బుడంపాడు దగ్గరున్న పీకలవాగులో కలవాలి. ఆ క్రమంలో ఏటీ అగ్రహారం, చుట్టుగుంట, కేవీపీ కాలనీ, పాతగుంటూరు, శ్రీనగర్‌ కాలనీ, నల్లచెరువు వంటి ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. నగరంలో యూజీడీ ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రూ.500 కోట్లు మంజూరు చేశారు. మొత్తం రూ.853 కోట్లతో 2017లో పనులు ప్రారంభించి, దాదాపు 50% పనులు పూర్తి చేసింది. సుమారు రూ.416 కోట్లు వెచ్చించింది. వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని అటకెక్కించింది. గుత్తేదారుకి చెల్లించాల్సిన రూ.42 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో పనులు కొనసాగలేదు. వాటిని పూర్తి చేయడానికి మరో రూ.287 కోట్లు అవసరమని వైకాపా ఎంపీలు 2022 నవంబరు 11న గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రిని కోరగా... ఆయన హామీ ఇచ్చారు. ఇంతవరకు పైసా ఇవ్వలేదు.


ఒంగోలు...

పోతురాజు కాలువపై అశ్రద్ధ

వర్షాకాలంలో ఒంగోలులోని పేర్నమిట్ట కొండ దిగువ నుంచి పాత మార్కెట్‌ సెంటర్‌లోని సెయింట్‌ థెరిసా చర్చి వరకు చెరువులా మారుతుంది. నగరంలో 80 శాతానికి పైగా మురుగు నీరు పోతురాజు కాలువ ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది. వంద అడుగుల వెడల్పు ఉండాల్సిన ఈ కాలువ ప్రస్తుతం 30 అడుగుల్లోపే ఉంది. కాలువ ఆధునికీకరణకు వైకాపా ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.80 కోట్లు కేటాయించింది. కాలువపై 720 మందికి చెందిన ఆక్రమణల్ని తొలగించి, వారికి ప్రత్యామ్నాయ వసతి చూపించకపోవడంతో... పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.


వీటిదీ అదే దుస్థితి

  • అనంతపురంలో 2022 అక్టోబరులో కురిసిన వర్షాలకు  పలు కాలనీలు జలమయం అయ్యాయి. అప్పట్లో సీఎం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలవ్వలేదు. భారీ వర్షం కురిస్తే నగరంలోని 13 కాలనీలతోపాటు అర్బన్‌ నియోజకవర్గంలోని రుద్రంపేటలోని ఆరు కాలనీలు జలమయం అవుతాయి. రుద్రంపేట ప్రారంభం నుంచి అనంతపురం శివారు వరకు నడిమి వంక ప్రవాహం ఉద్ధృతంగా ఉంటుంది. నడిమివంక, రజకనగర్‌, సోమనాథ్‌నగర్‌ ప్రాంతాల్లో వంతెన రక్షణ గోడకు రూ.43.30 కోట్లు, ఆలమూరు రోడ్డు నుంచి ఎన్‌హెచ్‌-44 వరకు 1.75 కిలోమీటర్లకు రూ.46.50 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. పనులు మొదలవలేదు.

  • రాజమహేంద్రవరం... గోదావరి నది కంటే నగరం దిగువకు ఉండటంతో ముంపు సమస్యను ఎదుర్కొంటోంది. కంబాలచెరువు, తుమ్మలావ, కోటిపల్లి బస్టాండ్‌, మోరంపూడి, వీఎల్‌పురం, రైల్వేస్టేషన్‌, ఆల్కాట్‌ గార్డెన్స్‌, కృష్ణనగర్‌ తదితర ప్రాంతాల్లోకి వర్షపు నీరు చొచ్చుకొస్తోంది. ఓ మోస్తరు వర్షానికే ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునుగుతాయి. ముంపు సమస్య పరిష్కారానికి అమృత్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.80 కోట్లతో పనులు చేపట్టారు. అవి కరోనా సమయంలో నిలిచిపోయి... ఇప్పటికీ మొదలవలేదు.

  • కాకినాడ సైతం సముద్రమట్టానికి దిగువున ఉండటంతో ముంపు బారిన పడుతోంది. గత ప్రభుత్వం ఉప్పుటేరుకి బండ్‌ నిర్మించి, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక అవి అటకెక్కాయి.

  • ఏలూరులో కొద్దిపాటి వర్షానికే రోడ్లు, డ్రెయిన్లు ఏకమై పొంగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంతోపాటు ప్రభుత్వాసుపత్రినీ వరద నీరు చుట్టుముడుతున్నా నివావరణ చర్యల్లేవు. తెదేపా ప్రభుత్వం యూజీడీకి నిధులు కేటాయించి పనులు ప్రారంభించగా, వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది.

ఆధ్యాత్మిక క్షేత్రంపైనా అశ్రద్ధే

తిరుపతి

అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిపైనా వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోంది. 2021 మే 31న నగరంలో వరద ముంపు నివారణ, ఇతర పనులకు రూ.183.10 కోట్లను మంజూరు చేసింది. ఆ నిధులు వస్తాయనుకున్న అధికారులు 267 అభివృద్ధి పనులకు టెండర్లు కూడా పిలిచారు. ఇప్పటివరకు రూ.7 కోట్లకు మించి రాలేదు. 2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి నగరం తల్లడిల్లింది. అయినా నిధులేమీ ఇవ్వలేదు. పేరూరు చెరువు కాలువలు ఆక్రమణకు గురవడంతో ఆ నీరంతా నగరంలోకి ప్రవేశిస్తోంది. మిగ్‌జాంతో తిరుపతిలో భారీ వర్షాలు కురవకున్నా... నగరం అతలాకుతలమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని