‘ఎన్నికల ముంగిట్లో..’ గ్రూపు-2 ముచ్చట!

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రూపు-2 నోటిఫికేషన్‌ జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ నిర్వహిస్తామని ప్రకటించింది.

Updated : 08 Dec 2023 07:21 IST

ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌.. నోటిఫికేషన్‌ జారీ
మెయిన్స్‌, నియామకాలు కొత్త ప్రభుత్వంలోనే..
గ్రూపు-1 ప్రకటన ఇవ్వక అభ్యర్థుల తికమక
‘వయోపరిమితి’పరంగా 50 వేలమంది అనర్హులు

ఈనాడు, అమరావతి: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రూపు-2 నోటిఫికేషన్‌ జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. మెయిన్స్‌ (ప్రధాన పరీక్ష) తేదీని తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. అంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే మెయిన్స్‌ జరుగుతుందన్నమాట. ఈ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన వారికి.. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. ఇవన్నీ జరిగి.. ఎంపికైన వారు విధుల్లో చేరేందుకు చాలా సమయమే పడుతుంది. ప్రభుత్వ పదవీకాలం ముగిసే సమయంలో నోటిఫికేషన్‌ ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.

2021 జూన్‌లో జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ప్రకటించిన గ్రూపు-2 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ వెలువడేందుకు రెండేళ్ల అయిదు నెలల వరకు సమయం పట్టింది. దీనివల్ల సుమారు 50 వేల మంది వరకు వయోపరిమితి కోల్పోయి ఉంటారని అంచనా. ఈ నోటిఫికేషన్‌ అనుసరించి సుమారు 5 లక్షలమంది నిరుద్యోగులు దరఖాస్తు చేస్తారు. ‘నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నోటిఫికేషన్‌ వస్తుంది’ అంటూ ఆగస్టు నుంచి ఏపీపీఎస్సీ సభ్యుడొకరు ‘ఎక్స్‌’ వేదికగా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇప్పటికి అది వచ్చింది.

‘నోటిఫికేషన్‌’ల జారీలో ‘రివర్స్’ 

ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లను గత నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నవంబరు 1న వెల్లడించింది. అప్పుడే గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 900 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. కానీ, నోటిఫికేషన్‌లో మాత్రం దీనికి 897 పోస్టులే ఉన్నాయి. మొదట గ్రూపు-1 నోటిఫికేషన్‌ జారీచేసి, పరీక్షల తేదీలు ప్రకటిస్తే.. దీనికి అనుగుణంగా అభ్యర్థులు సన్నద్దమవుతారు. గ్రూపు-1 పోస్టులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. వాటి భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా గ్రూపు-2 ఇవ్వడం వల్ల అభ్యర్థులు సన్నద్ధతకు ఇబ్బందులు పడతారు. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమ్స్‌ సన్నద్ధతకు 80 రోజుల వరకే సమయం ఉంది. అదే యూపీఎస్సీ 2023 సివిల్స్‌ నోటిఫికేషన్‌ జారీ జరిగినప్పటి నుంచి పరీక్ష జరిగే వరకు 117 రోజుల వరకు సమయం లభించింది. 

గాలిలోంచి పోస్టులు సృష్టించారా? 

గత 2021 జూన్‌లో జారీచేసిన క్యాలెండర్‌ ద్వారా గ్రూపు-1, గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. చివరికి గ్రూపు-1 కింద 110, గ్రూపు-2 కింద 182 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ 2022 మార్చి 31న ఆర్థికశాఖ జీఓ జారీ చేసింది. దీని ప్రకారం.. 2022 సెప్టెంబరులో గ్రూపు-1 నోటిఫికేషన్‌ ఇచ్చింది. నియామకాలు జరిగాయి. గ్రూపు-2 నోటిఫికేషన్‌ మాత్రం వెలువడలేదు. ప్రకటించిన గ్రూపు-2 182 పోస్టులు కూడా తక్కువేనని నిరుద్యోగులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 25న ‘గ్రూపు-1, గ్రూపు-2 కింద 100, 900 చొప్పున పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు’ అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద ప్రకటించిన పోస్టులు ఇప్పటికిప్పుడు గాలిలో నుంచి కొత్తగా సృష్టించలేదు. ప్రభుత్వం వద్ద ఖాళీల జాబితా సిద్ధంగా ఉంది. కానీ.. భర్తీ చేయడం ఇష్టం లేకనే. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేసింది. మరోపక్క.. పోస్టుల భర్తీలో కీలకమైన రోస్టర్‌ పాయింట్స్‌, పే స్కేలు వివరాలు నోటిఫికేషన్‌లో లేవు.

ఈ నోటిఫికేషన్‌లు ఇస్తారా? ఇవ్వరా?

గ్రూపు-1 కింద ప్రకటించిన 88 పోస్టులతోపాటు డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు-267, పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకులు-99, టీటీడీ డీఎల్‌, జేఎల్‌-78, జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు-47, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌-38, ఇంగ్లిష్‌ రిపోర్టర్స్‌ (ఏపీ లెజిస్లేచర్‌ సర్వీస్‌)-10, గ్రంథపాలకులు (కళాశాల విద్య)-23, ఏపీఆర్‌ఈఐ సొసైటీ కింద జేఎల్‌, డీఎల్‌ పోస్టులు, ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌లో డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌, భూగర్భ నీటిపారుదల శాఖ, జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ సర్వీసెస్‌, ఏపీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ సర్వీస్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీసెస్‌, ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌, ఏపీ మున్సిపల్‌ ఎకౌంట్స్‌ సబ్‌ సర్వీసెస్‌లో జూనియర్‌ ఎకౌంట్‌ ఆఫీసర్‌ కేటగిరీ-2, సీనియర్‌ ఎకౌంటెంట్‌ కేటగిరీ-3, జూనియర్‌ ఎకౌంటెంట్‌ కేటగిరీ-4, ఇతర శాఖల్లో మరికొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని పేర్కొన్న ఏపీపీఎస్సీ గురువారం కేవలం గ్రూపు-2 మాత్రమే జారీచేసి, మిగిలిన నోటిఫికేషన్ల గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు.

21 నుంచి దరఖాస్తుల స్వీకరణ

గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 331, నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 566 ఉన్నాయి. గ్రూపు-2 నోటిఫికేషన్‌ అనుసరించి దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 21 నుంచి స్వీకరిస్తారు. జనవరి 10 వరకు స్వీకరణ జరుగుతుంది. సిలబస్‌, ఇతర వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని