AP News: వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి, యజమాని

కృష్ణా నదిలో ఇసుక లోడింగ్‌ చేస్తుండగా హఠాత్తుగా వరద రావడంతో ఎడ్ల బండి, యజమాని కొట్టుకుపోయారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 08 Dec 2023 08:47 IST

ఒక ఎద్దు మృతి
మరో మూగజీవి తోకపట్టుకొని బయటపడ్డ యజమాని

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: కృష్ణా నదిలో ఇసుక లోడింగ్‌ చేస్తుండగా హఠాత్తుగా వరద రావడంతో ఎడ్ల బండి, యజమాని కొట్టుకుపోయారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక కోసం ఉయ్యూరు మండలం చినఓగిరాల నుంచి తోట్లవల్లూరు వద్ద కృష్ణా నది వద్దకు ఆరు ఎడ్లబళ్లు వచ్చాయి. లోడింగ్‌ చేస్తుండగా ఉన్నట్లుండి వరద రావడాన్ని గమనించిన కొంత మంది బళ్లతోసహా బయటకు వచ్చేశారు. బందెల శ్రీరాములు ఇసుక లోడింగ్‌ చేసుకునేలోపే వరద ఉద్ధృతికి బాట తెగిపోయింది.  బండి కొట్టుకుపోతుండటంతో యజమాని ఒక ఎద్దు తాడు కోశారు. దాని తోక పట్టుకొని ఒడ్డుకు చేరారు. రెండో ఎద్దును కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బండితోసహా అది పాములలంక రేవు వరకు కొట్టుకుపోగా ఎద్దు మెడకు తాడు బిగుసుకుపోయి నదిలోనే మృతి చెందింది. తర్వాత పడవ సహాయంతో వాటిని ఒడ్డుకు చేర్చారు. సుమారు రూ.60వేల విలువ చేసే ఎద్దు మృతి చెందటంతో యజమాని కన్నీరుమున్నీరయ్యారు. ప్రకాశం బ్యారేజీ నుంచి బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వరద నీటిని వదిలారు. ఈ సమాచారాన్ని రెవెన్యూ అధికారులు గ్రామాల్లో తెలియజేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని