భర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం

బాపట్ల జిల్లా భర్తిపూడి గ్రామంలో బుధవారం రాత్రి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని వైకాపా సానుభూతిపరులు ధ్వంసం చేశారు.

Updated : 08 Dec 2023 05:12 IST

అయిదుగురిపై కేసు.. నిందితులు  వైకాపా సానుభూతిపరులు
వారిలో ఒకరు గ్రామ సచివాలయ ఉద్యోగి
తెదేపా శ్రేణుల నిరసన

 బాపట్ల (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా భర్తిపూడి గ్రామంలో బుధవారం రాత్రి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని వైకాపా సానుభూతిపరులు ధ్వంసం చేశారు. విగ్రహం తలను పూర్తిగా తొలగించి నేలపై పడేశారు. గురువారం ఉదయం ఈ విషయం వెలుగు చూసింది. దీంతో తెదేపా శ్రేణులు అప్పికట్ల వద్ద జీబీసీ రహదారిపై ధర్నా చేశాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అయిదుగురిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

నిందితుల్లో పులి శివనాగరాజు (ఎ1), గూడూరు వెంకటేశ్వరరావు (ఎ2), పులి కిషోర్‌ (ఎ3), మామిడిశెట్టి గోపీనాథ్‌ (ఎ4), పులి నాగేంద్రబాబు (ఎ5)లు ఉన్నారు. వీరిలో ఎ1 భర్తిపూడిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌ (ఇతని తండ్రి పులి బ్రహ్మయ్య, గుడిపూడి ఎంపీటీసీ సభ్యుడు), ఎ3 మద్యం దుకాణంలో క్లర్క్‌ (ఇతని తండ్రి వెంకటేశ్వరరావు గ్రామంలో వైకాపా నాయకుడు). ఎ5 పూండ్ల గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, ఎ2-రైతు కూలీ కాగా, ఎ4-గ్రామంలో ఎరువుల దుకాణం నిర్వాహకుడు. వీరంతా కుట్ర పన్ని ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాపట్ల నియోజకవర్గ తెదేపా బాధ్యుడు వేగేశ్న నరేంద్రవర్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

జెండా దిమ్మె వద్దన్నందుకేనా?

ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం ఘటన ముమ్మాటికీ కక్షపూరితమేనని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. నవంబరు 20న ఈ విగ్రహం ఎదుట వైకాపా జెండా దిమ్మె ఏర్పాటుకు యత్నించారు. తెదేపా వర్గాలు అడ్డుకోవడంతో పోలీసులు ఒక్కో వర్గం నుంచి పదిమంది చొప్పున బైండోవర్‌ చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వైకాపా జెండా దిమ్మెను గ్రామస్థులు తొలగించారు. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం ఘటనను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ‘‘అర్ధరాత్రి వెళ్లి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్య. మహనీయులను అవమానించడం వైకాపా ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

తెలుగువారికి జరిగిన అవమానం: నందమూరి బాలకృష్ణ

‘‘తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‌. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలుగువారిని అవమానించడమే. విద్వేషాలు రెచ్చగొట్టాలనే కుట్రలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి’’  అని బాలకృష్ణ పేర్కొన్నారు.

గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన నేడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాలైన గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తెదేపా అధినేత చంద్రబాబు 8, 9 తేదీల్లో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు 10:30 గంటలకు తెనాలిలోని నందివెలుగు చేరుకుంటారు. అనంతరం అమృతలూరు, నగరం, కర్లపాలెం మండలాల్లోని పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. రాత్రి బాపట్ల పట్టణంలో బస చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని