వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన నేడు

మిగ్‌జాం తుపాను ప్రభావంతో తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు.

Published : 08 Dec 2023 05:54 IST

బాధితులతో ముఖాముఖి

ఈనాడు- తిరుపతి, న్యూస్‌టుడే- బాపట్ల: మిగ్‌జాం తుపాను ప్రభావంతో తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 8.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కోట మండలం విద్యానగర్‌కు రానున్నారు. అక్కడి నుంచి 10.30 గంటలకు రహదారి మార్గంలో వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో దెబ్బతిన్న స్వర్ణముఖి రివర్‌ బ్యాంక్‌ను పరిశీలిస్తారు. 11.05 గంటలకు బాలిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను పరిశీలిస్తారు. అనంతరం తుపాను బాధిత ప్రజలతో మాట్లాడతారు. 11.40 గంటలకు తిరిగి విద్యానగర్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి, నేరుగా బాపట్ల జిల్లాకు వెళ్లనున్నారు. ఆ జిల్లాలో కర్లపాలెం మండలం, పాతనందాయపాలెం వద్ద నీటిలో ఉన్న మిర్చి పంట, బుద్దాం వద్ద తుంగభద్ర కాల్వ పక్కనే నీట మునిగిన వరి పంటను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.


అన్నదాతపై ‘ఎన్నికల’ ప్రేమ!

ఈనాడు, అమరావతి: ఎన్నికలు దగ్గరపడేసరికి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, మంత్రులు, వైకాపా నాయకులకు రైతులు గుర్తొచ్చారు. వరద నష్టం చూసొస్తామంటూ పల్లెబాట పడుతున్నారు. వాస్తవానికి ఈ మధ్య కాలంలో.. వరదలు ముంచెత్తి పంటలు నష్టపోయినా, తీవ్ర కరవుతో రైతులు దెబ్బతిన్నా సీఎం జగన్‌ క్షేత్రస్థాయిలో వెంటనే పర్యటించిన దాఖలాల్లేవు. కొన్నాళ్ల తర్వాత వెళ్లి.. రైతులు, ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వస్తున్నారు. ముంపు తగ్గిన వెంటనే తాము పర్యటనకు వెళ్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని.. అందుకే నష్టం అంచనాలన్నీ పూర్తయ్యాకే ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్తున్నామని జగన్‌ తరచూ చెబుతుంటారు. అయితే ఇప్పుడు మాత్రం రెండు, మూడు రోజుల్లోనే పర్యటనకు బయల్దేరారు. అకాల వర్షాలతో అన్నదాతలు నష్టపోయినప్పుడు ఆలకించకుండా.. ఖరీఫ్‌లో తీవ్ర దుర్భిక్షం, బీడుపడిన భూములు కనిపిస్తున్నా ‘కాస్త కరవే’ అంటూ కొట్టిపారేసిన ఈ నేతలే.. ఇప్పుడు రైతన్నా మీకు మేమున్నాం అని చెబుతుండటం గమనార్హం. తడిసిన ధాన్యం, మునిగిన వరి, నేలవాలిన ఉద్యాన పంటలు చూసి.. కన్నీళ్లొలికిస్తున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ఒలకబోస్తున్న కపట ప్రేమేనని రైతాంగం విమర్శిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని